- కనీస వేతనం 26వేలు చెల్లించాలని డిమాండ్
- ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నినాదాలు
ప్రజాశక్తి-కాకినాడ : అంగన్వాడి ఆశ మధ్యాహ్నం భోజన పథక కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26వేలు చెల్లించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఇంటికి నాగమల్లి తోట జంక్షన్ నుండి ర్యాలీగా ఇంటి వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఉద్యమకారులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీ అనుచరులకు అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, కాకినాడ జిల్లా అధ్యక్షులు దువ్వ శేషుబాబ్జి, అంగన్వాడీ, ఆశా సంఘాల ప్రధాన కార్యదర్సులు చంద్రావతి, చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ 2014 మొదలుకొని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం తదితర స్కీమ్ వర్కర్లకు ఒక్క రూపాయి వేతనం కూడా కేంద్రం వాటా పెంచలేదని విమర్శించారు. ఈ 12ఏళ్ల కాలంలో ధరలు విపరీతంగా పెరిగి జీతాలు సరిపోక స్కీమ్ వర్కర్ల కుటుంబాలు అప్పలపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాలంలో అంబానీ, అదాని మోడీ స్నేహితులైన పెట్టుబడుదారుల ఆస్తులు వందల రెట్లు పెరగడాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్డీఏలో భాగస్వామి అయిన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎనిమిదేళ్ల నుండి వేతనాలు పెంచకపోవడాన్ని తప్పుపట్టారు. ఎంపీలు ఎమ్మెల్యేల వేతనాలు ప్రతి మూడేళ్లకు ఒకసారి పెంచుకుంటున్నప్పుడు, కరోనా వంటి విపత్కర పతిస్థితులలో సైతం ప్రాణాలకు తెగించి సామాన్య ప్రజలకు, దళితులకు, పేదల పిల్లలకు సేవలు అందించే స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ స్కీం వర్కర్ల సమస్యలపై పార్లమెంటులో గళమెత్తి కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమీ ప్రభుత్వం వేతనాలు పెంపుదలపై నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. డిసెంబర్ 1 నుండి 3 వరకు ఢిల్లీ ముట్టడికి సిద్ధపడాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలకా రమణ, జిల్లా సహాయ కార్యదర్శి దారపురెడ్డి క్రాంతి, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, సత్యనారాయణ, కాళ్ళ నాగేశ్వరరావు
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దడాల పద్మ, ధనలక్ష్మి, నాగమణి, ఎస్తేరు రాణి, రాజేశ్వరి, ఎన్. కె.జ్యోతి, బుల్లెమ్మ, సునీత, జిల్లా కోశాధికారి రామలక్ష్మి, మంగా దేవి, శుభరత్నం, వైవి.రాజేశ్వరి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాయుడు నాగలక్ష్మీ, నొక్కు లలిత, భారతి ప్రియ, లంకా దుర్గాదేవి, ఎం.లక్ష్మీ, నిట్ల ఉమాదేవి, చెక్కల వేణి, మలకా నాగలక్ష్మి, అంకాడి పద్మావతి, రెడ్డి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)