ఆందోళనలో కుటుంబ సభ్యులు
గాలింపు చర్యలు ముమ్మరం
చేపల వేటకు వెళ్లి 2 వారాలు కాస్తున్నా ఇంటికి చేరని వైనం
ప్రజాశక్తి- యు.కొత్తపల్లి(కాకినాడ జిల్లా)/అమరావతి బ్యూరో : సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. రెండు వారాలు కావస్తున్నా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకార కుటుంబాల కథనం ప్రకారం... కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామ పంచాయతీ పరిధిలోని సుబ్బంపేటలోని గరికిన సింహాద్రికి చెందిన మోటరైజ్డ్ ఫిషింగ్ బోటులో ఆయనతోపాటూ తిరి నారాయణ, గంపల ప్రకాష్, మెరుగు నారాయణ, సూరాడ చిన్న, రాము, సూరాడ కోదండ ఈ నెల 11న సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. 13న సింహాద్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తామున్న ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉందని, వాతావరణం అనుకూలంగా లేదని సమాచారం అందించారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారమూ లేదు. ఇతర ప్రాంతాల్లోని మత్స్యకారులను కుటుంబ సభ్యులు సంప్రదించినా ఆచూకీ లభించలేదు. సముద్రంలో ఈ బోటు ఉన్న ప్రాంతం గుండానే అక్వాన్ తుపాను తీరం దాటినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోటు మునిగిపోయిందా? లేక ఎటువైపైనా కొట్టుకుపోయిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మత్స్యశాఖ, కోస్ట్‌గార్డ్ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
సుబ్బంపేటలో విషాద వాతావరణం
‘త్వరలోనే వచ్చేస్తాం’ అంటూ వెళ్లారని, రెండు వారాలు కావస్తున్నా తమ వారి జాడలేకపోవడం ఆందోళన కలిగిస్తోందని గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ వారి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ‘అమ్మా.. నాన్న ఎప్పుడు వస్తారు’ అంటూ పిల్లలు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తల్లులు తల్లడిల్లుతున్నారు. ఫోన్ మోగితే తమ వారి నుంచే ఏమైనా సమాచారం వచ్చిందేమోనని ఆత్రుతగా చూస్తున్నారు. ఎవరైనా గ్రామానికి వచ్చి ఏదైనా తమ వారి క్షేమ సమాచారం చెబుతారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. గల్లంతు వార్త తెలియగానే ఇతర ప్రాంతాల్లోని మత్స్యకారుల బంధువులు, స్నేహితులు సుబ్బంపేట చేరుకున్నారు. ఆచూకీ త్వరగా గుర్తించాలని ఉప్పాడ మాజీ సర్పంచ్ ఉమ్మిడి జాను కోరారు.
గాలింపు చర్యలపై *ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన మత్స్యకారుల తో సముద్రంలో గల్లంతైన బోటు ఆచూకీ కనుగొనేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యలపై సంబంధిత అధికారులతో సచివాలయంలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్షించారు. ఈ నెల 19 నుంచి ఆ బోటుతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు వివరించారు. మత్స్యకారుల మొబైల్ ఫోన్లు, బోటులోని ట్రాన్స్‌పాండర్ స్విచ్ఛాఫ్ అయ్యాయని, జిపిఎస్ ద్వారా కూడా సమాచారం లభించకపోవడంతో బోటు ఆచూకీ గుర్తించడం కష్టంగా మారిందని తెలిపారు. కాకినాడ, చెన్నై, ఒడిశా కోస్ట్‌గార్డ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గాలింపు కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. భారత కోస్ట్‌గార్డ్ నౌకలు, హెలికాఫ్టర్లతో పారాదీప్ తీర ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు, గాలింపు చర్యలకు సంబంధించిన సమాచారాన్ని వారికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని సిఎం సూచించారు. బోటు ఆచూకీ కనుగొని, మత్స్యకారులను క్షేమంగా తీసుకొచ్చేందుకు గాలింపు చర్యల్లో ఎలాంటి అలసత్వం లేకుండా చూడాలన్నారు.
మరోవైపు మత్స్యకారుల గల్లంతుపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆరా తీశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి గాలింపు చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజుల తరబడి తమవారి కోసం ఎదురుచూస్తున్న మత్స్యకార కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వం తక్షణ రక్షణ చర్యలు తీసుకోవడంతోపాటు, గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని మాజీ సిఎం వైఎస్ జగన్ కోరారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన మత్స్యకారులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని భరోసా ఇచ్చారు.







కామెంట్లు (0)