బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘కొటియా’లో ఉద్రిక్తత

1 గంట క్రితం

‘కొటియా’లో ఉద్రిక్తత
-ఒడిశా అధికారులను నిలదీసిన గిరిజనులు
-తెలుగులోనే మాట్లాడాలంటూ సబ్‌ కలెక్టర్‌కు తేల్చిచెప్పిన మహిళలు
-​రోడ్డుపై ఆధార్, రేషన్ కార్డులు పరిచి నిరసన
-నేడు పరిషత్తు ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సర్వత్రా ఆందోళన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 10:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఒడిశా అధికారులను నిలదీసిన గిరిజనులు

  • తెలుగులోనే మాట్లాడాలంటూ సబ్‌ కలెక్టర్‌కు తేల్చిచెప్పిన మహిళలు

  • ​రోడ్డుపై ఆధార్, రేషన్ కార్డులు పరిచి నిరసన

  • నేడు పరిషత్తు ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సర్వత్రా ఆందోళన

ప్రజాశక్తి- పార్వతీపురం : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల పరిధిలోని ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఎఒబి) కొటియా గ్రూపు గ్రామాల్లో బుధవారం మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ గ్రామాల్లో గురువారం మండల పరిషత్తు ఎన్నికలకు ఆంధ్రా అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఈ నేపథ్యంలో కొటియా సరిహద్దు గ్రామాల్లోకి ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చారు. వీరిని స్థానిక ఆదివాసీలు, మహిళలు నిలదీసి తిప్పి పంపేశారు. తమ అస్తిత్వాన్ని, హక్కులను కాలరాయాలని చూస్తే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాకు ఒడియా రాదు... తెలుగులోనే మాట్లాడండి’ అంటూ నినదించారు. కొటియా పరిసరాల్లోని నేరళ్లవలస గ్రామంలోకి కొరాపుట్ సబ్ కలెక్టర్, ఒడిశాలోని మూడు ప్రధాన పార్టీల ప్రజాప్రతినిధులు ప్రవేశించడంతో గిరిజన మహిళలు వారి వాహనాలను చుట్టుముట్టారు. ‘మా వద్దకు ఎవరు వచ్చినా తెలుగులోనే మాట్లాడాలి’ అంటూ పట్టుబట్టారు. ఏళ్ల తరబడి ఆంధ్రప్రదేశ్‌తోనే తమ బంధం ముడిపడి ఉందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే తమకు జీవనాధారమని, ఎన్నికల సమయంలో ఒడిశా అధికారులు, ప్రతినిధులు హల్‌‌చల్‌ ‌చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపికి చెందిన తమ ఆధార్, రేషన్, ఓటరు గుర్తింపు కార్డులు, బ్యాంకు పాసుపుస్తకాలను రోడ్డుపై పరిచి వినూత్నంగా నిరసన తెలిపారు.

​పోలీసుల మోహరింపుపై అభ్యంతరం

సరిహద్దు గ్రామాల్లో ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామాలను యుద్ధ క్షేత్రాలుగా మారుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రా పోలీసులు వద్దు... ఒడిశా పోలీసులు వద్దు. బలగాలను తక్షణమే ఉపసంహరించి మా గ్రామాల్లో ప్రశాంతత కాపాడండి’ అంటూ నినాదాలు చేశారు. తమ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగేలా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గిరిజనులు డిమాండ్‌ ‌చేశారు. సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు భారీగా మోహరించడం, మరోవైపు ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధుల రాకతో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో గిరిజన ఓటర్లు భయాందోళనలకు గురవుతున్నారు. ఓటర్లలో నెలకొన్న భయాలను పోగొట్టి ప్రజాస్వామిక హక్కును వినియోగించుకునేలా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్