సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సుమతి సేవలు చిరస్మరణీయం

9 గంటల క్రితం

aidwa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 10:58 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- మహిళా హక్కుల కోసం ఆమె తపన స్ఫూర్తిదాయకం

- మహిళలపై హింస, వివక్షకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు బలోపేతం

- సంస్మరణ సభలో వక్తలు పిలుపు

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజా ఉద్యమాలకు, ముఖ్యంగా మహిళా హక్కుల పరిరక్షణకు కామ్రేడ్ వి సుమతి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మహిళల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆమె సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సుమతి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రం చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియంలో సుమతి సంస్మరణ సభ ఆదివారం నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు ప్రజా, మహిళా ఉద్యమ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు, సుమతి కుటుంబ సభ్యులు పాల్గొని ఆమెకు ఘన నివాళులర్పించారు. సుమతి చిత్రపటానికి కనినిక ఘోష్ బోస్, ఐద్వా జాతీయ నాయకులు ఎస్ పుణ్యవతి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా అఖిల భారత కార్యదర్శి కనినిక ఘోష్ బోస్ మాట్లాడుతూ.. మహిళల హక్కులు, సామాజిక న్యాయం కోసం సుమతి చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదన్నారు. మహిళల సమస్యలను కేవలం వ్యక్తిగత సమస్యలుగా కాకుండా వాటి వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలను అర్థం చేసుకుని ఉద్యమాలను నిర్మించడంలో సుమతి కీలక పాత్ర పోషించారని తెలిపారు. సుమతి వంటి నాయకుల త్యాగాలు, అనుభవాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఐద్వా జాతీయ నాయకులు ఎస్ పుణ్యవతి మాట్లాడుతూ.. సుమతి తన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేశారని తెలిపారు. కార్యకర్తలతో ఆత్మీయంగా మెలుగుతూ వారిలో ధైర్యాన్ని నింపి, మహిళా ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఆమె విశిష్టమైన పాత్ర పోషించారని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాల్లో నిబద్ధతతో పనిచేసిన నాయకురాలిగా సుమతి సేవలు చిరస్మరణీయమన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా ప్రజల సమస్యల కోసం నిలబడిన ఆమె జీవితం నేటి ఉద్యమకారులకు ఆదర్శమని పేర్కొన్నారు. ఐద్వా పూర్వ రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ.. సుమతితో తనకున్న అనుబంధాన్ని, కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా సమస్యలపై పోరాడే ధైర్యం ఆమె ప్రత్యేకత అని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు మాట్లాడుతూ.. సుమతి మృతి సమాజానికి తీరని లోటన్నారు. సుమతి కుటుంబమంతా కమ్యూనిస్టు పార్టీలో పనిచేయడం ఆదర్శనీయమన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సుమతి భౌతికంగా లేకపోయినా, ఆమె ఆశయాలు, ఆలోచనలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ‌చివరిలో సుమతి కుమార్తె ప్రతిభ మాట్లాడుతూ కమ్యూనిస్టు భావాజలంతో తమను పెంచారని అన్నారు. తన ఇంటిని పార్టీకి, ప్రజాసంఘాల కార్యకర్తలకు కేంద్రంగా ఉండేదని తెలిపారు. నండూరి ప్రసాదరావు వంటి అగ్రనేతలకు ఆశ్రయం ఇచ్చారని చెప్పారు. ఎమర్జెన్సీ విధించిన సమయంలో తమ ఇల్లు నాయకులకు స్థావరంగా ఉండేదన్నారు. చదువు విషయంలో తన తల్లి అత్యంత శ్రద్ధ తీసుకోవడం వల్లే తాను ఉన్నత స్థాయికి ఎదిగానని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు పి మధు, డాక్టర్ సుధాకర్ (ప్రజా వైద్యశాల), డాక్టర్ గోపాలం శ్రీమన్నారాయణ, వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబూరావు, డాక్టర్ కెవి చౌదరి, రాష్ట్ర రోటరీ క్లబ్ ఛైర్మన్ జి శ్రీరామ్, సుమతి కుమార్తె డాక్టర్ ప్రతిభ, తమ్ముడు విశ్వేశ్వరరావు (శ్రీశ్రీ ప్రింటర్స్), వేమూరి బాబూరావు, డాక్టర్ కళాధర్, భువనేశ్వరి (గుంటూరు ప్రజా వైద్యశాల), వడ్లమూడి పద్మ, చెన్నుపాటి వజీర్, పి మురళీ కృష్ణ, డి శ్రీనివాసకుమారి, సుబ్బరావమ్మ, ఎస్ వెంకట్రావు, వడ్లమాని రత్నం తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలపై పెరుగుతున్న హింస, వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సుమతి చూపిన బాటలో ఐద్వా ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని, మహిళలను పెద్ద సంఖ్యలో ఉద్యమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్