ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
అర్నబ్, మురసు తుపానుల సమయంలో 341 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ప్రమాదంలో చిక్కుకున్న మరో ఎనిమిది మంది ప్రాణాలను కాపాడిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డిఆర్ఎఫ్) సేవలను డిజిపి హరీష్ కుమార్ గుప్తా అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన సిబ్బంది ధైర్య సాహసాలు పోలీసు శాఖకు గర్వకారణమని కొనియాడారు. ‘అర్నబ్-2026’ తుపాను సహాయక చర్యల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రివార్డులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాలతో 328 మంది సిబ్బందితో కూడిన 11 ప్రత్యేక బృందాలు అక్టోబరు 27 నుంచి నవంబరు 1 వరకు తొమ్మిది జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు. డయల్ 112 రాష్ట్ర కంట్రోల్ రూమ్ మూడు రోజుల్లో 17 జిల్లాల నుంచి 369 తుపాను సంబంధిత అత్యవసర కాల్స్ స్వీకరించి కీలక సేవలందించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐజిపి (ఆపరేషన్స్) సిహెచ్ శ్రీకాంత్, ఎపిఎస్‌పి బెటాలియన్ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)