మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గెంటేసే కాలం

2 గంటల క్రితం

saa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 02:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

గెంటేయండిరా

గెంటేయండి

ఇంకా ఎంత కాలం‌ గెంటేస్తారు

మీ బహిరంగ ప్రదర్శనలలోంచి

మీ దేవతా రూపాలకు దూరంగా

మీ దరిద్రపు గొట్టు పైత్యాలకు సుదూరంగా

గెంటేయండి రా గెంటేయండి

పెత్తందారీ కుక్క బతుకులకు దూరంగా

మీ అభిజాత్య పైత్యాలకు

మీ అహంకార మురికి కాలువలకు

మీ అధికార మదం సరిహద్దులకు

దూరంగా సుదూరంగా

గెంటేయండి రా గెంటేయండి

ఆడకూతుర్లను, దగాపడ్డ తమ్ముళ్లను

కడజాతులనే‌ ముద్ర వేసి

అందరూ ఆడిపాడే

సమూహాల్లోంచి గెంటేసి

ఇంకా ఎంతకాలం

పండుగ జరుపుకుంటారు

గెంటేయండిరా గెంటేయండి

గెంటేయబడిన వాళ్లంతా

అవమానాల సిర్రా‌చిటికెన పుల్లలతో

కొత్త పోరాట దరువేయటానికి

సిద్ధమవుతున్నారు

మీ వెలివేతల కోటలు బీటలు వారటానికి

అణచివేతల‌ మంటల‌ మీద

యుద్ధ డప్పును కాపడం పెడుతున్నారు

గెంటేయండిరా గెంటేయండి

మీ అహంకారపు ఆధిపత్యాల్లోంచి

మిమ్మల్నే గెంటేసే కాలం

ఇంకెంత దూరమో లేదు!

- చిత్తలూరి,

సెల్‌: 9133832246

(గుజరాత్ లో ఓ దళిత బాలికను ఒక కళాసంస్కృతిక నృత్యం లోంచి గెంటేసిన వార్తను చదివి)


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్