మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వినాశకర భారత్‌ దిశగా 2047

1 గంట క్రితం

pm modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 04:15 పూర్వాహ్నం | 7 నిమిషాల చదవడం

‘వికసిత భారత్‌ 2047’ పేరుతో మోడీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు రెండు విష పరిణామాలను ముందుకు తెచ్చాయి. ఒకటి : అమెరికా ఆధిపత్యానికి తల వంచడం. రెండు : ప్రజాస్వామ్యాన్ని హతమార్చడం. ఈ రెండు పరిణామాలు నేడు మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతున్నాయి. అమెరికాతో జరిగిన వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాలను ఇప్పటికీ రహస్యంగానే ఉంచుతున్నారు. రూపాయి విలువ పడిపోతున్నది. మన విదేశాంగ విధానాన్ని అమెరికానే శాసిస్తున్నది. మరోవైపు ప్రైవేటీకరణ విధానాలను వేగవంతం చేసి వనరులను, సర్వసంపదలను స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. ఫలితంగా ఆర్థిక అసమానతలు తీవ్రతరమవుతున్నాయి. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. నిరుద్యోగం కట్ట దాటుతోంది. విద్యా వైద్యం అందని కుసుమంగా మారింది. ఈ స్థితిలో యువతరం (జెన్‌-జి) శిరమెత్తి పిడికిలి బిగించి ప్రశ్నిస్తోంది. ఢిల్లీ మొదలుకొని గల్లీ వరకు ఆందోళనలు సాగుతున్నాయి. నిన్నటి వరకు వామపక్షాలు ఏమి చెప్పాయో నేడు యువత అదే నినదిస్తున్నది. ఇది గుర్తించిన మోడీ ''దిమాగీ నక్సల్‌'' అంటూ ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి కుట్ర పన్నుతున్నారు. యువత గొంతు నొక్కడానికి మోడీ అన్ని రకాల నిరంకుశ అస్త్రాలను ప్రయోగిస్తున్నాడు. ఇప్పటి వరకు యువతకు రాజకీయాలే వద్దన్నవాళ్ళు ఇప్పుడు ఓటు హక్కును కూడా లాగేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో ఓటున్న వాళ్లని పోలింగ్‌ బూత్‌లోకి రానీయకుండా గుద్దేసుకున్నారు. బిజెపి బాటలోనే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా నడుస్తోంది. ఆర్థిక విధానాల్లోనే కాకుండా ఆఖరికి మత రాజకీయాలకు కూడా పాల్పడుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూటమి ఓటమికి మత మార్పిడులు కారణమన్న చంద్రబాబు నిర్థారణ రానున్న ప్రమాదానికి సంకేతం. ఈ నేపథ్యంలో విశాఖలో ఈనెల 12,13 తేదీలలో 31వ భాగస్వామ్య సదస్సు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సిఐఐ (పెట్టుబడిదారుల సంఘం) నిర్వహించింది. ఇందులో జరిగిన చర్చలు, ఒప్పందాలు, ప్రకటనలు పరిశీలిస్తే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన కలగక మానదు.

80 లక్షల ఉద్యోగాలెక్కడ ?

2024 తర్వాత జరిగిన రెండు సమ్మిట్‌లలో రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు, అందులో 73 శాతానికి అనుమతులిచ్చినట్లు, 51 శాతం ప్రారంభమైనట్లు లోకేష్‌బాబు చెప్పారు. ఇదే సదస్సులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 76 శాతం కార్యరూపం దాల్చినట్లు చెప్పారు. ఆయనే రూ.7.3 లక్షల కోట్ల విలువగలిగిన 303 ప్రాజెక్టులు (32 శాతం) వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని ప్రకటించారు. నిజానికి 2016 నుండి ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలు 10 శాతం కూడా వాస్తవ రూపం ధరించలేదు. ఉద్యోగాలు 2 శాతం లోపే వచ్చాయి. పొంతన లేని లెక్కలతో అసలు వాస్తవాలను మరుగుపరుస్తున్నారు. ఉదా : రిలయన్స్‌ గ్యాస్‌ లక్ష కోట్ల పెట్టుబడి పెట్టి 50 వేల ఉద్యోగాలిస్తామని హామీచ్చారు. కాని ఇచ్చినవి 3200 మాత్రమే. కియాలో 30 వేలు ఉద్యోగాలిస్తామని 12 వేలు కూడా ఇవ్వలేదు. పై పట్టికను పరిశీలించండి.

​పై లెక్కల ప్రకారం 80 లక్షల ఉద్యోగాలివ్వాలి. యువత వీటిపై ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించాలి.​

చిన్న పెట్టుబడిదారులకు చేయూత ఏది?

ఈసారి విశాఖ సమ్మిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ప్రోత్సాహం లభించలేదు. పెట్టుబడిదారులు చాలా మంది మొహం చాటేశారు. వచ్చిన వారిలో ఆంధ్రా, హైదరాబాద్‌ వాసులే ఎక్కువ. విదేశీ రాయబారులు కొందరొచ్చారు. మీడియా మేనేజ్‌మెంట్‌తో ‘ఆహా ఓహో’ అనిపించారు. అమిత్‌ షా సైతం డుమ్మా కొట్టారు. ఈ సమ్మిట్‌కు ముందు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎం.ఎస్‌.ఎం.ఇ (చిన్న పెట్టుబడులతో నడిచే పరిశ్రమలు) ప్రాంతీయ సదస్సులు జరిగాయి. విశాఖలో జరిగిన రెండు రోజుల సమ్మిట్‌లో రూ.9.02 లక్షల కోట్ల విలువగలిగిన 109 ఒప్పందాలు కాగా1.98 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు వచ్చాయి. అదే ప్రాంతీయ సదస్సుల్లో రూ.85 వేల కోట్ల పెట్టుబడులతో 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాలన్నీ వాస్తవ రూపం ధరించవన్నది నిజం. గత అనుభవమూ అదే. కానీ ఉన్నంతలో చిన్న పరిశ్రమల్లోనే ఎక్కువ ఉపాధి కల్పించబడుతుందన్నది సత్యం. పై అంకెలను పరిశీలిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధి లభించేది చిన్న పరిశ్రమల్లోనేనన్నది స్పష్టం. కానీ ప్రభుత్వ దృష్టి అంతా బడా పెట్టుబడులపైనే ఉంది. వారికోసమే స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ప్రవేశపెట్టింది. విశాఖ సదస్సులోనే 30 జీవోలను ప్రభుత్వం సృష్టించింది. ఇందులో ఏమున్నదో ఎవరికీ తెలియదు. అంతా రహస్యమే. కానీ చిన్న పెట్టుబడిదారులకు గత నాలుగు సంవత్సరాలుగా ఇవ్వాల్సిన 5 వేల కోట్ల సబ్సిడీలు ఇంతవరకూ విడుదల చేయలేదు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రూ.1200 కోట్ల బకాయిలు ఉన్నాయి. వారికివ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా ప్రాజెక్టులు ప్రారంభించకుంటే చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నది. విశాఖ సదస్సులో బడా కార్పొరేట్లకు కేటాయించిన భూములను ఇతర అవసరాలకు మళ్ళిస్తే రద్దు చేస్తాం అని చంద్రబాబు నాయుడు హూంకరించారు. రైతులు ముఖ్యంగా యువతరంలో వస్తున్న అసంతృప్తిని చల్లార్చేందుకే ఆయన కొని తెచ్చిపెట్టుకున్న ఆగ్రహాన్ని ప్రదర్శించారు. నిజానికి గత 20 సంవత్సరాల్లో పెట్టుబడిదారులకిచ్చిన భూములు 80 శాతం ఖాళీగా ఉన్నా ఒక్క సెంటు కూడా వెనక్కి తీసుకోలేదు. అదే విశాఖలో నాలుగేళ్ళ క్రితం జగన్‌ ప్రభుత్వం డేటా సెంటర్‌ పేరుతో అదానీకి 300 ఎకరాలు కేటాయించింది. అది ఇప్పటికీ వారి స్వాధీనంలోనే ఉంది. అక్కడ డేటా సెంటర్‌ ప్రారంభించకుండానే చంద్రబాబు ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల పేరుతో గూగుల్‌తో కలిపి 600 ఎకరాలు కేటాయించింది. పాత 300 ఎకరాలను వెనక్కి తీసుకునే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు.

సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ

అంతర్జాతీయ పరిస్థితి అనిశ్చితంగా ఉన్నా భారతదేశం రాబోయే 20 ఏళ్ళలో తిరుగులేకుండా పురోగమిస్తుందని, నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమిస్తామని జర్నలిస్టు పాల్కీ శర్మతో జరిగిన చర్చల్లో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఒకవైపు విశాఖ సదస్సే నిరాశాజనకంగా జరిగినా మరోవైపు ఆయన పెట్టుబడిదారుల్లో ఆశ నింపేందుకు, యువతరాన్ని భ్రమల్లో ముంచేందుకు శక్తి కొద్దీ ప్రయత్నించారు. హైదరాబాద్‌లో జరిగిన భారత్‌ సమ్మిట్‌లో ఫ్రాన్స్‌ మాజీ పార్లమెంటు సభ్యుడు ఫ్రెడరిక్ జైన్క్సి మాట్లాడుతూ భవిష్యత్‌పై ఆందోళనతోనే యువతరం తిరుగుబాటు చేస్తున్నదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఫ్రాన్సులోనేగాక ఇటలీ, బెల్జియం, జర్మనీ, సెర్బియా ఆఖరికి అమెరికాలో సైతం యువతరం తిరుగుబాటు చేస్తున్నది. అమెరికా విదేశాంగమంత్రి మార్క్‌ రూబియో మాట్లాడుతూ సోవియట్‌ ఓడిపోయినా మార్క్సిజం మీద గెలవలేకపోతున్నామని చెప్పాల్సి వచ్చింది. కాని చంద్రబాబు మాత్రం ఇది మన దేశం సరిహద్దులు దాటి రాదని ఆశపడుతున్నారు. ప్రపంచ పరిస్థితులు అర్థంగాక అంటున్నారా? లేదా ఆత్మవంచనతో మాట్లాడుతున్నారా? తెలియదు. ఆరు నెలలక్రితం ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌ లాంటి పరిణామాలు మనదేశంలో జరగవని ఘంటాపథంగా చెప్పారు. ఆ మాట అన్న నెల రోజుల్లోనే ఢిల్లీలో కాక్రోచ్‌ల పేరుతో జెన్‌-జీ ఉద్యమం ఆరంభమైంది. నేటికీ అది ఊపుగానే సాగుతున్నది. మోడీ పీఠాన్ని కదిలిస్తున్నది. ఇవేమీ చంద్రబాబు నాయుడు గారు గుర్తించనట్లే నటిస్తున్నారు.​

సంస్కరణలు ఏమి సాధించాయి?

పాల్కీ శర్మకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు ఆనాడు తాను సంస్కరణలు ప్రారంభించే నాటికి (1999) ల్యాండ్‌లైన్‌ ఫోన్లు, కరెంటు, రోడ్లు, బస్సుల కష్టాల గురించి వివరించారు. నేడు సాధించిన అభివృద్ధి ఎంత గొప్పదో విపులీకరించారు. కాని ఆయన మరో విషయం చెప్పలేదు. నాడు ఎవరూ ఊహించని విధంగా నేడు మంచి నీళ్లు, విద్య, వైద్యం, విద్యుత్‌ ఎలా ఖరీదుగా మారి అప్పులపాలు చేస్తున్నాయో, వ్యవసాయం గిట్టుబాటు కాక రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయో, ఉపాధి లేక వలసలు ఎలా పెరిగాయో చెప్పలేదు. సంపద సృష్టించబడింది. కానీ ఆ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమైంది. అత్యధికులు సంపద కోల్పోయి బికారుల య్యారు. 20 లక్షల మంది రైతులు భూములు కోల్పోయి వ్యవసాయం నుండి వైదొలిగారు. 22 లక్షల ఎకరాల సాగుభూమి తగ్గిపోయింది. 2015 నుండి 2 లక్షల ఎకరాల సాగుభూమిని ప్రభుత్వం అభివృద్ధి పేరుతో గుంజుకుంది. ఈ పరిణామాల గురించి ఆయన మాట్లాడటం లేదు.

బ్రాండ్‌ ఇండియా ఎక్కడ ?

దేశ దేశాల ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్ళు సాగించే మార్కెట్‌ డంప్‌యార్డుగా దేశాన్ని మారుస్తున్నారు. మోడీ 12 సంవత్సరాల పాలనలోగానీ లేదా చంద్రబాబు ఏలుబడిలో కానీ ప్రపంచంలో చెప్పుకోదగిన భారత్‌ బ్రాండ్‌ ఉత్పత్తి ఏమైనా జరిగిందా? మన ఐ.టి ఘనత డేటా ఎంట్రీలకే పరిమితమైంది. మేధోవలసతో మన శక్తినంతా అమెరికా కంపెనీలకు ధారపోశామన్నది నిజం కాదా? కొరియా, జపాన్‌, అమెరికా, చైనా ఉత్పత్తులు చూపించి ఇదే ఆత్మ నిర్భర భారత్‌ అనమంటున్నారు. ఇది సిగ్గుచేటు కాదా?

రైతులు, కార్మికులకు రక్షణ ఏది?

విశాఖ సదస్సులో పెట్టుబడికి రక్షణగా చట్టం తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీన్నిబట్టే ఇప్పటి వరకు పెట్టుబడిదారులు విశ్వాసంతో లేరనే విషయం వెల్లడవుతోంది. సంక్షోభంలో ఉన్న పెట్టుబడిదారులు రాష్ట్రాల మధ్య ఉన్న పోటీని ఉపయోగించుకొని వీలైనన్ని వనరులు కొల్లగొట్టి వీలైనంత ఎక్కువ లాభం దోచుకోవడానికి అర్రులు చాస్తున్నారు. వారి ఆకలి తీర్చడానికే రక్షణ చట్టం తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంటే దానర్థం వారి లాభాలకు గ్యారెంటీ ఇస్తామని. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో తమ ప్రభుత్వం ఎంత వేగంగా పని చేస్తుందో చంద్రబాబు, లోకేష్‌ కొన్ని ఉదాహరణలిచ్చారు. కియా పరిశ్రమకు ఆగమేఘాల మీద నీళ్ళివ్వడం, అదానీ గూగుల్‌ డేటా సెంటర్‌కు, శ్రీసిటీలో ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలకు అనుమతులు, ఎస్క్రో ఖాతా తెరవడం వగైరా... ఇవన్నీ వాస్తవాలే. అయితే అంతే వేగంగా రాయలసీమకు సాగునీరు, విశాఖకు మంచినీళ్ళు అందించారా అన్నది ప్రశ్న. గత రెండు సంవత్సరాలుగా విశాఖ ప్రజలకు ప్రత్యేకించి డేటా సెంటర్‌ ఉన్న అరిలోవలో రెండు, మూడు రోజులకొకసారి కూడా మంచినీళ్ళు ఇవ్వడం లేదు. ఈ సంవత్సరం ఖరీఫ్‌ ప్రారంభం నుండే ఎల్‌నినో దెబ్బకు వర్షాలు పడక కరువు కాటకాలతో అల్లాడుతున్న రాష్ట్రంపై గోరుచుట్టుపై రోకటి పోటు లాగా తుఫాన్‌ల మీద తుఫాన్‌లొచ్చి పడిపోతున్నాయి. అయినా ఇంత వరకు నష్టంపై ఎన్యుమరేషన్‌ జరగలేదు, పరిహారం చెల్లించలేదు, బాధితులకు కనీస సహాయం కూడా అందలేదు. మరి ఆ స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఇక్కడేమైంది? అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా పెట్టుబడిదారుల కోసమే పని చేస్తున్నట్లుగా దీన్నిబట్టి రుజువవుతున్నది.

శ్రమ లేకుండానే ఉత్పత్తి జరుగుతుందా?

పెట్టుబడులొస్తే ఆటోమేటిక్‌గా అభివృద్ధి జరిగిపోతుందన్న భ్రమలు చంద్రబాబు సృష్టిస్తున్నారు. పట్టుబడిదారులు మనపై దయతో రావడం లేదు. నిర్దాక్షిణ్యంగా లాభాలు పిండుకోడానికి వస్తున్నారు. అది వాళ్ళ సొంత పెట్టుబడి కూడా కాదు. బ్యాంకుల నుండి, షేర్‌ హోల్డర్ల నుండి సమీకరిస్తారు. నష్టాల పేరుతో వాళ్ళనే ముంచేస్తారు. పెట్టుబడులు వచ్చేకొద్దీ నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు కూడా పెరిగిపోతున్నాయన్న వాస్తవాన్ని ఆయన కప్పెడుతున్నారు. అభివృద్ధిలో ఉత్పత్తి కీలకమైంది. ఆ ఉత్పత్తికి మూలం వ్యవసాయం, పరిశ్రమలు. ప్రస్తుతం వ్యవసాయ రంగం కునారిల్లిపోతుండగా పారిశ్రామిక రంగం స్తబ్దుగా ఉన్నది. గతంలో వేగంగా పరిగెత్తిన సర్వీసు రంగం అలసిపోయి కూర్చున్నది. తిరిగి దాన్ని లేవనెత్తడానికి చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడుతున్నారు. విశాఖ సమ్మిట్‌లో అమరావతిలో స్థలాలు తీసుకోమని పెట్టుబడిదారులను బతిమిలాడుకుంటున్నారు. అదే అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ కుదేలైపోగా ప్లాట్లు దొరికీ దొరకని రైతులు అసంతృప్తితో అల్లాడుతున్నారు. అమరావతి దుస్థితి చూసిన తరువాతనైనా ఆయనకు కనువిప్పు కలగడం లేదు. ఒక శ్రీశైలం, నాగార్జున సాగర్‌ లేదా మరో విశాఖ స్టీలు ద్వారా ఉత్పత్తి జరుగుతుంది. రాజధాని బిల్డింగ్‌లతో రియల్‌ ఎస్టేట్‌ తప్ప ఉత్పత్తి పెరుగుతుందా? రియల్‌ ఎస్టేట్‌ ధరలు పెరిగేకొద్దీ మధ్యతరగతి స్వంత ఇంటి కల కల్లగానే మిగిలిపోతున్నది. మరోవైపు బంగారం రేటు పెరిగి కన్న కూతుళ్లకు తాళి కూడా కొనలేని దుస్థితిలో తల్లిదండ్రులున్నారు. ప్రజల ఆదాయాలు పెరగక, మరోవైపు ధరలు పెరుగుతూ జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ఉన్న సరుకులే అమ్ముడుపోవడం లేదు. కొత్తగా ఉత్పత్తి చేసి ఏమి చేస్తారు? దీనివల్ల ఆర్థిక మాంద్యం పెరుగుతుంది. దానికి ద్రవ్యోల్బణం తోడైంది. రెండూ కలిసి సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. పెట్టుబడిదారుల దగ్గర డబ్బు మూలుగుతున్నా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. కేవలం అత్యంత విలువైన భూములు, మైనింగ్‌ కొట్టేయడానికే యంవోయులు కుదుర్చుకుంటున్నారన్నది బహిరంగ రహస్యం.

శ్రమకేది విలువ?

ఆంధ్రప్రదేశ్‌ను కార్పొరేట్‌ హోమ్‌గా మార్చుకోమని లోకేష్‌ పిలుపునిచ్చారు. ఈ ఇంటిని కార్పొరేట్లకు అప్పగిస్తే ప్రజలెక్కడికి పోవాలో ఆయన చెప్పలేదు. ఊళ్ళూ, భూములు ఖాళీ చేసి కార్పొరేట్లకు అప్పగించి జనం వలసలు పోవాలా? లేదా కార్పొరేట్ల కొట్టాల్లో పాలేర్లుగా మారాలా? లోకేష్‌ దీనికి సమాధానం చెప్పాలి. పెట్టుబడితో మాత్రమే ఉత్పత్తి జరగదు. పెట్టుబడికన్నా కీలకమైంది, పెట్టుబడి కూడా సృష్టించబడేది శ్రమతోనే. ఆ శ్రమను ఉత్పత్తి చేసేది శ్రామికులే. ఆ శ్రామికుల జీవితాలు అధోగతిపాలై ఉన్నాయి. ఉద్యోగ భద్రత లేదు. కనీస వేతనాలు లేవు. పని ప్రదేశంలో ప్రాణాలకు రక్షణ లేదు. రిటైర్‌మెంట్‌ తరువాత బెనిఫిట్స్‌ లేవు. ఇంత అభద్రతా భావం గతంలో ఎన్నడూ లేదు. ఐ.టి గురించి నిరంతరం మాట్లాడే చంద్రబాబు ఆ ఐ.టి ఉద్యోగులే వీధిన పడుతుంటే కనీసం సానుభూతి చూపడం లేదు. పెట్టుబడిదారులతో జరిగే యంవోయులలో ఉద్యోగ భద్రత గురించి ఎలాంటి ఒప్పందాలూ ఉండవు. పెట్టుబడిదారుల లాభాలకు గ్యారెంటీ ఇచ్చే ప్రభుత్వం శ్రామికుల వేతనాలకు మాత్రం ఇవ్వడం లేదు. పైగా వారి హక్కులను అణచివేస్తూ సంఘటితం కాకుండా దెబ్బ కొట్టడానికి లేబర్‌ కోడ్స్‌ను రుద్దింది. అదే పెట్టుబడిదారులపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు. వారి దోపిడీపై ఏ నియంత్రణా ఉండదు. వాళ్ళ పెట్టుబడికి లెక్కలూ చెప్పాల్సిన అవసరం లేదు. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాల్సిన అవసరమూ ఉండదు. పెట్టుబడిదారుల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చాలన్నదే ‘విజన్‌ 2047’ లక్ష్యం. దాన్నే మరో రూపంలో చెప్పాలంటే శ్రామికుల పాలిట నరక కూపంగా మార్చడమే. ఇదే ‘వికసిత్‌ భారత్‌’ అసలు రహస్యం.


- వ్యాసకర్త: వి. శ్రీనివాసరావు

సిపిఐ(యం) ఎ.పి రాష్ట్ర కార్యదర్శి

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్