- హామీలను మరచిన టిడిపి కూటమి సర్కారు
- ఏటా వరదలకు నష్టపోతున్న రైతాంగం
ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి : ఏలేరు కాలువల ఆధునీకరణ అటకెక్కింది. పాలకులు మారుతున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఏలేరు ముంపు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలేశ్వరం మండల పరిధిలో ఉన్న ఏలేరు ప్రాజెక్టు కింద 53 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సుమారు 40 వేల మంది రైతులు దీనిపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు. ఏలేరు, గొర్రిఖండి, నక్కలఖండి, పెద్దేరు, చిప్పలేరు అనే పేర్లతో పిలిచే ఈ కాలువ ఐదు మండలాల పరిధిలో విస్తరించింది. సాగునీటి అవసరాలను తీర్చగా మిగిలిన నీరు సముద్రంలో కలిసేలా ఏలేరు కాలువను అప్పట్లో ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. దశాబ్దానికి పైగా ఆధునీకరణ పనులు లేకపోవడంతో ప్రస్తుతం ఈ కాలువ పలుప్రాంతాల్లో పూడుకు పోయింది. దీంతో వర్షాలు, వరదల సమయంలో కాలువల నీరు సమీప పంట పొలాలను ముంచెత్తుతోంది. ఎన్నికల సమయంలో నాయకులు ఏలేరు ఆధునీకరణపై హామీలు ఇవ్వడం, తరువాత గాలికొదిలేయడం సర్వసాధారణమైంది. గత ఎన్నికల్లోనూ టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏలేరు ఆధునీకరణకు హామీ ఇచ్చారు. కానీ, నేటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2024 సెప్టెంబర్ 11న ఏలేరు ఉధృతికి కిర్లంపూడి మండలం రాజుపాలెం నీట మునిగినప్పుడు కూడా ఆధునీకరణకు మరోసారి హామీ ఇచ్చినా నిధులు విదల్చలేదు.
ఆధునీకరణ ఎప్పుడో..?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కారు హయాంలో ఏలేరు ఆధునీకరణకు రూ.139 కోట్లతో ధర్మవరం వద్ద శంకుస్థాపన జరిగింది. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు హయాంలో 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఫేజ్ - 2లో మిగిలిన 40 శాతం పనులను పూర్తికి రూ.394 కోట్ల నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ గత వైసిపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో, పనులు నిలిచిపోయాయి. 2024 సెప్టెంబర్లో వచ్చిన వరదలకు ఏలేరు కాలువకు 280 చోట్ల గండ్లు పడ్డాయి. అరకొరగా కొన్ని చోట్ల గండ్లు పనులు పూర్తి చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. మిగిలిన చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేపట్టి మమ అనిపించింది.
ఏటా రూ.వందల కోట్లలో నష్టం...
అనేక ఏళ్లుగా ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో రైతులు ఏటా రూ.కోట్ల విలువైన పంటలను నష్టపోతున్నారు. గతేడాది మొంథా తుపాను ప్రభావంతో ఏలేరు కాలువ పొంగడంతో రూ.150 కోట్లకు పైగా పంటలను నష్టపోయారు. ఈ ఏడాది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సుమారు రూ.వంద కోట్లు వరకూ పంటలను నష్టం వాటిల్లింది. ఇలా ప్రతి ఏటా రూ.వంద నుంచి రూ.150 కోట్ల వరకు పంటలకు నష్టం జరుగుతున్నా పాలకుల్లో స్పందన లేదు.








కామెంట్లు (0)