గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగోపాల్‌ పూర్‌ వద్ద తీరం దాటనున్న తీవ్ర తుపాను

14 నిమిషాల క్రితం

Another cyclone in the Bay of Bengal - heavy rains in AP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 12:54 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఒరిస్సాలో 1.20లక్షల మందికి పైగా తరలింపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో, భువనేశ్వర్‌ :పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అక్వాన్’ ఉత్తర దిశగా కదులుతోందని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం సాయంత్రానికి గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ తుపాను ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల వైపు పయనిస్తోందని సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌ప్రఖర్‌‌జైన్‌ ‌ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కళింగపట్నంకు 270 కిలోమీటర్లు, గోపాల్‌పూర్ 350 కిలోమీటర్లు, నరసాపురానికి 380 కిలోమీటర్లు, పూరీకి 420 కిలోమీటర్లు, చెన్నైకు 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. ఈ తుపాను ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ శుక్రవారం మధ్యాహ్నానికి నరసాపురం, పూరీ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు తూర్పున ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణ ఒడిశా తీరాన్ని దాటే అవకాశముందని పేర్కొన్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచవచ్చని తెలిపారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

​ఒడిశాలో సురక్ష‍ిత ప్రాంతాలకు ప్రజల తరలింపు

ఒరిస్సా ప్రభుత్వం గురువారం ప్రజల తరలింపును ఉధృతం చేసింది. ఇప్పటివరకు లక్షా ఇరవై వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 300కి పైగా విపత్తు నిర్వహణా బృందాలను మోహరించింది. దక్షిణ, తీర ప్రాంత జిల్లాల్లోని రిజర్వాయర్లలో నీటిని కింది ప్రాంతాలకు విడుదల చేస్తోంది. 9,299 సైక్లోన్‌ ‌షెల్టర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, వీరిలో పది వేల మందికి పైగా గర్భిణులు వున్నారని ప్రత్యేక రిలీఫ్‌ ‌కమిషనర్‌ ‌కార్యాలయం వెల్లడించింది. గోపాల్‌‌పూర్‌ ‌వున్న గంజాం జిల్లా నుండే 50వేల మందికి పైగా తరలించారు. గజపతి, కాందమాల్‌ ‌జిల్లాల నుండి కూడా వేలాదిమందిని ఖాళీ చేయించారు. కొండచరియలు విరిగిపడతాయన్న భయంతో ఘాట్‌ ‌రోడ్లను మూసివేశారు.

41 రైళ్ల రద్దు

19, 20, 21 తేదీల్లో తిరగాల్సిన 41 రైళ్లను ఈస్ట్‌ కోస్ట్‌ ‌రైల్వే గురువారం రద్దు చేసింది. వీటిలో అనేక దూరప్రాంత రైళ్లు ఉన్నాయి. మరో 29 రైళ్లను రీ షెడ్యూల్‌ ‌చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్