మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి సర్వే ప్రారంభం

1 రోజు క్రితం

Must be careful: Deputy CM Pawan condemns remarks against Minister Anita.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 11:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:

పిఠాపురం నియోజక వర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతవాసుల దశాబ్దాల కల అయిన తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం దిశగా ముందడుగు పడినట్లు ఉపముఖ్యమంత్రి పవన్‌ ‌కల్యాణ్‌ ‌పేర్కొన్నారు. రక్షణ గోడ నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించేందుకు ఒప్పందం చేసుకున్న ఐఐటీ- మద్రాస్ పనిని ప్రారంభించిందని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ. 323 కోట్ల నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్‌తో నిర్మితమవుతున్న ఈ రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి డిజైన్, డీపీఆర్ రూపకల్పన కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఐఐటీ మద్రాస్ ప్రతినిధి బృందం అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో సముద్ర గర్భంలోనూ, తీర ప్రాంతం వెంబడి సర్వే చేపట్టిందని తెలిపారు. తీర ప్రాంత ఇంజినీరింగ్, సముద్ర పరిశోధనల్లో విశేష అనుభవం కలిగిన ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం గత వారం రోజులుగా ఉప్పాడ తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి విస్తృతంగా సర్వే చేస్తోందన్నారు. అధునాతన డ్రోన్లతోపాటు బీచ్ ప్రొఫైలింగ్, తీర ప్రాంతాల మ్యాపింగ్ కోసం ట్రింబుల్ ఆర్ 980 జీఎన్‌ఎస్‌ఎస్ ఆర్‌టీకే సాంకేతికతను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. తీర ప్రాంత భౌగోళిక పరిస్థితులు, సముద్ర అలల ప్రభావం, తీర కోత తీవ్రత, భూభాగ మార్పులు, సముద్ర ప్రవాహాల దిశలు వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. నీటి అడుగు భాగం నుంచి బీచ్ వరకు ఇసుక కణాల సేకరణ, సమగ్ర అధ్యయనం సాగుతోందని పేర్కొన్నారు. వీటితోపాటు ఉప్పాడ తీర ప్రాంతం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాలు సేకరించి, శాస్త్రీయ అధ్యయన ప్రక్రియ కొనసాగిస్తున్నారని తెలిపారు. బాతిమెట్రిక్ సర్వే ద్వారా సముద్రపు లోతు, సీ బెడ్ స్థాయిలు, వాటి మార్పులను గుర్తిస్తున్నారని, బీచ్ ఆకృతి, వాలు, ఎత్తుపై అధ్యయనం కొనసాగుతోందన్నారు. షోర్‌లైన్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారని, తీర ప్రాంత కోతను అంచనా వేయడంలో ఈ అధ్యయనం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఉప్పాడ సముద్ర తీరం వెంబడి ప్రతిపాదిత రక్షణ గోడ నిర్మాణానికి అనువైన అలైన్‌మెంట్‌ను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్