బలవన్మరణంగా కేసు నమోదు
పోస్టుమార్టం చేయకుండానే దహన సంస్కారాలు
ముమ్మాటికి హత్యే : ప్రతిపక్షాలు
ప్రజాశక్తి- తిరుపతి సిటీ : ప్రముఖ అధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంస్కృతి, సాంప్రదాయాల పట్ల నిత్యం నీతులు వల్లె వేసే బిజెపికి చెందిన నేత ఇంట్లో ఓ మహిళ విగతజీవిగా కనిపిస్తే..అది హత్యో..ఆత్మహత్యో నిర్ధారించకుండానే పోలీసులు తమ వంతు తంతు ముగించారు. సదరు నేతతో వివాహేతర సంబంధం కలిగివున్నట్లుగా చెబుతున్న ఆ మహిళ మరణాన్ని బలవన్మరణంగా నమోదు చేసిన పోలీసులు.. కనీసం పోస్టు మార్టం కూడా చేపట్టకుండానే దహనక్రియలను గుట్టుచప్పుడు కాకుండా ముగించారు. ఈ విషయం తెలిసిన మహిళా సంఘాలు, ప్రతిపక్షాలకు చెందిన స్థానిక నేతలు వివరాలు ఆరా తీస్తే ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, కచ్చితంగా హత్యేనని తేలిందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు..
బిజెపి జిల్లా అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది అయిన సామంచి శ్రీనివాస్ నివాసంలో గత నెల 27వ తేదీన ఓ మహిళ అనుమానస్పద రీతిలో చనిపోయారు. తిరుపతి బస్టాండ్ సమీపంలోని అత్యంత రద్దీగా ఉండే పికె లేఅవుట్లో లక్ష్మీనివాస్ పేరుతో ఆయన నివాసముంది. బిజెపి జిల్లా అధ్యక్షునిగా, కూటమి నేతగా స్థానికంగా ఆయన కుండే పలుకుబడి అంతాఇంతా కాదు. అలాంటి నేపథ్యంలో కార్యకర్తల హడావిడి.. సాధారణ ప్రజా నీకం వెళ్లగలిగే వీలులేని బిజెపి నేత నివాసంలో ఒక గుర్తుతెలియని అనామక మహిళ వెళ్లి చనిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఏమాత్రం సందేహించకుండా ‘గుర్తు తెలియని మహిళ బలవన్మరణం’ అని కేసు నమోదు చేసుకున్నారు. ఆ వెంటనే ఆమెకు దహన సంస్కారాలు కూడా పూర్తి చేశారు.
బిజెపి తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఇంట్లో గుర్తు తెలియని మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు గత నెల 28న తమకు వచ్చిందని, దీనిపై కేసు నమోదు చేసి అంతక్రియులు చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ పోలీసులు సదరు మహిళ మృతదేహాన్ని పరిశీలించకుండానే..కనీసం నిబంధనల ప్రకారం చేపట్టాల్సిన పోస్టుమార్టం కూడా చేయకుండానే హడావిడిగా దహన సంస్కారాలు కూడా పూర్తి చేయడం ఇప్పుడు వివాదస్పదమైంది. అంతేకాకుండా ఈ దారుణ ఘటన నేపథ్యంలోనే ‘లక్ష్మీనివాస్’ పరిసరాల్లో ఉన్న సిసి కెమెరాలు కూడా పనిచేయడం లేదని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు ఆఘమేఘాల మీద అంత్యక్రియలు నిర్వహించడం, పోస్టుమార్టం కూడా జరపకపోవడం, సిసి టివి కెమెరాలు పనిచేయకపోవడం ..ఇవన్నీ చూస్తుంటే మహిళ ఆత్మహత్య చేసుకొని చనిపోలేదని..ముమ్మాటికి హత్య చేసి ఆ తర్వాత బలవన్మరణంగా చిత్రీకరించారని స్థానిక ప్రతిపక్షాల నేతలు, మహిళా, ప్రజాసంఘాలు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడుకి ఆ మహిళతో వివాహేతర సంబంధం ఉందని, వారి మధ్య జరిగిన గొడవలో ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుని ఇంట్లో ఆత్మ‘హత్య’ జరిగితే, కనీసం ఆయనను పోలీసులు విచారించకపోవడం సందేహాలకు తావిస్తోంది. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా, ఎన్నికల హడావుడిలో ఉండటంతో విచారణ చేయలేదని, త్వరలో దీనిపై పూర్తి విచారణ చేస్తామని చెప్పడం కొసమెరుపు. జిల్లా ఎస్పి, ఉన్నతాధికారులు దీనిపై స్పందించి మహిళ మృతి పట్ల పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను బహిర్గత పరచాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
అది హత్యే : భూమన
బిజెపి నేత సామంచి ఇంట్లో మృతి చెందిన మహిళది ఆత్మహత్య కాదని, హత్యేనని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. సదరు మహిళతో ఆ పార్టీ నాయకుడికి వివాహేతర సంబంధం ఉందని, వారిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళను హత్య చేసే ఆత్మహత్యగా చిత్రీకరించారని పేర్కొన్నారు. కనీసం పోస్టుమార్టం కూడా నిర్వహించకుండా అంత్యక్రియలు నిర్వహించడంపై పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
సమగ్ర విచారణకు ఐద్వా డిమాండ్
తిరుపతిలోని బిజెపి జిల్లా అధ్యక్షుడి నివాసంలో మహిళ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి డిమాండ్ చేశారు. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే, గుర్తు తెలియని అనాధ శవంగా భావించి, 24 గంటల తిరగకుండానే అంత్యక్రియలు పూర్తి చేయడం శోచనీయమన్నారు. అనాథ శవాన్ని మార్చురీలో భద్రపరిచి, ఆచూకీ కోసం పోలీసులు విచారణ చేపట్టాలని, కానీ అలా కాకుండా 24 గంటలు కూడా గడవక ముందే హడావుడిగా అంత్యక్రియలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలి.







కామెంట్లు (0)