బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకుల్గాంలో ఎన్‌‌కౌంటర్

19 నిమిషాల క్రితం

కుల్గాంలో ఎన్‌‌కౌంటర్ 
ఎల్‌ఇటి ఉగ్రవాది లతీఫ్‌ భట్‌ హతం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 12:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎల్‌ఇటి ఉగ్రవాది లతీఫ్‌ భట్‌ హతం

శ్రీనగర్‌ : దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాంలో జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో లష్కర్-ఎ-తైబా (ఎల్‌ఇటి) ఉగ్రవాది లతీఫ్ భట్‌ను భద్రతా దళాలు హతమార్చాయి. కుల్గాంలోని జంగల్‌పోరాలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఎన్‌‌కౌంటర్‌ ‌జరిగింది. లతీఫ్‌ ‌భట్‌ తమపై ముందుగా కాల్పులకు దిగాడని, తరువాత తాము జరిపిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడని భద్రతా సిబ్బంది తెలిపారు. “మేము అతనితో ఫోన్‌లో చాలాసేపు మాట్లాడాము. లొంగిపోమని కోరాము కానీ అతను నిరాకరించాడు. అతను మసీదులో దాక్కున్నందున మేము అత్యంత సంయమనం పాటించాం” అని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) అనాయత్ అలీ చౌదరి తెలిపారు. సోమవారం కుల్గాం లారూ ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లతీఫ్‌ బుల్లెట్‌ గాయాలతో తప్పించుకున్నాడు. ఆ ఎన్‌కౌంటర్‌లో ఉమర్‌ నసీర్‌ దార్‌ అనే మరో ఉగ్రవాదిని దళాలు హతమార్చాయి. తప్పించుకున్న లతీఫ్‌ కోసం సైన్యం, సిఆర్‌‌పిఎఫ్‌ ‌బృందాలు తీవ్రంగా గాలించాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఒక మసీదులో అతడి ఆచూకీ పసిగట్టిన దళాలు చుట్టుముట్టాయి. వీడియోకాల్‌ ద్వారా లొంగిపోవాలని అధికారులు కోరారు. తాము హాని తలపెట్టమని నచ్చజెప్పేందుకు యత్నించారు. కానీ, అతడు మాత్రం తిరస్కరించాడు. ఎట్టకేలకు గంటలసేపు శ్రమించి భద్రతా దళాలు అతడిని హతమార్చాయి. ఈ నెల 11న సిఆర్‌‌పిఎఫ్‌ పోస్టుపై జరిగిన దాడిలో లతీఫ్‌ భట్‌, దార్‌ ‌పాల్గొన్నారు. భట్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఒకడని, కాశ్మీర్ లోయలో ప్రాణాలతో మిగిలిన ఏకైక స్థానిక ఉగ్రవాది అతనేనని పిటిఐ తెలిపింది. ఎల్‌ఇటి సంస్థకు స్థానిక కమాండర్‌గా ఉన్నట్లు సమాచారం. 22 ఏళ్ల భట్‌ కుల్గామ్‌లోని అష్ముజీలోని ఖ్రేవాన్ చాదర్ నివాసి, కార్పెంటర్‌గా పనిచేసేవాడని స్థానికులు చెబుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్