వైసిపి వాహనాలపై రాళ్ల దాడులు
ప్రజాశక్తి - జమ్మలమడుగు : కడప జిల్లా జమ్మలమడుగులో శుక్రవారం సాయంత్రం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం బి.సి.కాలనీలో వైసిపి నేతలు, కార్యకర్తలు ప్రచారం చేస్తుండగా రెండు కార్లపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, ఆయన తనయుడు శివారెడ్డి, కార్యకర్తలతో కలిసి ఫిర్యాదు చేసేందుకు అర్బన్ పోలీస్ స్టేషన్‌కు దెబ్బతిన్న వాహనాలతో వెళ్లారు. వారిని పోలీసులు స్టేషన్లో కూర్చోబెట్టారు. దీంతో, విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి హైమావతి, నాయకులు గిరిధర్ రెడ్డి, ముల్లా జానీ, వైసిపి జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షులు వి.హృషి కేశవ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అనంతరం దెబ్బతిన్న వాహనాలతో పాతబస్టాండ్‌కు చేరుకొని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సతీమణి ఇందిర మాట్లాడుతూ ఓడిపోతామన్న భయంతో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు వదిలేంత వరకు పాత బస్టాండ్ నుండి కదిలేది లేదన్నారు. పోలీసులు ఎట్టకేలకు రామసుబ్బారెడ్డిని పాత బస్టాండ్‌కు తీసుకురావడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసుకొనే పరిస్థితి జమ్మలమడుగులో లేదని విమర్శించారు. అరాచకాలకు భయపడేది లేదని, ధైర్యంగా ఎదుర్కొంటామని అన్నారు.








కామెంట్లు (0)