అమరావతి : ఎపి లో జరుగుతున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు పెద్ద ప్రహసనంగా మారింది. ఆన్ లైన్ లో నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని రాజకీయ పార్టీలు కోరినా ఎస్ఇసి మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కనీసం అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్లు, అఫిడవిట్లు అయినా వెబ్ సైట్ లో పెట్టాలని కోరుతున్నా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఎస్ఇసి (AP SEC) ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఓ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది.
ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన శివకార్తీక్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ఇందులో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని స్దానిక సంస్థల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు సమర్పించిన నామినేషన్లను, అఫిడవిట్లను ఆన్ లైన్ లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఎస్ఇసి వివరణ కోరింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్.. నామినేషన్లు, అఫిడవిట్లు వెబ్ సైట్లో ఉంచేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్ధుల నామినేషన్లతో పాటు అఫిడవిట్లను ఆన్ లైన్ లో ఉంచడం వల్ల వాటిలో ప్రత్యర్థులు తప్పులు వెతికి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ ఎస్ఇసి ఆ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం వల్ల అధికారుల్ని అభ్యర్ధులు వీటిపై ప్రశ్నించే పరిస్దితి లేదు. కానీ ఇప్పుడు అధికారులకు అభ్యర్ధుల నామినేషన్లను, అఫిడవిట్లను ఆన్ లైన్ లో ఉంచేలా ఆదేశాలు ఇచ్చినట్లు ఎస్ఈసీ హైకోర్టుకు హామీ ఇవ్వడంతో ఇప్పుడు.. వారి వివరాలు అందరికీ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో ఎన్నికల అధికారుల పాత్రపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో హైకోర్టుకు ఎస్ఇసి ఇచ్చిన హామీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది. కాబట్టి ఇప్పుడు చేయగలిగేదేమీ లేదు. మిగతా ఎన్నికలకు మాత్రం అభ్యంతరాల్ని వ్యక్తం చేసే అవకాశం దొరుకుతుంది.








కామెంట్లు (0)