- వి. రాంభూపాల్
కనీస వేతనాల కోసం కార్మికవర్గం జులై 30, 31 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించింది. సిఐటియు ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల వద్ద జరిగిన ధర్నాలు, ముట్టడిలో లక్ష ఇరవై వేల మందికి పైగా కాంట్రాక్టు కార్మికులు, స్కీమ్ వర్కర్లు పాల్గొనడం ద్వారా... వ్యక్తిగత దూషణలు, అసభ్య విమర్శల చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలను ప్రజా సమస్యల వైపు మళ్ళించే ప్రయత్నం చేశారు. కొన్ని జిల్లాలలో అరెస్టులు, నిర్బంధాలు జరిగాయి. అనకాపల్లిలో పోలీసుల తోపులాటలో ఒక కార్మికురాలికి కాలు విరిగింది. నెలకు రూ.26 వేలు కనీస వేతనంగా ఇవ్వాలని, శాశ్వతమైన పనిలో శాశ్వత ఉద్యోగం వుండాలనే సుప్రీంకోర్టు తీర్పును ఇంకెంత కాలం అమలు చేయరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల నాడు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని పాలకులను నిలదీశారు. పాలకులు స్పందించి ఇప్పటికైనా అరకొర వేతనాలతో బతుకులు వెళ్లదీస్తున్న కార్మికులకు రెండు పూటలైనా కడుపు నింపుకోవడానికి కనీస వేతనం అమలు చేయాలి. విదేశీ, స్వదేశీ కంపెనీల యజమానుల చుట్టూ తిరిగితే రాష్ట్రానికి పెట్టుబడులు రావు. గ్రామీణ పేదల, పట్టణ కార్మికుల ఆదాయం పెరిగితే వారి కొనుగోలుశక్తి పెరుగుతుంది. అప్పుడే ఏ ఒక్కరిని దేబిరించకుండానే రాష్ట్ర అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది. కార్మికుల ఆగ్రహాన్ని గుర్తించి కనీస వేతనాల పెరుగుదలకు చర్యలు తీసుకుంటే అది కూటమి పార్టీలకు ప్రయోజనకరం. కాదంటే పోరాటాలు ఉధృతం కాక తప్పదు. అది అంతిమంగా పాలకుల పీఠానికే ముప్పు వస్తుందన్నది చరిత్ర చెబుతున్న సత్యం.
రాష్ట్రంలో 66 రంగాల్లో సుమారు 50 లక్షల మందికి పైగా ప్రైవేట్ యాజమాన్యాల కింద పని చేస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో, ప్రభుత్వ పథకాల అమలులో మరికొన్ని లక్షల మంది వున్నారు. వీరందరికి చట్ట ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా వి.డి.ఎ తో పాటు వేతన ఒప్పందాలు జరగాలి. కానీ మన రాష్ట్రంలో గత 15 సంవత్సరాల నుండి (2012 ) కనీస వేతనాలు పెంచలేదు. ఈ కాలంలో తెలుగుదేశం, వైసిపి, ప్రస్తుతం టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయి. కాని, వీటికి లక్షలాది కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడానికి చేతులు రాలేదు. నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి బాడుగలు, పిల్లల ఫీజులు, వైద్యం ఖర్చులు, పెట్రోలు, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో పెరిగిపోతుంటే, కార్మికుల వేతనాలు నత్త నడక కంటే వెనకపడిపోయాయి. ధరల పెరుగుదలకు అనుగుణంగా పెంచాల్సిన డి.ఎ పెంచకుండా, వేతనాలను సవరించకుండా కార్మికులను అత్యంత దారుణంగా ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు పీక్కు తింటున్నాయి. ఈ గత 12 సంవత్సరాల్లో వి.డి.ఎ ను బేసిక్ వేతనంతో కలిపి, కనీసం 15 నుండి 20 శాతం వేతనాలు పెంచి వుంటే నైపుణ్యం లేని కార్మికుడికి సైతం నెలకు రూ. 22,000 వేతనం వచ్చి వుండేది. అది అమలు చేయకపోవడంతో రూ.12-13 వేలకు మించి అందడంలేదు. ఇంత తక్కువ వేతనంతో కార్మికులు ఏమి కొనగలరు? ఏమి తినగలరు? కార్మికుల వేతనాలు పెరిగితే వారి కొనుగోలు పెరుగుతుంది, తద్వారా పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, పారిశ్రామికీకరణ వేగవంతం అవుతుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. అప్పుడే రాష్ట్రంలో సంపద సృష్టించబడుతుంది.
రాష్ట్రంలో కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోతుండడానికి, ఉద్యోగ, కార్మికుల వేతనాల పెంపు చేయకపోవడానికి ప్రత్యక్ష సంబంధం వుందని పాలకులు గుర్తించడంలేదు. కొద్ది మంది సంపన్నులు పెరిగితే రాష్ట్రం అభివృద్ధి కాదు. 50 లక్షల మందికి పైగా వున్న అసంఘటిత కార్మికుల వేతనం సంవత్సరానికి కనీసం వెయ్యి, రెండు వేలు పెరిగినా దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మీద చాలా ఎక్కువగా వుంటుంది. కానీ పాలకులు అందుకు విరుద్ధంగా శశ్వాత ఉద్యోగులకు నిర్దిష్ట సమయంలో వేతన సవరణ చేయకుండా, ఉద్యోగ విరమణ వయసును పెంచుతూ రిటైర్‌మెంట్ సదుపాయాలను వాయిదా వేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా తక్కువ వేతనాలతో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. కార్మికుల హక్కులను కాపాడడంలో ఆదర్శంగా వుండాల్సిన ప్రభుత్వాలే ఇంత దారుణంగా కార్మికులను దోచుకుంటుంటే, ప్రైవేట్ యాజమాన్యాల కింద పని చేస్తున్న కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా వుంటుంది. వేల ఎకరాల భూమిని, రకరకాల రాయితీలను ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్న ప్రభుత్వాలు అక్కడ పనిచేస్తున్న కార్మికుల సంక్షేమాన్ని గురించి ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. కార్మికుల పక్షాన నిలవాల్సిన కార్మిక శాఖ అంపశయ్య మీదకు చేరి చాలా కాలమైంది.
కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల కోసం అన్ని రకాల కార్మిక చట్టాలను రద్దు చేస్తుంది. జాతీయోద్యమంలో భాగంగా సాధించుకున్న కార్మిక హక్కులన్నీ నేడు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. మతం, దేశభక్తి ముసుగులో కార్మికుల శ్రమను, ప్రభుత్వ రంగ సంస్థలను, సహజ వనరులను తమ అనుయాయ కంపెనీలకు అతి చౌకగా కట్టబెడుతున్నది. బిజెపి కపటత్వాన్ని గ్రహించిన కార్మికులు కనీస వేతనాల కోసం, హక్కుల కోసం ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో సుమారు 60 ప్రాంతాల్లో సమ్మెలు, ఆందోళనలు చేశారు. నోయిడాలో జరిగిన సమ్మెలో లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్బంధాన్ని తట్టుకుని కనీస వేతనాలను సాధించుకున్నారు. బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్, హర్యానాలతో సహా అనేక రాష్ట్రాల్లో కనీస వేతనాలను హుటాహుటిన పెంచాల్సి వచ్చింది. మన పొరుగున వున్న తెలంగాణలో 25 శాతం, కర్ణాటకలో 60 శాతం కనీస వేతనాలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. కీలక రంగాలైన విద్యుత్, ఆర్‌టిసి, మున్సిపల్ రంగాలను పూర్తిగా ప్రైవేటుపరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ప్రయత్నిస్తున్నది. బస్సు డిపోలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తోంది. వీటి నిర్వహణ, ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ కింద తమ పార్టీ నాయకులకు కాంట్రాక్టులు ఇస్తోంది. వీరు తమ ఇష్టం వచ్చినట్లు కార్మికులను తొలగించి వేస్తున్నారు. తక్కువ వేతనాలతో, ఎక్కువ పని గంటలతో, పి.ఎఫ్, ఇఎస్‌ఐ, బోనస్, గ్రాట్యూటీ, ప్రసూతి సెలవుల లాంటి ఏ సౌకర్యాలు లేకుండా కార్మికులను దోచుకోవడం ఎల్ల కాలం సాగదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి. కనీస వేతనం అమలు చేయడంతో పాటు 1992లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా శాశ్వత పనికి, శాశ్వత ఉద్యోగిని నియమించాలి. లేకపోతే కార్మిక ఆగ్రహానికి గురికాక తప్పదు.







కామెంట్‌లు (0)