- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్‌బాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో తొలిసారిగా వ్యాధుల నియంత్రణపై సిమ్యులేషన్ ఎక్సర్‌సైజ్‌లు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్‌బాబు తెలిపారు. కృష్ణా జిల్లాలో ఈ నెల 18, 19 తేదీల్లో లెప్టోస్పిరోసిస్‌పై, పశ్చిమగోదావరి జిల్లాలో 20, 21 తేదీల్లో హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (హెచ్‌పీఏఐ)పై తొలి దశ వ్యాయామాలు నిర్వహించనున్నట్లు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆ తర్వాత విశాఖపట్నంలో డెంగ్యూ, విజయనగరంలో స్క్రబ్ టైఫస్, గుంటూరులో కలరా/తీవ్రమైన విరేచనాల వ్యాధులపై సిమ్యులేషన్ వ్యాయామాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.వాస్తవంగా వ్యాధి వ్యాప్తి జరిగినట్లు భావించి, వ్యాధి గుర్తింపు నుంచి నియంత్రణ వరకు ఆరోగ్య వ్యవస్థ, వివిధ ప్రభుత్వ శాఖలు ఎంత సమర్థంగా స్పందిస్తాయో ఈ వ్యాయామాల ద్వారా పరీక్షస్తారని తెలిపారు. వ్యాధిని సకాలంలో గుర్తించడం, సమాచారం చేరవేయడం, దర్యాప్తు, నమూనాల సేకరణ–పరీక్షలు, మందులు–సామగ్రి సమకూర్చడం, ప్రజలకు సమాచారమివ్వడం, వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలను పరిశీలిస్తారని వివరించారు.సాధారణ మాక్‌డ్రిల్‌లో నిర్దిష్ట అత్యవసర చర్యను సిబ్బంది సరిగ్గా నిర్వహించగలుగుతున్నారా అన్నది పరిశీలిస్తారని, సిమ్యులేషన్ వ్యాయామంలో మాత్రం వ్యాధి వ్యాప్తి నుంచి నియంత్రణ వరకు మొత్తం వ్యవస్థ పనితీరును పరీక్షిస్తారని పేర్కొన్నారు. నిఘా వ్యవస్థ, సమాచార మార్పిడి, ప్రయోగశాల సమన్వయం, లాజిస్టిక్స్, ప్రజలకు ప్రమాద సమాచారాన్ని చేరవేయడం, అత్యవసర నిర్వహణ వంటి అంశాల్లో ఉన్న లోపాలను గుర్తిస్తారని తెలిపారు.








కామెంట్‌లు (0)