ప్రభుత్వానికి పార్టీకి వారధి కార్యకర్తలే
టిడిపి ముఖ్యనేతలతో చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపి నేతలకు సూచించారు. స్థానిక అధికారులు, ఉద్యోగులతో పార్టీ యంత్రాంగం సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి స్థాయిలో ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలని చెప్పారు. టిడిపి కార్యాలయాన్ని చంద్రబాబు శనివారం సందర్శించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
అనంతరం పార్టీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, గుంటుపల్లి గ్రామాల్లో దశాబ్దాలుగా పెండింగులో ఉన్న భూ సమస్యలను పరిష్కరించామని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం 22-ఏ నిబంధనల పేరుతో వివాదాల్లోకి నెట్టిన భూములను దశలవారీగా క్లియర్ చేస్తున్నామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు ఇరిగేషన్ క్యాలెండర్ అమలు, యురియా సరఫరా కోసం ప్రత్యేక యాప్, అన్నదాత సుఖీభవ నిధుల జమ, ఈ నెలలో తల్లికి వందనం పథకం నిధుల విడుదల వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, అందరికీ సమాన అవకాశాలు అనే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న విషయాన్ని వివరించాలని చెప్పారు. వైసిపి చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తూనే ప్రభుత్వం చేసిన మంచి పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే పార్టీ శ్రేణుల ప్రధాన బాధ్యత అని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు సమగ్రంగా వివరించాలని సూచించారు.
సోషల్ మీడియాను దుష్ప్రచారం, విద్వేష రాజకీయాలకు వేదికగా మారుస్తూ అశాంతిని రేకెత్తించేలా వైసిపి చేస్తున్న ప్రయత్నాలను టిడిపి పార్టీతో సహా కూటమి పార్టీల శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చెప్పారు. సమాజంలో విధ్వంసాన్ని ప్రేరేపిస్తున్న వారి విషయంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులు బనాయించడం, అధికారాన్ని కోల్పోయిన తర్వాత అక్రమాలకు పాల్పడిన వారిని వెనకేసుకురావడం వైసిపికి రాజకీయ సంస్కృతిగా మారిందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.
వైసిపికి రాజకీయ పార్టీ లక్షణాలు లేవు
రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని, అందుకే ఆ పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నానని చంద్రబాబు అన్నారు. గ్రీవెన్స్ నిర్వహిస్తున్న సమయంలో తనను కలిసిన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జగన్, అతని కుటుంబం వల్ల అనేక మంది ఐఏఎస్‌లు బలయ్యారని, వ్యాపారవేత్తలను నాశనం చేశారని విమర్శించారు. ఇప్పటికీ పెట్టుబడులు పెట్టేవారిని బెదిరిస్తూ పరిశ్రమలు తరిమేస్తామని చెప్తున్నారని, పరిశ్రమలు వచ్చి ఉపాధి కల్పన జరిగితే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భయపడుతున్నారని అన్నారు. భోగాపురం విమానాశ్రయం పూర్తైందని, పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి కావొస్తున్నాయని, దీంతో వైసిపిలో టెన్షన్ మొదలైందని పేర్కొన్నారు. సొంత ప్రయోజనాలు, భూములు కొట్టేసే కుట్రలో భాగంగా రైతుల భూములను 22ఏలో పెట్టి ఇబ్బందులు గురి చేశారని, వాటిని తమ ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. సొసైల్ మీడియాలో తప్పుడు పోస్టులు, వ్యక్తిత హనన పోస్టుల కట్టడికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుపై ఇంకా వర్క్‌వుట్ చేస్తున్నామని వివరించారు. బ్రహ్మణీ స్టీల్ ప్లాంట్ కు కేటాయించిన భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుందని, ఓబులాపురం మైనింగ్ అంశం ఇంకా ముగియలేదన్నారు. పొక్సో కేసు పెట్టారని బాధితురాలు, వారి కుటుంబాన్ని, సొంత కుటుంబాన్ని తెలంగాణలో హత్య చేసిన హంతకుడి మనస్తత్వానికి జగన్‌కు దగ్గర పోలికలు ఉన్నాయని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)