ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
యూనివర్సిటీల్లో ఖాళీ సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. స్పాట్ అడ్మిషన్లను రద్దు చేస్తూ ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్, ప్రసన్న కుమార్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానం వల్ల విద్యార్థులు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందలేకపోతున్నారని తెలిపారు. ఫలితంగా అనేక విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రతి విశ్వవిద్యాలయం తన పరిధిలోని సీట్లను స్వయంగా భర్తీ చేసుకునే విధానాన్ని అమలు చేయాలని తాము తొలి నుంచి డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో పిజి సెట్ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకునే అవకాశం కల్పించారని గుర్తుచేశారు. దీంతో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య కొంతమేర పెరిగిందని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా పిజి కోర్సుల్లో విద్యార్థుల చేరికలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసేందుకు ఉన్నత విద్యామండలి అనుమతి నిరాకరించడం దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాల్సిన ఉన్నత విద్యాశాఖ అధికారులు ఖాళీగా ఉన్న విభాగాలను మరింత బలహీనపరిచేలా వ్యవహరించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానం కొనసాగితే భవిష్యత్తులో అనేక పిజి విభాగాలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే స్పాట్ అడ్మిషన్ల రద్దుపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఖాళీ సీట్ల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.







కామెంట్‌లు (0)