శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

10,16 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక టీకాలు

3 గంటల క్రితం

ggor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 08:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- డిసెంబర్‌ 3 నుంచి 5వరకు ప్రత్యేక కార్యక్రకమం

- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ చక్రధర్‌ బాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: డిఫ్తీరియా, ధనుర్వాతం వ్యాధుల నుంచి పిల్లలకు అదనపు రక్షణ కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నిర్వహించనునట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కెవిఎన్‌ చక్రధర్‌ బాబు ‌వెల్లడించారు. డిసెంబర్‌ 3 ‌నుంచి 5వ తేది వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో 10, 16 ఏళ్లు పూర్తి చేసుకున్న పిల్లలకు టిడి టీకాలు వేయనునట్లు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. డిఫ్తీరియా, ధనుర్వాతం తీవ్రమైన అనారోగ్యానికి, ప్రాణాపాయానికి దారితీసే అంటువ్యాధులు కావడంతో యుక్తవయసులోనూ రక్షణ కల్పించడం అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఏఎన్‌ఎం తన పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ కళాశాలల జాబితాను సిద్ధం చేసి, టీకా తీసుకోవాల్సిన పిల్లల వివరాలను సేకరించాలని తెలిపారు. ఇప్పటికే యూవిన్‌ పోర్టల్‌లో నమోదు కాని అర్హుల వివరాలను నమోదు చేయాలని, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లని పిల్లలను కూడా గుర్తించి జాబితాలో చేర్చాలని పేర్కొన్నారు. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న పిల్లలకు టీడీ 10, 16 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి టీడీ 16 టీకా వేయాలని తెలిపారు. సాధారణ టీకాల కార్యక్రమంలో ఇప్పటికే సంబంధిత టీకా తీసుకున్న పిల్లలకు మరోసారి వేయకూడదని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జిల్లా స్థాయి పరిశీలకులను నియమించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఈ ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే పిల్లలతో పాటు వాటికి వెళ్లని అర్హులైన పిల్లలందరికీ టీకాలు అందేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా టీకా అధికారులను ఆదేశించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్