టిడిపి ఎమ్మెల్యే గల్లా మాధవి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రాన్ని 'స్వర్ణాంధ్ర' 2047గా మార్చే ప్రక్రియలో భాగంగా తీసుకొచ్చిన ‘సంజీవిని ప్రాజెక్ట్’ దేశానికే రోల్ మోడల్ అని టిడిపి ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను సృష్టించడం కోసం ప్రవేశపెట్టిన 'సంజీవిని ప్రాజెక్ట్' ప్రతి కుటుంబానికి రక్షణగా నిలవబోతోందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడికి పూర్తి స్థాయి ఆరోగ్య భద్రత లభిస్తుందని వివరించారు. ఇప్పటికే రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు.
‘మద్యం’ విచారణతో జగన్ ఇంట్లో వణుకు:మాజీ మంత్రి దేవినేని
వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్యం, హవాలా కుంభకోణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ప్రారంభం కావడంతో మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇంట్లో వణుకు మొదలైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. .జగన్ తాడేపల్లిలోని తన ఇంటిని కేంద్రంగా చేసుకొని వేలాది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి, నాసిరకం మద్యాన్ని అమ్మడం వల్ల ఐదేళ్లలో దాదాపు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది కిడ్నీ, లివర్ వ్యాధుల బారిన పడ్డారని చెప్పారు.రాష్ట్రంలో జరిగినఅతిపెద్ద మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసిపి నేతలు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం, హవాలా కుంభకోణాల ఉచ్చు వైసిపి నాయకుల మెడకు బిగుసుకుందని, ఈ కేసులో జగన్ అరెస్ట్ కావడం ఖాయమని తెలిపారు. వైసిపి పాలనలో గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా మారి, పూర్తిగా దోపిడీకి గురైన ఉత్తరాంధ్రాను కూటమి ప్రభుత్వం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పెట్టుబడుల రాజధానిగా మారుస్తోందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మరో సమావేశంలో అన్నారు.









కామెంట్‌లు (0)