- అమరావతి వాతావరణ కేంద్రం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఎపి, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి ప్రఖర్‌జైన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గానీ, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించారు. విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఎన్‌టిఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గోదావరి నది వరద ఉధృతి భద్రాచలం వద్ద స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. భద్రాచలం నుంచి వస్తున్న నీటి ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద దాదాపు 15 లక్షల క్యూసెక్కుల వరకు చేరిన తర్వాత ఆదివారం రాత్రి నుంచి వరద క్రమంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. వరద ముంపు బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందించేందుకు 3 ఎన్‌డిఆర్ఎఫ్ , 3 ఎడ్‌డిఆర్ఎఫ్ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)