సార్వత్రిక ఎన్నికల పరిస్థితి వేరు
ప్రజాశక్తి - తెనాలి(గుంటూరు) : సార్వత్రిక ఎన్నికలలో కూటమి బలోపేతం కోసం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయంతో కొంత వెనక్కు తగ్గిన మాట వాస్తవమేనని కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ పరిస్థితి ఉండదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. శుక్రవారం పట్టణంలోని వివిధ వార్డులలో పర్యటించిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. కొన్ని సామాజిక మాధ్యమాలలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫార్ములానే స్థానిక సంస్థల ఎన్నికలలో కొనసాగుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారు సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వెనక్కి తగ్గామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి సార్వత్రిక ఎన్నికలలో అవకాశం దక్కకపోయినా భవిష్యత్తు లో సముచిత న్యాయం జరుగుతుందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారని అన్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ అవకాశం ఉన్న మేరకు పోటీ చేస్తుందని, పార్టీ శ్రేణులు కూడా అన్ని విధాలుగా పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారు. పరోక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ క్యాడర్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.







కామెంట్‌లు (0)