మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవైఎస్‌ జగన్‌కు ఊరట

3 గంటల క్రితం

385904-jagan-mohan-and-andhra-pradesh-high-court.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 12:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పులివెందుల ధర్నా కేసులో స్టే

ప్రజాశక్తి - అమరావతి : వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్‌ జగన్‌‌కు హైకోర్టులో మంగళవారం ఊరట లభించింది. పులివెందులలో ధర్నా నిర్వహించిన ఘటనకు సంబంధించి పులివెందుల టౌన్ పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుదారైన మండల విద్యాశాఖాధికారి సిఎం రఫీక్‌ ఖాన్‌కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసు, ఎన్నికల అధికారుల వ్యవహారశైలిని నిరసిస్తూ ఈ నెల ఒకటిన జగన్‌, కడప ఎంపి వైఎస్‌ అవినాష్‌రెడ్డి తదితరులు పులివెందుల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీనిపై ఎన్నికల విధుల్లో ఉన్న మండల విద్యాశాఖాధికారి సిఎం రఫీక్‌ ఖాన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జగన్‌, అవినాష్‌రెడ్డితోపాటు మొత్తం 80 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదిస్తూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై ఎన్నికల చట్టాల ప్రకారమే చర్యలు తీసుకోవాలని, అంతమాత్రాన క్రిమినల్‌ నేరాలను ఆపాదించలేరని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో జగన్‌ నినాదాలు చేసినట్లు, ఎవరినైనా అడ్డుకున్నట్లు లేదా అమల్లో ఉన్న ఆదేశాలను ఉల్లంఘించినట్లు నిర్దిష్ట ఆరోపణలు లేవన్నారు. కేవలం ఒకచోట సమూహంగా గుమిగూడినంత మాత్రాన క్రిమినల్‌ బాధ్యత విధించలేమని సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు. పోలీసుల తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదిస్తూ.. అనుమతి లేకుండా ధర్నా నిర్వహించడమే కాకుండా ఎన్నికల అధికారులు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మంది సాక్షులను విచారించామని, వారు జగన్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్