గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖ పోర్టు ఆసుపత్రిని ప్రైవేటీకరించే కుట్రను తక్షణమే విరమించుకోవాలి

1 గంట క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 10:14 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- రేపు డ్యూటీ ప్రారంభంలో గంట పాటు నిరసన

- పోర్టు యాజమాన్యమే స్వంత నిధులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి

- పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల డిమాండ్

ప్రజాశక్తి - విశాఖ : విశాఖపట్నం పోర్టు ఆసుపత్రిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే పోర్టు యాజమాన్య ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని నవంబర్ 21వ తేదీన తీయబోయిన టెండర్లు రద్దు చేయాలని పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. రేపు (20/11/26) డ్యూటీ ప్రారంభంలో 1గంట పాటు నిరసన తెలుపుతాం. సుమారు 40 వేల మంది పోర్టు కార్మికులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఆసుపత్రిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్యగా అభివర్ణించాయి. ఈ మేరకు ఈరోజు సిఐటియు జగదాంబ కార్యాలయంలో పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, పోర్టు ఆసుపత్రి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఎంతమాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు. విశాఖపట్నం పోర్టుకు వేల కోట్ల రూపాయల ఆస్తులు, విలువైన భూములు, సొంత భవనాలు, భారీ రిజర్వు నిధులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్న పోర్టు యాజమాన్యం, కార్మికులు మరియు ఉద్యోగుల ఆరోగ్యానికి అవసరమైన ఆసుపత్రిని స్వయంగా అభివృద్ధి చేయలేమని చెప్పడం సిగ్గుచేటు. ఆసుపత్రిని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు ఉన్నప్పటికీ, ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశాలను యాజమాన్యం ప్రజలకు స్పష్టం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న సుమారు రూ.350 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ.9 కోట్లకే ప్రైవేటు సంస్థకు అప్పగించే ప్రతిపాదన చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి అభివృద్ధికి సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేస్తే ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించవచ్చని, వందల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్న విశాఖ పోర్టు ఈ మాత్రం ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు.

ప్రైవేటు సంస్థలు ప్రజాసేవ కోసం కాకుండా లాభార్జన కోసమే పనిచేస్తాయని, అటువంటి సంస్థలకు ఆసుపత్రిని అప్పగిస్తే వైద్య సేవలు ఖరీదైనవిగా మారడంతో పాటు, కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులపై ఆర్థిక భారం పడుతుందని హెచ్చరించారు. 40 వేల మందికి పైగా ఆధారపడిన కుటుంబాల ఆరోగ్య భద్రతను ప్రైవేటు సంస్థల వ్యాపార ప్రయోజనాలకు బలిచేయడం దారుణమని పేర్కొన్నారు. పోర్టు యాజమాన్యం ఆసుపత్రిని ప్రైవేటీకరించే ప్రయత్నాలను పక్కనపెట్టి, స్పెషలిస్ట్ వైద్యులను, అవసరమైన వైద్య సిబ్బందిని నియమించి, అత్యాధునిక వైద్య పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చి, పోర్టు ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. వైద్య సేవలు అందించడం సంస్థ సామాజిక బాధ్యతలో భాగమని, ఆ బాధ్యత నుంచి పోర్టు యాజమాన్యం తప్పించుకోవడం తగదని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఏఐటీయూసీ, వైయస్ ప్రకాష్ ,హెచ్‌ఎంఎస్ మంగయ్య నాయుడు, ఎస్ అర్జున్ రావు సీఐటీయు పద్మనాభ రాజు సత్యనారాయణ, సీఫ్టూఐ ఎం కనకారావు, ఐఎన్‌టీయూసీ జి చందు,బి పట్నాయక్ ఫెడరేషన్ల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్