ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పిల్లలు అద్భుతం చేశారు..!

2 గంటల క్రితం

protets
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 04:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

- అరుంధతి రాయ్‌

'పిల్లలు ఏం చేస్తారులే.. అని అనుకున్నాం. కానీ రోజుల వ్యవధిలోనే మాలో ఎవరూ చేయలేని పనిని వాళ్లు చేశారు. 24 ఏళ్ల నుండి ఒక్క మీడియా సమావేశం కూడా జరపని ప్రధానిని అర్ధరాత్రి వీడియో చేసేలా చేశారు.' అన్నారు ప్రముఖ రచయిత అరుంధతి రాయ్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మరుసటి రోజు ఆమె ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గర దీక్షా స్థలానికి వెళ్లారు. అక్కడ వెబ్ పత్రిక స్క్రోల్‌.ఇన్‌తో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా..


'జెన్‌ జెడ్ నిరసనలతో పండుగ వాతావరణాన్ని తలపించిన జంతర్‌మంతర్ ఇప్పుడు వెలవెలబోతోంది. 36 రోజుల నిరసన మొదట్లో కాస్త సీరియస్‌గా అనిపించినా, రానురాను వేడుకలా మారిపోయింది. పిల్లలు నిరసనను చాలా వినూత్నంగా చూపించారు. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని.. రాజకీయాలు-జోకులు కవలపిల్లలు అని. ఈ పిల్లలు వాటినే చేశారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అసలు ఊహించలేదు. ఇది చాలా అద్భుతం. ​విద్యా వ్యవస్థలో, మంత్రిత్వ శాఖలో పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇవి ఒక్క ప్రధాన్ రాజీనామాతో సమసిపోవు. రాజీనామా చేసిన పెద్దమనిషిని ఈ బీజేపీ పెద్దలు ఎంతలా పొగుడుతున్నారో చూశాం. 'అవమానభారంతో ఆయన పదవి నుండి వైదొలగలేదు, విద్యార్థుల కోసం ఆత్మార్పణ చేసుకున్నట్లు' చూస్తున్నారు. ఢిల్లీలో బుల్డోజర్ సంస్కృతిని అందరూ చూశారు. అప్పుడు చాలామంది మాట్లాడలేదు. ఇప్పుడు మోడీ భక్త తల్లిదండ్రులకు కూడా తమ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోందని అర్థమవుతోంది. ఇక్కడ కేవలం పరీక్ష పత్రాల లీక్‌ల వ్యవహారం మీదే నిరసన జరగలేదు. మెడిసిన్, ఇంజినీరింగ్, ఇతర కోర్సులు ఏది చదివినా, ఏళ్ల తరబడి వేచి చూసినా ఉద్యోగాలు రాని పిల్లల ఆవేదన కూడా ఇందులో ఉంది. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల ఆదివాసీలు, ప్రజలు నిరాశ్రయులవుతున్నారని మాలో చాలామందిమి ఆవేదన చెందుతాం. ఇప్పుడు ఆ పరిస్థితి నగరవాసులకు, మధ్యతరగతి ప్రజలకు, వ్యాపారవేత్తలకు కూడా పాకింది. ప్రైవేటీకరణ, కేంద్రీకరణ వల్ల అదానీ, అంబానీలకు మాత్రమే ప్రాధాన్యత లభిస్తోంది. మిగతా వారందరూ అణచివేయబడుతున్నారు. అలాంటి వారంతా ఈ పోరాటాన్ని చాలా నిశితంగా గమనించారు.

ఈ ఉద్యమం సాధించిన గొప్ప విజయం ఏంటంటే.. 2002 నుండి 24 ఏళ్లుగా తన ఎదుగుదలను ఎంతో జాగ్రత్తగా నిర్మించుకున్న వ్యక్తి, పత్రికలతో మాట్లాడడానికి సాహసించని వ్యక్తి, ఇప్పటికీ విశ్వగురు, విష్ణువు అవతారం అని పిలిపించుకునే వ్యక్తి ప్రతిష్టను ఈ కుర్రాళ్లు రెండు వారాల్లో బట్టబయలు చేశారు. చరిత్రలో ఏ దేశాధినేత ఇంతలా అవమానించబడి, ఎగతాళి చేయబడి ఉండడు. ఆయన చేసిన పాత ప్రసంగాలను కూడా పిల్లలు బయటికి తీసి విమర్శలు చేశారు. అవి చూసి మిగతా పిల్లలు పగలబడి నవ్వుతున్నారు. పిల్లలు చాలా ధైర్యంగా వీడియోలు పోస్ట్ చేశారు. వాటి కింద వీక్షణల సంఖ్య రికార్డులను బద్దలు కొడుతోంది. ఆ వీడియోలు చూసి ఆస్ట్రేలియాలో నవ్వుతున్నారు. ఇండోనేషియాలో నవ్వుతున్నారు. ప్రధాని గారి గొప్ప స్నేహితుడైన ట్రంప్ దేశం అమెరికాలోనూ నవ్వుతున్నారు.

హాస్యంలో ఆగ్రహం

ఇక్కడ పిల్లలు గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు తమ ఆగ్రహాన్ని చాలా నిర్భయంగా, హాస్యంగా వ్యక్తపరిచారు. నిరసనలో పిల్లలకు ఆహారం సరఫరా చేశారని మహ్మద్ జునీద్‌ను, ఆ కుటుంబాన్ని ఆ తర్వాత హింసించారని వీడియోలో చూశాను. ఇది చాలా బాధగా ఉంది. ఈ నాయకులు ఇంకెంతమంది పిల్లలను, ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తారో అని..! కాబట్టి ఇది ఇక్కడితో ముగిసిపోదు.' అని అరుంధతి రాయ్ మాట్లాడుతున్నప్పుడు అక్కడికి ఒక పోలీసు వచ్చారు. అప్పుడు వాళ్ల మధ్య సంభాషణ ఇలా జరిగింది.

​పోలీసు : ఇక్కడి నుండి వెళ్లిపొండి.

​ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి : ఇది బహిరంగ ప్రదేశం. ఎవరైనా మాట్లాడుకోవచ్చు.

​పోలీసు : మాకు ఆర్డర్లు ఉన్నాయి.

​ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి : ఏవి ఒకసారి చూపించండి. పత్రాల్లో ఉంటేనే అవి ఆర్డర్లు. అయినా ఇంకాసేపట్లో మేము ఇక్కడి నుండి వెళ్లిపోతాం.

​అప్పుడు అరుంధతి రాయ్, 'మీ నేమ్‌ప్లేట్ చూపించండి' అని పోలీసును అడిగారు. ఆ పోలీసు అత్యంత బలహీనంగా ఉన్న తన నేమ్‌ప్లేట్‌ను చూపించాడు. అది చూసి రాయ్ నవ్వుతూ, 'సంతోషం. మీకు కనీసం ఊగిపోతూ ఉన్న నేమ్‌ప్లేట్ అయినా ఉంది. ఆ రోజు పిల్లలను కొడుతున్న పోలీసుల్లో చాలామందికి అవి లేవు' అన్నారు.

ఆ తరువాత పోలీసు అక్కడి నుండి వెళ్లిపోయారు.

​ఇప్పుడు దీక్షా స్థలంలో పిల్లలు రాసిన నినాదాల మీద రంగులు వేసి కనిపిస్తున్నాయి. దాని గురించి అరుంధతి మాట్లాడుతూ.. 'అక్కడ అసలు ఏమీ జరగనట్లు వారు చేయాలనుకుంటున్నారు. రక్తం మరకలను తుడిచేస్తారు. కానీ పిల్లలు చేసిన నినాదాలు మనకు ఇంకా వినిపిస్తూనే ఉంటాయి. ఆవేదనతో ఉన్న వాళ్ల ముఖాలు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. మణిపూర్ అల్లర్లు, కాశ్మీర్ కాల్పులు జరిగినప్పుడు ఎందరో తుపాకులకు బలయ్యారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఈ పిల్లలు పాలకుల వర్గానికి చెందిన వాళ్లు. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులుగా విద్యార్థులను వాళ్లు విడదీసి చూడలేకపోయారు. సీఏఏ అల్లర్లు జరిగినప్పుడు అరెస్టు చేసిన పిల్లలు ఇంకా విచారణ లేకుండా జైళ్లల్లో మగ్గుతున్నారు. ముస్లింలు అన్న కారణంగా దేశంలో ఎందరో యువకులు దాడులకు గురవుతున్నారు. హిందుత్వ శక్తులు, పోలీసులు వాళ్లపై దాడులు చేసినా, హత్యలు చేసినా ఎవరికీ పట్టదు. అలాంటప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. అప్పుడే నవ్వు కూడా వస్తుంది. అచ్చం ఈ కుర్రాళ్లు నవ్వినట్లు' అని రాయ్ మాట్లాడుతున్నప్పుడు అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. తనతో వాళ్ల సంభాషణ ఇలా జరిగింది.

​వృద్ధుడు : మీరు చాలా మంచి మనిషి.

​రాయ్ : నేను మీకు ముందే తెలుసా?

​వృద్ధుడు : లేదు.

​రాయ్ : ఇక్కడ నిరసన జరిగింది కదా! ఏమనుకుంటున్నారు?

​వృద్ధుడు : నేను దాన్ని న్యూస్‌పేపర్లలో చూశాను. చాలా మంచి పని జరిగింది. ఈసారి దీపావళి మోడీ లేకుండా చేసుకుందాం.

​రాయ్ : నాకు అలాగే అనిపిస్తుంది. మనం ఇద్దరం ఇక్కడే కలిసి ఆ పండుగ చేసుకుందాం. మిఠాయిలు పంచుకుందాం.

​వృద్ధుడు : మేమంతా మోడీతో విసిగిపోయాం. అతను అంతా అమ్మేశాడు.

​ఈ సంభాషణ తరువాత రాయ్ అక్కడి నుండి వెళ్లిపోతూ.. దశాబ్దం క్రితం పాలకుల విధానాలపై ఒక జోక్ వేసినప్పుడు అరెస్టులు చేశారు. కానీ కుర్రాళ్లు జోక్‌లతోనే పోరాటం చేశారు. అదే నాకు బాగా నచ్చింది. 'ది వైర్' ఆంగ్ల పత్రికకు ఇటీవల నేను రాసిన ఒక వ్యాసంలో 'మొదటిసారి భారతీయురాలిగా ఉన్నందుకు అద్భుతంగా ఉంది' అన్నాను. ‘అత్యంత సృజనాత్మకత ఉన్న రచయిత కూడా పిల్లలు చేసిన ఈ పోరాటాన్ని అసలు ఊహించలేరు. ఇది చాలా బాగుంది. కానీ రాజకీయాలు వేగంగా మారిపోతాయి. చూద్దాం.. ఏం జరుగుతుందో..!' అని ముగించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్