మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థుల జీవితాలకు ప్రభుత్వం ఉరితాడు

4 రోజుల క్రితం

Government schools are empty... Where are the 5.56 lakh students? : YS Jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 07:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వైసిపి అధినేత జగన్

- ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలతో అవస్థలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ‌బకాయిలు విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలకు ఉరితాడు బిగించిందని, మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌‌మోహన్‌‌రెడ్డి ‌విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌‌లో పోస్ట్‌ ‌చేశారు. చిత్తూరులోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి ముఖ్యమంత్రి, ప్రస్తుత విద్యాశాఖ మంత్రే కారణమన్నారు. ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, విద్యార్థులు గతంలోనూ ఆత్మహత్యలకు పాల్పడ్డారని, రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా ప్రభుత్వానికి పట్టనట్లే ఉన్నారని తెలిపారు. పైగా టాపిక్‌ డైవర్ట్‌ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని, బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్‌ను నాశనం చేశారని విమర్శించారు. ఈ విద్యా సంవత్సరం చివరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకు, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు ఉందని, ఇవి కాకుండా 2024 ఏప్రిల్‌, 2025 ఏప్రిల్‌, 2025 ఏప్రిల్‌కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతి దీవెన బకాయిలు రూ.3,300 కోట్లు, మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లని తెలిపారు. ఇప్పటి వరకూ ఇచ్చింది రూ.1,100 కోట్లేనని పేర్కొన్నారు. ఇంకా రూ.9,600 కోట్లకు పైగా బాకీ ఉందన్నారు. ఇంత బకాయిలు పెడితే పేద పిల్లలు ఎలా చదువుకుంటారని, వారి భవిష్యత్‌తో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులపై మోపుతున్నాయని, తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వబోమని, సర్టిఫికెట్లు ఇవ్వబోమని చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఒత్తిళ్లు భరించలేక కొంతమంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారని విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్