తిరుమలేశం, రామకృష్ణ కుటుంబాలు పక్కపక్కనే ఉంటాయి. కుటుంబాల స్నేహం కారణంగా తిరుమలేశం, రామకృష్ణ మధ్య కూడా స్నేహం ఉంది. ఇద్దరూ వేర్వేరు స్కూళ్లలో చదువుతున్నా కలుసుకున్నప్పుడల్లా తనివితీరా ముచ్చట్లు, ఆటలు ఆడేవారు. ఇద్దరూ ఇష్టపడే ఆట షటిల్. ఆ ఆటలో ఎప్పుడూ రామకృష్ణ గెలుస్తూ ఉండేవాడు. తిరుమలేశం ఓడిపోతూ ఉండేవాడు. అయినా నిరాశ పడకుండా పట్టుదలతో రామకృష్ణతోనే షటిల్ ఆడుతుండేవాడు తిరుమలేశం. వీరిద్దరి ఆటను అప్పుడప్పుడు గమనిస్తూ ఉండేవాడు గిరీశం. ఒకరోజు గిరీశం, తిరుమలేశంతో ‘ఎప్పుడూ నువ్వు షటిల్ ఆటలో ఓడిపోతూ ఉంటావు. నీకు వచ్చిన ఆటలు ఆడవచ్చు కదా! లేకపోతే అదే షటిల్ ఆట వేరే మిత్రునితో ఆడుతూ ఉంటే నువ్వు గెలిచే అవకాశాలు ఉంటాయి కదా!’ అన్నాడు. అప్పుడు తిరుమలేశం ‘నేను ఆడుతున్నది నా ప్రాణమిత్రునితో కాలక్షేపం కోసం. అంతేకాదు. నేను ఒక గొప్ప ఛాంపియన్‌తో ఆడుతున్నాను. ఆట ఆడేటప్పుడు రామకృష్ణను గురువుగా భావించి, నా ఆటను మరింత మెరుగుపరుచుకుంటున్నాను. దాని వల్ల మా పాఠశాలలో నేనే షటిల్ ఛాంపియన్ అవుతున్నా. అంటే నా మిత్రుడు నన్ను ఓడించడం లేదు. గెలిపిస్తున్నాడు’ అన్నాడు. గిరీశానికి జ్ఞానోదయం అయింది.
- సరికొండ శ్రీనివాసరాజు,
80088 48703.







కామెంట్‌లు (0)