నామినేషన్లను వేయనీయకుండా అడ్డుకున్న టిడిపి
వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి, వేముల, చక్రాయపేటలో హైటెన్షన్
పల్నాడు జిల్లా నాగవరంలో మహిళలపై పోలీసుల లాఠీఛార్జి
ప్రజాశక్తి- కడప ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో టిడిపి శ్రేణులు బుధవారం రెచ్చిపోయాయి. దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడ్డాయి. నామినేషన్లను వేయనీయకుండా వైసిపి మద్దతుదారులను అడ్డుకున్నాయి. కట్టడి చేయాల్సిన పోలీసులు చేష్టలుడిగారు. పలుచోట్ల టిడిపి శ్రేణులకు మద్దతు తెలిపారు. దీంతో, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి, వేముల, చక్రాయపేటలో హైటెన్షన్ నెలకొంది. పులివెందుల నియోజకవర్గంలోని వేముల, చాగలేరు గ్రామంలో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న క్రమంలో టిడిపి, వైసిపి మద్దతుదారుల మధ్య తలెత్తిన వాగ్వివాదం రాళ్ల దాడికి దారి తీసింది. ఇరుగ్రూపులకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. వేములలో టిడిపి దాడిలో గాయపడిన వారిని కడప వైసిపి ఎంపి అవినాష్‌రెడ్డి పరామర్శించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన నందిపల్లి మాజీ సర్పంచ్ మారం సులోచన కుమార్ కుమారుడు శ్రీకాంత్ రెడ్డికి, టిడిపి నాయకులకు మధ్య వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లె నామినేషన్ కేంద్రం వద్ద వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇరుగ్రూపుల వారు పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రం సమీపంలో ప్రధాన రహదారిపై కర్రలు, ఇనుప పైపులతో టిడిపి వారు హల్చల్ చేయడంతో భయానక వాతావరణ నెలకొంది. మాచనూరు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన వైసిపి మద్దతుదారు చిన్న వీరారెడ్డిని టిడిపి నాయకులతోపాటు స్థానిక సిఐ, ఎస్ఐ అడ్డుకున్నారని వైసిపి నాయకులు ఆరోపించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు పాచికలపాడు నామినేషన్ కేంద్రానికి వచ్చిన వైసిపి నాయకుడు సంబటూరు ప్రసాద్ రెడ్డిపై టిడిపికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. దీంతో, గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చక్రాయపేట మండలం సురభి పంచాయతీ పరిధి నాగులగుట్టపల్లెలో ఆటోతోపాటు సుమారు 30 ద్విచక్ర వాహనాలను టిడిపి వారు కర్రలతో దాడి చేసి ధ్వంసమయ్యాయి. వేంపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ కోసం వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆ పార్టీ శ్రేణులను పోలీసులు బిడాలమిట్ట రోడ్డు వద్ద అడ్డుకున్నారు. దీంతో, మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నాయకులు నడిరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తొండూరు మండలం మల్లేలలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో టిడిపి కార్యకర్త బైక్ దగ్ఢమైంది.
డిఎస్పిపై కడప ఎంపి ఆగ్రహం
వైసిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థులను కేసుల్లో ఇరికించి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని కడప వైసిపి ఎంపి అవినాష్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల డిఎస్పి మురళీనాయక్‌కు ఫోన్ చేసిన ఆయన అభ్యర్థులను స్టేషన్లలో ఉంచితే నామినేషన్లు ఎలా వేస్తారని, పోలీస్ స్టేషన్లోనే నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని, అక్కడే నామినేషన్ వేస్తామని అన్నారు.
టిడిపికి అనుకూలంగా పోలీసులు
పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరం, అమరావతి మండలం మునగోడు, అచ్చంపేట మండలం చింతపల్లి తదితర గ్రామాల్లో నామినేషన్లను వేయనీయకుండా ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులను టిడిపి వారు అడ్డుకోవడంతో ఘర్షణలు జరిగాయి. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన వైసిపి మద్దతు మహిళలను నాగవరంలో పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ప్రశ్నించిన మహిళలపై లాఠీఛార్జి చేశారు. దీంతో, పలువురికి గాయాలయ్యాయి. మునగోడులో టిడిపి, వైసిపి శ్రేణులు పరస్పరం కర్రలతో కొట్టుకున్నాయి. పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతవరం గ్రామంలో నామినేషన్ వేయడానికి వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేసి సత్తెనపల్లి తరలించారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఎస్పికి ఫిర్యాదు చేయడానికి నరసరావుపేట వెళ్తుండగా ఆయనను ముప్పాళ్ల వద్ద అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు.
బిఎస్పి మద్దతుదారునిపై టిడిపి నాయకుల దాడి
తిరుపతి నగరం సమీపంలోని సప్తగిరి కాలనీ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా న్యూమంగళం గ్రామపంచాయతీ సచివాలయంలో నామినేషన్ దాఖలు చేసి తిరిగి వస్తున్న బిఎస్పి మద్దతుదారుడైన రుద్ర గోపిని టిడిపి నాయకులు దాడి చేసి గాయపడ్డారు. నిందితుల ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని సిఐ సునీల్ కుమార్ తెలిపారు. టిడిపి నాయకులు తంబి అలియాస్ దిలీప్, యువరాజ్, వినోద్ అనే వ్యక్తులు పది మందితో కలిసి తనపై ఇనుప రాడ్లతో దాడి చేశారని రుద్ర గోపి ఆరోపించారు. సకాలంలో పోలీసులు స్పందించకపోయి ఉంటే తనను చంపేసేవారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.








కామెంట్లు (0)