ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పంచగ్రామాల భూసమస్యను వెంటనే పరిష్కరించండి

19 మే, 2026

Steps should be taken to resolve the land issue of Visakhapatnam Panchagramas: BV Raghavulu's letter to CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 19, 2026, 01:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ముఖ్యమంత్రికి బి.వి.రాఘవులు లేఖ


ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విశాఖ జిల్లా లోని పంచగ్రామాల భూసమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సిపిఎం పొలిట్‌‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆయన మంగళవారం లేఖ రాశారు. గత మూడు దశాబ్దాలుగా విశాఖ జిల్లా పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కాకపోవడంతో సుమారు రెండు లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వం 2014లో విశాఖలో జరిపిన మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో పంచగ్రామాల సమస్యను వంద రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ 12 సంవత్సరాలు గడిచినా సమస్య పరిష్కారం కాలేదని సిఎం దృష్టికి తీసుకువచ్చారు. 1996-97లో ప్రభుత్వం పెందుర్తి, చినగదిలి ఎమ్మార్వో ద్వారా ఆ ప్రాంతంలోన మొత్తం 11,282.26 ఎకరాల భూమిలో సింహాచలం దేవస్థానానికి ఏకంగా 9,063.22 ఎకరాల భూమికి రైత్వారీ పట్టాలు ఇచ్చేసిందని తెలిపారు. ఈ పట్టాలు మినహా ఈ భూమిపై హక్కులకు సంబంధించి దేవస్థానం వద్ద ఎటువంటి ఆధారాలూ లేవని పేర్కొన్నారు. ఈ పట్టాల ఆధారంగా (ప్రభుత్వం 19.08.2000 ఇచ్చిన జివో నెంబర్ 578) అప్పటి వరకు హక్కుదారులుగా ఉన్న ప్రజలందరినీ ఆక్రమణదారులుగా అన్యాయంగా ముద్ర వేసి అప్పటి వరకు లేని సమస్యను ప్రభుత్వమే సృష్టించిందని పేర్కొన్నారు. ఈ పట్టాలు చెల్లవని నాటి సిసిఎల్‌ఏ వాటిని రద్దుజేశారని, కానీ టిడిపి ప్రభుత్వం ఆపట్టాలను కొనసాగించిందని తెలిపారు. అప్పుడు ఏర్పడిన అసెంబ్లీ హౌస్ కమిటీ అనేకమంది మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితంతో, వివిధ ఆర్థిక సంస్థల నుండి లోన్లు కూడా తీసుకుని ఇళ్ళు కట్టుకున్నారని, వీరిని ఖాళీ చేయడంచడం సాధ్యం కాదని, అందువల్ల సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి, వీటిని రెగ్యులరైజ్ చేయాలని సూచించిందని తెలిపారు. దీనిపై నడిచిన కేసుల్లో 2010లో విశాఖ ఆర్డీవో 2010 ఏప్రిల్‌ మూడోతేదీన 268/2002/సి మోమొతో ఆ పట్టాలు సక్రమం కాదని పేర్కొంటూ, భూములపై రీసర్వే చేయాలని ఆర్డర్ జారీచేశారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో జరిగిన ఒక భూ కుంభకోణంపై 2014లో సిపిఎం హైకోర్టులో కేసువేయగా, హైకోర్టు ఆదేశానుసారం విశాఖ జాయింట్ కలెక్టరుతోపాటు, సర్వే, సిసిఎల్‌ఏకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ కూడా ఈ పట్టాలు సక్రమం కాదనే విషయాన్ని తెలిపిందని వివరించారు. అయినా ప్రభుత్వం ఆ పట్టాలను రద్దు చేయలేదని, అందువలనే ఈ సమస్య పరిష్కారం కాకుండా నానుతూ ఉన్నదని వివరించారు. ప్రభుత్వం ఇళ్ళ క్రయ విక్రయాలను నిలిపివేసిందని, కొండమీద గిరిజనులతో సహా ఇళ్ళ నిర్మాణాలను, రిపేర్లను కూడా అనుమతించలేదని, ఈ నిషేదాల వలన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భూములపై 1903లో గిల్‌మేన్ సర్వే రికార్డులలో అడవివరం పంచాయతీలో కేవలం 39.5 ఎకరాల భూమి మాత్రమే సింహాచలం దేవస్థానానిదని ఉందని, మిగిలిన భూమి జిరాయితి, బంజరు, పోరంబోకు, ఫారెస్టు భూమి అని పేర్కొందని వివరించారు. రైతుల పేర్లతో సహా సర్వే నెంబర్లు కూడా పేర్కొందని, దీని తరువాత ఈ భూములపై సమగ్ర అధికారిక సర్వే జరగలేదని, కనుక ఇదే ప్రామాణికమని తెలిపారు. ఈ అంశాలను పరిశీలించి తక్షణం ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని, ఈలోగా నిర్మాణాలను, రిపేర్లను అనుమతించాలని, క్రయ విక్రయాలను, రిజిస్ట్రేషన్లను పునరుద్దరించాలని రాఘవులు కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్