ప్రజాశక్తి - పోలవరం (ఏలూరు జిల్లా) : పట్టిసీమ పుష్కర ఘాట్‌లో కొవ్వాడ కాలువ స్పిల్వే ఎడమ గట్టుకు ఆనుకుని ఉన్న సచివాలయ భవనం సోమవారం కూలిపోయింది. గత ఐదేళ్లుగా వస్తున్న వర్షాలకు గోదావరి వరదలకు పట్టిసీమ కొవ్వాడ కాలువ అవుట్ ఫాల్ స్లూయిజ్ నుంచి ఉధృతంగా ప్రవహించిన కొండవాగుల జలాల తాకిడికి గట్టు క్రమక్రమంగా భవనం అడుగుభాగం వరకూ కోతకు గురవుతూ వచ్చింది. ప్రతి ఏడాది మహాశివరాత్రి ఉత్సవాల సమీక్షా సమావేశాల్లో గట్టు పునరుద్ధరించాలని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు జంగారెడ్డిగూడెం ఆర్‌డిఒ చర్చలు జరిపారే తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ విషయంపై రూ. రెండు కోట్ల బడ్జెట్‌తో శాశ్వత రివిట్‌మెంట్ కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పెట్టామని, తాత్కాలిక రక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన అఖండ గోదావరి రివర్ బండ్ అధికారులు, కొవ్వాడ కాలువ అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇటీవల వచ్చిన మురసు తుపాను ప్రభావంతో కురిసిన అతి భారీ వర్షాలకు భవనం వద్ద గట్టు మరింత ప్రమాదకరంగా కోతకు గురికావడంతో భవనం కూలిపోయింది. గతంలో సచివాలయం భవనంపైన గదిలో గ్రామ రెవెన్యూ కార్యాలయం నిర్వహించేవారు. ఆలయానికి వచ్చే యాత్రికులు, గ్రామస్తులు ఆ భవనం వద్ద సేదతీరేవారు. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల సమీక్షా సమావేశాలు సైతం ఆ భవనం ఎదుటే నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ భవనాన్ని ఖాళీగానే ఉండడంతో ఎటువంటి ప్రాణ నష్టమూ జరగలేదు. పోలవరం ఎస్ఐ పి అప్పారావు, డిప్యూటీ ఎంపిడిఒ రవికుమార్, కార్యదర్శి రాజారావు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.
కాలువలోకి కూలిన సచివాలయ భవనం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026, 08:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)