కేసును సిబిఐతో సమగ్ర విచారణ జరపాలి
ఒంగోలు కలెక్టరేట్ వద్ద మహా ధర్నా
ప్రజాశక్తి - ఒంగోలు సిటీ : తౌషిక్ - మౌలాబి మృతికి టిడిపి కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని, కేసును సిబిఐతో సమగ్ర విచారణ జరిపి, శ్రీచైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద ముస్లిం మైనారిటీ, దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తౌషిక్ -మౌలాబీ ఘటనలపై మహా ధర్నా నిర్వహించారు. విసికె పార్టీ జిల్లా అధ్యక్షులు మిడసల ఆదినారాయణ అధ్యక్షత వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ తౌషిక్, అతని తల్లి మౌలాబి మృతికి దారితీసిన పరిస్థితులను పూర్తిగా విచారించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడుతూ తౌషిక్ తల్లి మృతి చెందినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.
తౌషిక్ ఘటనపై విద్యాశాఖ చేపట్టిన విచారణ, పాఠశాలపై తీసుకున్న చర్యలు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శ్రీచైతన్య యాజమాన్యంపై వచ్చిన ఆరోపణలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని పలు ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు.
మిడసల ఆదినారాయణ మాట్లాడుతూ శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యంపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. 2008లో సింగరాయకొండ మండలం ఆవులవారిపాలెంకు చెందిన మాధవి అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటనను ప్రస్తావించారు. ఇలాంటి నేపథ్యం తెలిసినప్పటికీ స్థానిక పోలీసులు, అధికారులు పాఠశాల యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎంఆర్పిఎస్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు నరేంద్ర మాదిగ మాట్లాడుతూ తౌషిక్ మౌలాబీ మృతికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని, ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుస్తామని తెలిపారు. కేసును ఎఎస్ సి, డిఐజి డిజిపి స్థాయి అధికారులతో కాకుండా సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఆర్.మోహన్ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం చర్చి సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు.








కామెంట్‌లు (0)