- దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : జగన్
- స్థానిక సంస్థల ఎన్నికలపై మాజీ మంత్రి పేర్ని నాని
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు టిడిపి అరాచకానికి పరాకాష్టని మాజీ మంత్రి పేర్ని వెంక్రటామయ్య విమర్శించారు. ఇదే అంశంపై వైసిపి అధినేత జగన్ కూడా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి ప్రకటనలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. అలాగే సోమవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. నామినేషన్ల స్వీకరణ పర్వంతో మొదలైన అరాచకం డిక్లరేషన్ ఫారాలు ఇచ్చే వరకు నిరాటంకంగా కొనసాగిందని, సిఎం మీడియా సమావేశం చూస్తుంటే ఆవు తోలు కప్పుకున్న తోడేలు వంద అబద్ధాలు, యాభై నీతులు చెప్పినట్లుందని విమర్శించారు. బయట ప్రవచనాలు చెబుతూ ఆశ్రమంలో ఆగడాలు చేసే నిత్యానంద స్వామిలా చంద్రబాబు ద్వంద్వ వైఖరి ఉందని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్ఈసి) పక్షవాతం వచ్చిన రోగిలా మార్చేశారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే దుశ్శాసనుడిలా మారి వ్యవస్థను చెరబట్టారని తెలిపారు. టిడిపి రౌడీలు, గుండాల బెదిరింపులతో రాష్ట్రంలో 17 మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సిపి అభ్యర్థులు లేకుండా చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు గాను 51 చోట్ల ఫ్యాన్ గుర్తు లేకుండా దౌర్జన్యం చేశారని వివరించారు. కడప కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉంటే 51 స్థానాల్లో ప్రతిపక్షాన్ని బరిలో నిలవకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. వైసిపి క్రియాశీలక కార్యకర్తలపై అక్రమంగా రౌడీషీట్లు తెరిచి, లక్షల రూపాయల పూచీకత్తుతో బైండోవర్ చేశారని తెలిపారు. హంతకులైన టిడిపి రౌడీలపై ఎక్కడా బైండోవర్ కేసులు లేవన్నారు. నామినేషన్ పత్రాలు లాక్కొని చింపేయడం, సంతకాలు ఫోర్జరీ చేసి దొంగ విత్‌డ్రాలు చేయించడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. తాడికొండ, మంగళగిరిల్లో టిడిపి ఓడిపోయినప్పుడు అమరావతిని ప్రజలు తిరస్కరించినట్లేనని చంద్రబాబు ఒప్పుకుంటారా చెప్పాలన్నారు. గ్రామ కంఠం భూముల పేరుతో రాజధాని ప్రాంత రైతులను చంద్రబాబు, నారాయణ వేధిస్తున్నారని, అమరావతిలో చంద్రబాబు, నారాయణ ఇళ్లు తప్ప సామాన్య ప్రజలు కట్టుకున్న దాఖలా లేదని తెలిపారు. ఆర్ణబ్, మురుసు తుపానులతో సర్వం కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నయాపైసా సాయం అందలేదని అన్నారు.







కామెంట్‌లు (0)