బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకార్మిక సంఘాల ఐక్య వేదిక

7 నిమిషాల క్రితం

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా
14న రాష్ట్ర వ్యాప్త నిరసనలు
- కార్మిక సంఘాల ఐక్య వేదిక
- రౌండ్‌ టేబుల్‌లో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టిన కార్మిక నేతలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 12:25 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రౌండ్‌ టేబుల్‌లో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టిన కార్మిక నేతలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల పట్ల వచ్చే నెల 14న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. కార్మికుల రక్షణకు నీళ్లోదిలి కార్పొరేట్‌ ‌సంస్థల పెట్టుబడులకు రక్షణ చట్టం తెస్తామని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించడాన్ని ఐక్య వేదిక నేతలు తప్పుబట్టారు. విజయవాడలోని సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో ‘పెట్టబడిదారులకేనా రక్షణ? కార్మికుల రక్షణ పట్టదా?’ అనే అంశంపై సిఐటియు ఆధ్వర్యాన రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సంపద సృష్టికర్తలైన కార్మికులను ప్రభుత్వాలు విస్మరించడం తగదన్నారు. విశాఖపట్నం భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ మార్పులు, విధానాల మార్పులు, రాజకీయ జోక్యాలతో, కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం నుండి రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులకు రక్షణ కల్పించడానికి అసెంబ్లీలో బిల్లు తెస్తామని, కేంద్రం ఆమోదానికి పంపి దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచేందుకు ఇటువంటి చట్టం చేయాలని కోరతామన్నారని తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలను ప్రభుత్వాలు సవరించడానికి, వాటిని అమలు చేయించటానికి మాత్రం ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదన్నారు. రాష్ట్రంలో గత 13 ఏళ్లుగా 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్‌లోని 50 లక్షల మంది కార్మికులకు వేతన పెంపు లేదన్నారు. సదస్సులో కార్మికులకు రక్షణ గురించి నోరు మెదపని కూటమి ప్రభుత్వ పెద్దలైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నారా లోకేష్‌ పెట్టుబడుల రక్షణ గురించి మాట్లాడటం శోచనీయమన్నారు. కేవలం పెట్టుబడితోనే లాభాలు సృష్టించలేరన్న వాస్తవాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించి కార్మికుల రక్షణ గురించి చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో కనీస వేతనాన్ని వెంటనే సవరించాలని, ప్రభుత్వ విధానాల వలన పెరిగిన ప్రస్తుత ధరలకు అనుగుణంగా, 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులు, 1991 సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా కనీస వేతనాలను రూ.42 వేలుగా నిర్ణయించి అమలు చేయించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రక్షణ కలిగేలా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ అన్ని కేటగిరీల నాన్ పర్మినెంట్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలన్నారు. ఈలోగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య ఈ సందర్భంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. అన్ని సంఘాల నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌‌లో 10 వేల మంది కార్మికులను తొలగించారని, రాష్ట్రంలో వివిధ చెక్కెర కర్మగారాలు మూతపడ్డాయని, లక్షలాది మంది వాలంటీర్లను జీతాలు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అనంతరం విధుల నుంచి తొలగించారన్నారు. ఐఎఫ్‌‌టియు రాష్ట్ర అధ్యక్షులు కె పోలారి మాట్లాడుతూ.. సెజ్‌‌ల పేరుతో గతంలోనూ కార్మికులను ప్రభుత్వాలు కట్టడి చేశాయన్నారు. కార్మిక చట్టాల స్థానంలో లేబర్‌ ‌కోడ్‌లు తెచ్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. ఎఐఎఫ్‌‌టియు రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్‌ ‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బలమైన ఉద్యమాలకు రూపకల్పన చేయాలన్నారు. ఐఎఫ్‌‌టియు రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఎఐసిసిటియు రాష్ట్ర నాయకులు ఉదయ్‌ ‌కిరణ్‌, బిఎస్ఎన్ఎల్ నాయకులు ఎ చంద్రశేఖర్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్బరావమ్మ ఈ సందర్భంగా ప్రసంగించారు. ఈ సమావేశంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, సిఐటియు నాయకులు పి అజయకుమార్, దయా రమాదేవి, ముజఫర్ అహమ్మద్, కెఆర్‌‌కె మూర్తి, ఎన్‌సిహెచ్ శ్రీనివాస్, ఐఎఫ్‌టియు నాయకులు రవీంద్ర, ఎఐసిసిటియు నాయకులు ఎం ఈశ్వర్, ఐఎఫ్‌టియు నాయకులు జి శ్రీనివాసరావు, రైల్వే యూనియన్ నాయకులు వివిఎల్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్