మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు తీవ్ర తుపాను..

4 గంటల క్రితం

cyclone
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 01:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 20న నెల్లూరు, తుని మధ్య తీరాన్ని దాటే అవకాశం

- భారత వాతావరణ సంస్థ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతోందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. గత ఆరు గంటలుగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఇది సోమవారం శ్రీలంకలోని టింకోమలీకి తూర్పు ఈశాన్యంగా 630 కిలోమీటర్లు, అండమాన్ నికోబార్ దీవుల్లోని శ్రీ విజయపురానికి పశ్చిమాన 690 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 700 కిలోమీటర్లు, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 800 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ సోమవారం సాయంత్రానికి తేదీ సాయంత్రానికి దక్షిణ, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా, మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ 20వ తేదీ మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్, యానాం తీరాల మధ్య నెల్లూరు, తుని ప్రాంతాల మధ్య అత్యంత తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, యానాంలలో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని తెలిపింది. అదేవిధంగా రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్