మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

WPI: ధరల మోత

1 గంట క్రితం

prices
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 04:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ద్రవ్యోల్బణం అంటే చట్టం చేయకుండానే విధించే పన్ను అన్నారు అమెరికన్ ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రీడ్‌మన్. నేటి పరిస్థితులను చూస్తే ఆ మాట అక్షర సత్యమనిపిస్తుంది. అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి చేరి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన గరిష్ఠ పరిమితిని దాటేసింది.​ 2024 అక్టోబర్‌లో నమోదైన 6.21 శాతం తర్వాత ఇదే అత్యధికం. గృహ వినియోగ ఖర్చులపై పెరుగుతున్న ఒత్తిడికి ఇది స్పష్టమైన సంకేతం. ఇందులో ప్రధానమైంది అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న నిత్యావసర ధరలు. ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 7.74 శాతం ఉండగా అక్టోబర్‌లో 8.94 శాతానికి ఎగబాకింది. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లుపడుతుంది. ఎన్ఎస్ఒ గణాంకాల ఆధారంగా, బియ్యం (12.5 శాతం), చిరుధాన్యాలు (38 శాతం), ఉల్లి (116 శాతం), పప్పుధాన్యాలు, వంటనూనెలు, మసాలాలు ఇలా అనేకం పెరిగాయి. ధరల్లో వచ్చిన భారీ పెరుగుదల సామాన్య కుటుంబాల ఆర్థికతను నేరుగా దెబ్బతీస్తోంది. మాంసం, చేపలు, గుడ్లు వంటి ప్రొటీన్‌ ఆహారాల ధరలూ అధికంగానే ఉన్నాయి. అలాగే, వాణిజ్య ఎల్‌పిజి ధర గత నెలలో సిలిండర్‌కు రూ.62.5 పెరగడంతో రెస్టారెంట్లు, వసతి సేవల ధరలు 10 శాతం మేర పెరిగాయి. అమెరికా, ఇరాన్ ఘర్షణతో సరఫరా గొలుసులు దెబ్బతిని, ముడి పదార్థాల ధరలు పెరిగాయి. కార్ల తయారీదారులు, వినియోగ వస్తువులు, ఎఫ్ఎంసిజి సంస్థలు ఆ భారాన్ని వినియోగదారులపైకి నెట్టేస్తున్నాయి.

ఈ ధరల పెరుగుదల రెక్కాడితే కానీ డొక్కాడని జనం జీవితాలను నేరుగా కుదిపేస్తోంది. ఆదాయంలో పెద్ద భాగం ఆహారం, ఇంధనం, రవాణా, విద్యుత్‌ వంటి అవసరాలకే ఖర్చవుతుండటంతో, వాటి ధరలు పెరిగినప్పుడు కుటుంబాలు ఇతర ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తుంది. తక్కువ ఆదాయ కుటుంబాలు పౌష్టికాహారాన్ని తగ్గించుకోవడం లేదా వైద్యం, విద్య వంటి అవసరాలను వాయిదా వేస్తూ బతుకీడుస్తున్నాయి. పొదుపు చేయడం మాట అటుంచి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ధరాభారం కుటుంబాల ఆర్థిక భద్రతను, జీవన ప్రమాణాలను కూడా దెబ్బతీస్తుంది. ఆర్‌‌బిఐ అక్టోబర్‌లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి, తక్కువ వడ్డీ రేట్ల శకం ముగిసిందని స్పష్టం చేసింది. రెపో రేటు ప్రస్తుతం 5.5 శాతం ఉండగా, రాబోయే నెలల్లో మరో 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు పెరిగి 6.25 శాతానికి చేరవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌లో పెంపు దాదాపు ఖాయమని భావిస్తున్నారు. బ్యారెల్ చమురు 100 డాలర్లకు చేరువలో ఉంది. రుణ వ్యయం పెరిగితే గృహ, వాహన, చిన్న పరిశ్రమల రుణాలు భారమవుతాయి. గ్రామీణ వినియోగంపై దెబ్బ పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూపాయి విలువ రికార్డు కనిష్ఠానికి పడిపోయింది. ఈ ఏడాది విదేశీ పెట్టుబడిదారులు 30 బిలియన్ డాలర్లకు పైగా వెనక్కి తీసుకున్నారు.

ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రిజర్వ్ బ్యాంక్‌కు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం అత్యవసరం. వడ్డీ రేట్లు పెంచితే రుణాల ఖర్చు పెరుగుతుంది. వినియోగం, పెట్టుబడులూ తగ్గే ప్రమాదమూ లేకపోలేదు. ఇప్పటికే ధరల భారాన్ని మోస్తున్న కుటుంబాలకు గృహ, వాహన, చిన్న వ్యాపార రుణాల వాయిదాలు మరింత భారమవుతాయి. ఆర్‌‌బిఐ వడ్డీ రేట్ల పెంపు ఒక్కటే పరిష్కారమని భావించడం సరికాదు. ఆహార ధరలను స్థిరపర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల సరఫరా, నిల్వలు, రవాణా, మార్కెట్‌ వ్యవస్థపై తక్షణ చర్యలు తీసుకోవాలి. అవసరమైన చోట నిల్వల విడుదల, రైతులకు సరైన ప్రోత్సాహం, పంట నష్టాలకు ఉపశమన చర్యలు, ధరలపై పారదర్శక సమాచారం వంటివి పాలకులు అమలుచేయాలి. తక్కువ వర్షపాతం ప్రభావాన్ని తగ్గించేందుకు నీటి నిర్వహణ, పంట వైవిధ్యం, వాతావరణ అనుకూల వ్యవసాయానికి, దీర్ఘకాలిక పెట్టుబడులకూ ప్రాధాన్యతనివ్వాలి.

అమృత కాలమని ఎంత ప్రచారం చేసుకున్నా, వృద్ధి ప్రయోజనం ప్రజల కొనుగోలు శక్తిలో కనిపించాలి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే బాధ్యత రిజర్వ్ బ్యాంక్‌ది అయితే, దాని మూలకారణాలను పరిష్కరించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. ధరల అదుపు పేరుతో భారాన్నంతా వడ్డీ రేట్లు, రుణ వాయిదాల రూపంలో ప్రజలపైకి నెట్టకుండా, సరఫరా సమస్యలకు సమన్వయంతో పరిష్కారం చూపాలి. జీవన వ్యయం పెరుగుతున్న తరుణంలో ప్రజల ఆహార భద్రత, కొనుగోలు శక్తి, ఉపాధిని పెంచడమే ఆర్థిక విధానాల లక్ష్యం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒకట్రెండు సరుకులే అందించి అదే సర్వస్వం అన్నట్లు ప్రచారం చేసుకుంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి, బియ్యం లేదా గోధుమలకే పరిమితం కాకుండా పప్పులు, వంటనూనె వంటి 14 రకాల నిత్యావసరాలను ప్రజలకు అందించాలి. ప్రతి కుటుంబానికీ అవసరమైన సరుకులు అందుబాటులో ఉండటం, వాటిని కొనగల ఆదాయం ఉండటం, ఇవే అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి అసలైన కొలమానాలు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్