- ఎ.కొండూరు అటవీ ప్రాంతంలోనే సంచారం
ప్రజాశక్తి - ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి: ఎన్‌టిఆర్ జిల్లా ఎ.కొండూరు మండల రిజర్వ్ ఫారెస్ట్‌లోనే పెద్దపులి సంచరిస్తోంది. గత కొన్ని రోజులుగా పరిసర ప్రాంతాల్లో కలకలం రేపుతున్న పులి కదలికలను, దాని జాడను అటవీశాఖ ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో మకాం వేసి ముమ్మరంగా నిఘా కొనసాగిస్తున్నాయి. అటవీ ప్రాంతం లోపల పులి సంచరిస్తోందని, అది అడవి దాటి జనవాసాల్లోకి వచ్చే సూచనలు లేవని జిల్లా అటవీ అధికారి (డిఎఫ్ఒ) సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. సమీప గ్రామాల ప్రజలెవరూ అనవసర భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పంట పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కార్మికులు, పశువుల కాపరులు మాత్రం ఒంటరిగా వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.









కామెంట్‌లు (0)