- సిఎన్‌ఇఎస్ నివేదికపై సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ప్రజలకు అందుబాటులో ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, సామాజిక భద్రత వంటి అంశాల్లో జాతీయ స్థాయిలో రాష్ట్రం విశిష్ట స్థానాన్ని సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ (ఎఇఐ –2026)లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్ (సిఎన్‌ఇఎస్) రూపొందించి విడుదల చేసిన నివేదికపై ఈ సందర్భంగా స్పందించారు. తమ ప్రభుత్వం గత రెండున్నరేళ్ల కాలంలో చేపడుతున్న పరిపాలనకు అద్దంపట్టేలా ఈ నివేదిక ఉందన్నారు. రాష్ట్రాల ఆర్థిక సంపదతో పాటు ప్రజలకు దక్కుతున్న సమాన అవకాశాలు, పౌరులకు అవసరమైన సేవలు అందించేందుకు ఆ సంపదను ప్రభుత్వాలు ఎంత సమర్థంగా వినియోగిస్తున్నాయన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రూపొందించిందని చెప్పారు. గోవా 0.68 స్కోరుతో మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 0.66 స్కోరుతో రెండో స్థానాన్ని దక్కించుకుందని తెలిపారు. ప్రాథమిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక-ఆర్థిక భద్రత, న్యాయ సేవలు వంటి అంశాలను నివేదికలో పరిశీలించారని చెప్పారు. సంపద సృష్టి కోసం పెట్టుబడులు తీసుకురావటంతో పాటు ప్రజలకు మెరుగైన పాలన అందించటం అవకాశాలను అన్‌లాక్ చేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సోషియో ఎకనామిక్ సెక్యూరిటీ, మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం సహా వనరులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కుటుంబం నుంచి కమ్యూనిటీ ఆస్తుల వరకూ పరిశుభ్రమైన గ్రామాలు, పట్టణాలుగా మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ప్రతి ప్రాంతానికీ, వర్గానికీ చేరువగా పాలన, అభివృద్ధి అందుతుందని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అండగా నిలిచారని వ్యాఖ్యానించారు.








కామెంట్‌లు (0)