- రాష్ట్రవ్యాప్తంగా నిరసన, ర్యాలీలు - ప్రజాప్రతినిధులకు వినతులు
ప్రజాశక్తి - యంత్రాంగం : తమకు కనీస వేతనం ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అన్ని రకాల లీవులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతిప్రతాలు అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరారు. శిక్షణ పొందిన ఎఎన్ఎం, జిఎన్ఎంలకు పర్మినెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా ప్రాధాన్యత కల్పించాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశాల సంఖ్యను పెంచాలని కోరారు.
నంద్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి.ఫరూక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బారావమ్మ హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలలో పని చేస్తున్న అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న అంగన్‌వాడీ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హెల్పర్ల ప్రమోషన్లకు సంబంధించిన జిఒ 5ను సవరించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌గా మార్చాలన్నారు. 1972 పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం ప్రకారం ఉద్యోగంలో ఉండి మధ్యలో మానేసిన, మరణించిన సిబ్బందికి కూడా గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నవచేతన యాప్, ఐవిఆర్ కాల్స్‌ను రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. కర్నూలు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రజ్రాపతినిధులకు వినతిపత్రాలు అందజేశారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, లావేరు, జి.సిగడాం, రణస్థలం మండలాలకు చెందిన ఆశావర్కర్లు వినతిపత్రం అందజేసేందుకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు నివాసానికి వెళ్లారు. యూనియన్ తరుపున ఇచ్చే వినతిపత్రం తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. తాను రాసిన పేపర్‌ను ఆశాలకు ఇచ్చి అదే తనకు ఇవ్వాలని చెప్పారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్.అమ్మన్నాయుడు మాట్లాడుతూ కార్మికశాఖ గుర్తింపు పొందిన యూనియన్ తరుపున నాలుగు మండలాల ఆశా వర్కర్లు సంతకాలు పెట్టి ఇచ్చిన వినతిపత్రం తీసుకోకుండా నిరాకరించడం సరికాదన్నారు. శ్రీకాకుళంలోని శాంతినగర్‌లో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణి ప్రమీలకు వినతిపత్రం అందజేశారు. కవిటి మండలంలోని రామయ్యపుట్టుగలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌కు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు వినతిపత్రం అందజేశారు. ఎన్‌టిఆర్ జిల్లా తిరువూరులో ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాసరావు పిఎకు, జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే రాజగోపాల్ పిఎకు విజయవాడలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. మైలవరంలో ఎమ్మెల్యే కార్యాలయ గేట్లకు వినతిపత్రం కట్టి నిరసన తెలిపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. అనంతపురం మంత్రి పయ్యావుల కేశవ్ కార్యాలయంలో సిఐటియు నాయకులు వినతిపత్రం అందజేశారు. మడకశిరలో మంత్రి సవితకు, ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ కార్యాలయంలో సిబ్బందికి వినతిని అందించారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్వతీపురంలోని సుందరయ్య భవనం నుండి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి టిడిపి నాయకులకు వినతిపత్రం అందజేశారు. రాజాంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన పిఎకు వినతిప్రతం ఇచ్చారు. తోటపాలెంలోని ఎల్‌బిజి భవనం నుంచి ఎమ్మెల్యే నివాసం అశోక్ బంగ్లా వరకు ర్యాలీ నిర్వహించి, ఎమ్మెల్యే అతిధి విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సాలూరులో స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిఎస్‌పికి వినతిపత్రం అందజేశారు. చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు కలికిరి మురళీమోహన్ మోహన్, గురజాల జగన్మోహన్‌లకు సామూహిక వినతిపత్రం ఇచ్చారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన స్థానంలో ఉన్న ఇన్‌చార్జి స్టేట్ ఆర్గనైజర్ సెక్రటరీ అమ్రేష్‌కు, తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు వినతిపత్రాలు అందజేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద ఆయా నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుని కార్యాలయంలో, విశాఖ జిల్లాలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణకు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. నూజివీడు, పాలకొల్లులో మంత్రులు కొలుసు పార్థసారధి, నిమ్మల రామానాయుడు కార్యాలయాల్లో, పెదవేగి మండలం దుగ్గిరాలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజుకు, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు వినతిపత్రం అందజేశారు.









కామెంట్‌లు (0)