"మనిషి తన ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి సంపదను సంపాదిస్తాడు. తర్వాత అదే సంపదను ఖర్చు చేసి ఆరోగ్యాన్ని కొనుక్కుంటాడు". మనిషి నాగరికత ఎంత ముందుకు వెళ్తుందో, ఆరోగ్య సమస్యలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు ఇకపై వృద్ధుల సమస్య మాత్రమే కాదు; యువతలోనూ వేగంగా పెరుగుతున్నాయి. 30–40 ఏళ్ల వయసులోనే గుండెపోటు, అధిక కొలెస్ట్రాల్, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలు విస్తరిస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం-గత మూడు దశాబ్దాల్లో గుండె వ్యాధుల భారం మూడు రెట్లు పెరిగి, జాతీయ ఆరోగ్య సంక్షోభంగా మారింది. 1990 నుండి వయోపరిమితి సగటులు తగ్గినప్పటికీ, జనాభా పెరుగుదల, వృద్ధాప్య సమస్యల వల్ల ఈ వ్యాధి ప్రభావం నిరంతరం పెరుగుతోంది. ఒకప్పుడు అంటువ్యాధులు ప్రపంచానికి అతి పెద్ద సవాలుగా నిలిస్తే, ఇప్పుడు జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులు నిశ్శబ్ద మహమ్మారిగా మారాయి. వాటిలో ముఖ్యమైనది ఎల్.డి.ఎల్ లేదా 'చెడు కొలెస్ట్రాల్'. ఇది ఊబకాయానికి కూడా కారణమౌతోంది. దేశంలో సుమారు 25.4 కోట్ల మంది సాధారణ ఊబకాయంతో, 35.1 కోట్ల మంది పొట్ట చుట్టూ కొవ్వుతో బాధ పడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పిల్లల్లో కూడా ఊబకాయం పెరుగుతున్నందున ఇదొక పెద్ద ప్రజారోగ్య సంక్షోభంగా మారింది. 1.7 కోట్ల పిల్లలు, యువకులు ఊబకాయంతో బాధపడుతున్నారు; 2030 నాటికి ఇది 2.7 కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఐసిఎంఆర్ నివేదిక చెబుతోంది.
‘2023లో అధిక చెడు కొలెస్ట్రాల్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 36 లక్షల మంది మరణించగా, ఆ మరణాల్లో దాదాపు మూడింట ఒక వంతు భారం భారత్ పైనే పడింది. ప్రపంచ మరణాల్లో సుమారు 6 శాతం ఈ ఒక్క కారణానికే సంభవించడం అత్యంత ఆందోళనకరం’ అని తాజాగా వెలువడిన అధ్యయనం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మన ఆహారపు అలవాట్లు, పని విధానం, ఒత్తిడితో కూడిన జీవితం, వ్యాయామం పట్ల నిర్లక్ష్యం- ఇవన్నీ కలిసి సమాజానికిచ్చిన ఒక హెచ్చరిక. ‘ప్రజ్ఞాపరాధౌ మూలం సర్వరోగానాం’ అన్నారు. అంటే, అన్ని రోగాలకు మూలం...అన్నీ తెలిసి పాటించకపోవడం అని అర్థం. ఒకప్పుడు మన ఇళ్లలో వండిన భోజనం, నడక, శారీరక శ్రమ జీవనంలో భాగం. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్, అధిక కొవ్వు, అధిక ఉప్పు, అధిక చక్కెర, గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు మన దైనందిన జీవితంగా మారిపోయాయి. టెక్నాలజీ మన శ్రమను తగ్గించింది; అయితే, శరీరానికి అవసరమైన కదలికను దూరం చేసింది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే- ఈ సమస్య పెద్దలకే పరిమితం కాలేదు. భారత్‌లో గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు గత కొన్ని దశాబ్దాలుగా వేగంగా పెరుగుతున్నాయి. యువతలోనూ గుండెజబ్బులు, రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతున్నాయి. దీనికి పోషకాహార లోపం కూడా తోడైంది. వలసలు, ఉపాధి లేమి వంటివి యువతపై త్రీవమైన ఒత్తిడికి కారణమౌతున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో పట్టణీకరణ, ప్రాసెస్డ్ ఆహారం వినియోగం, ఒత్తిడి, నిద్ర లేమి, ధూమపానం, మద్యపానం, వ్యాయామ లేమి- ఇవన్నీ గుండెకు కనిపించని శత్రువులుగా మారుతున్నాయి. ‘తనివిదీర తినక తనువు దాచుకొనుచు/ కొద్దిగాను తినుట గుణము మేలు;/ మితము ఎరిగి తినుట మేదినిలోనెల్ల’ అంటాడు వేమన. అంటే, అతిగా తినకుండా, శరీరాన్ని కాపాడుకుంటూ... మితంగా ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అర్థం.
భారత్‌లో 'చెడు కొలెస్ట్రాల్' సమస్య కేవలం వైద్య సమస్య కాదు; ఇది ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రజారోగ్య విధానాలకు సంబంధించిన అంశం. ప్రభుత్వాలు కేవలం ఆసుపత్రులు నిర్మిస్తేనే సరిపోదు. ఆరోగ్యకరమైన ఆహారం గురించిన అవగాహన, పాఠశాల స్థాయి నుంచే కల్పించాలి. పోషకాహార విద్య, ఆహార లేబుళ్లలో స్పష్టమైన సమాచారం, ప్రజలకు ఉచిత కొలెస్ట్రాల్ పరీక్షలు, నడక మార్గాలు, క్రీడా మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కుటుంబాల బాధ్యత కూడా తక్కువ కాదు. పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పాలి. ఆరోగ్యం ఆసుపత్రిలో కొనుక్కునేది కాదు; వంటగదిలో, నడకలో, క్రమశిక్షణలో నిర్మించుకునేది. చివరగా మనకి మనమే వేసుకోవాల్సిన ప్రశ్న- మన ప్లేట్‌లో ఉన్న ఆహారం మన జీవితాన్ని పొడిగిస్తుందా? లేక నిశ్శబ్దంగా దాన్ని కుదిస్తుందా? అని. ఇప్పటి జీవనశైలి అంటువ్యాధుల కంటే ఎక్కువ హానికరంగా మారింది. సంపదను వారసత్వంగా ఇవ్వవచ్చు. కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఎవరికి వారు తమ జీవనశైలితోనే సంపాదించుకోవాలి. కొలెస్ట్రాల్‌ను కేవలం రక్తపరీక్షలో వచ్చే సంఖ్యగా చూడకూడదు. అది మన జీవనశైలికి అద్దం. ఆ అద్దంలో కనిపిస్తున్న హెచ్చరికను ఇప్పుడే అర్థం చేసుకుంటే రేపటి తరానికి ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలం. లేకపోతే, ఆసుపత్రుల సంఖ్య పెరుగుతుందేమో గానీ ఆరోగ్యవంతుల సంఖ్య మాత్రం పెరగదు.







కామెంట్‌లు (0)