- జయంతి సభలో సిఐటియు రాష్ర్ట అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు
ప్రజాశక్తి -నెల్లూరు: ఎమర్జెన్సీ కాలంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి కార్మిక ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం అనుభవించిన వ్యక్తి శ్రీహరి అని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు అన్నారు. సిఐటియు నెల్లూరు జిల్లా కార్మిక ఉద్యమ నిర్మాత వి. శ్రీహరి 91వ జయంతి సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు పూలే బొమ్మ సెంటర్‌లో వి శ్రీహరి భవనంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని నర్సింగరావు ప్రారంభించారు. అనంతరం జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సిఐటియు రాష్ర్ట అధ్యక్షులుగా పనిచేశారని, ఆ కాలంలో అనేక కార్మిక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు రంగాన్ని నిర్మించి, దానిని విస్తరించడంలో ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు. నేటి కార్మిక వర్గం శ్రీహరి ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలో కార్మిక ఉద్యమాలను బలోపేతం చేయడానికి ముందుకు సాగాలని కోరారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ మాట్లాడుతూ... జిల్లాలో కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి శ్రీహరి అని కొనియాడారు. జిల్లాలో అనేక కార్మిక సంఘాలను స్థాపించి, వాటి విస్తరణకు కృషి చేశారని, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే, కార్మిక వర్గ దృక్పథంతో జిల్లా వ్యాప్తంగా విద్యుత్తు రంగానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. తాము చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘాల నాయకులకు అవసరమైన సూచనలు, సలహాలను శ్రీహరి ఇచ్చేవారని, కార్మిక సంఘాలలో పనిచేసే కార్మిక వర్గానికి విద్యార్థి సంఘాలు ఎల్లప్పుడూ వెన్నంటి ఉండి తోడ్పాటునందించాలని సలహాలు చ్చేవారని కొనియాడారు. జయంతి సభకు సిఐటియు నగర కార్యదర్శి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రంగయ్య నాయుడు, విద్యుత్తు రంగం రాష్ట్ర అధ్యక్షులు సూరిబాబు, సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్, మెడికల్ హెల్త్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు నర మాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)