ఔను నిజమే...!
వాడు బలవంతుడే...!
వాడి చుట్టూ,
మందీ, మార్బలం
మోహరించి ఉండొచ్చు,
కొల్లగొట్టిన సంపద సర్వం,
వాడి పరపతిని పదింతలుగా
పహారా కాస్తూ వుండొచ్చు.
అధికారం వాడి ఇంటి వాకిట
కాపు కాసే కుక్క లెక్క
మొరుగుతూ, వుండొచ్చు.
అబద్ధాలు వండి వార్చే
మీడియా, వాడి అడుగులకు
మడుగులొత్తుతూ...
కల్లబొల్లి కట్టు కథలు
వల్లె వేస్తూ వుండొచ్చు.
కుల మత కుత్సిత
విధానాలు వాడి
విజయానికి భరోసా
కల్పిస్తూ వుండొచ్చు.
ఎన్ని ఆయుధాలు
వాడికిలా ఊడిగం చేస్తున్నా ,
ఎన్ని కుట్రలు వాడి
అధికార దాహానికి
వత్తాసు పలుకుతున్నా,
ఏదో ఒక నాడు...
చలిచీమల చేత జిక్కి
చచ్చిన పెను పాములా
శ్రమ జీవుల చైతన్యం
ఉప్పెనలా ఉప్పొంగి
సమర శంఖం
పూరించకపోదు..
బండ లాంటి వాడి
గుండెలపై పోరు
జండా పాతకపోదు.
- వి. రాజగోపాల్, విజయనగరం.
సెల్: 9133084262







కామెంట్‌లు (0)