సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎపిఎండిసి బుడగ..!

1 గంట క్రితం

ఎపిఎండిసి బుడగ..!
- లాభాల అంచనాల వెనుక దాగిన భారీ నష్టాల ముప్పు
- దొడ్డి దారిన ప్రైవేటుకు కట్టబెడతారా? image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 06:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- లాభాల అంచనాల వెనుక దాగిన భారీ నష్టాల ముప్పు

- దొడ్డి దారిన ప్రైవేటుకు కట్టబెడతారా?

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎపిఎండిసి)ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడానికి-ఐపిఒకు వెళ్లాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఖనిజ రంగ నిపుణులు, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం చెబుతున్న లాభాల అంచనాలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య భారీ అంతరం ఉండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం కేవలం రూ.16,660 కోట్లు మాత్రమే విలువ ఉన్న సంస్థను 2030-31 నాటికి రూ.77,970 కోట్ల మేర పెరిగి రూ.94,630 కోట్ల సంస్థగా చూపిస్తున్నారు. అంటే కేవలం నాలుగేళ్లలో విలువ దాదాపు 6 రెట్లు పెరుగుతుందని చెబుతున్నారు. అప్పులు రూ.8,341 కోట్లు మినహాయించి, సంస్థ ఈక్విటీ విలువ రూ.86,290 కోట్లుగా నిర్ణయించారు. ఈ అంచనా నిజం కాకపోతే నష్టం ప్రజా ధనానికే వాటిల్లుతుంది. మరోవైపు ఐపిఒ పేరుతో సంస్థలో వాటాలను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడంతో సంస్థ ప్రయివేటీకరణకు దారి తీస్తుంది. దీంతో రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన సహజ వనరులపై కార్పొరేట్ల ఆధిపత్యానికి అవకాశం కల్పిస్తుంది.

రూ.21,572 కోట్లు వాటా విక్రయం

ఎపిఎండిసిలో 25 శాతం వాటా విక్రయం ద్వారా రూ.21,572 కోట్లు తెస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ వాటా ఒకసారి ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే మళ్లీ వెనక్కి తీసుకోవడం అసాధ్యం. రూ.7.8 లక్షల కోట్ల విలువైన రాష్ట్ర ఖనిజ సంపదపై ప్రైవేట్ వాటాదారులకు శాశ్వత హక్కు దక్కుతుంది. 2030-31 నాటికి ఆదాయం రూ.40,500 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం సంస్థ ఆదాయం దీనిలో 10వ వంతు కూడా లేదు. ఈ అంచనాలో అత్యధిక భాగం ఇంకా మొదలు కాని ప్రాజెక్టుల నుంచే రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులు ప్రారంభం కావడానికి అనేక అడ్డంకులొచ్చే అవకాశం లేకపోలేదు. బీచ్ శాండ్ మినరల్స్ ప్రాజెక్ట్‌ ‌నుంచి రూ.16,750, బాక్సైట్ ప్రాజెక్ట్‌‌ల నుంచి రూ.10,500, మోనజైట్ ప్రాజెక్టుల నుంచి రూ.10,450 చొప్పున ఈ 3 ప్రాజెక్టుల నుంచి రూ.37,700 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. ఈ మూడు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, భూసేకరణ, ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసీల సమ్మతి అవసరం. బాక్సైట్‌ ‌తవ్వకాలపై గిరిజనుల సుదీర్ఘ ఆందోళన అందరికీ తెలిసిందే!

ధరలు పడితే బాధ్యత ఎవరిది?

2030-31లో పన్ను తర్వాత లాభం రూ.8,100 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. కానీ ఖనిజాల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి. బాక్సైట్, ఇనుప ఖనిజం ధరలు సుమారు 20 శాతం పడిపోతే లాభం సగానికి సగం తగ్గిపోతుంది. అప్పుడు షేరు కొన్న మదుపర్లు, సంస్థ రెండూ నష్టపోక తప్పదు.

మరోవైపు 2030-31లో నిర్వహణ లాభం రూ.29,600 కోట్లు ఉంటుందని అంచనా. కానీ దీనికోసం మైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, రోడ్లు, పోర్టు సౌకర్యాల కోసం వేల కోట్ల పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడికి అప్పులు తీసుకుంటే వడ్డీ భారం సంస్థపై పడుతుంది. ప్రాజెక్టు ఆలస్యమైతే వడ్డీయే భారీ నష్టంగా మారుతుంది.

ప్రభుత్వ నియంత్రణ, ఉద్యోగ భద్రతకు ముప్పు

లిస్టింగ్ తర్వాత ప్రతి త్రైమాసికంలో లాభం చూపించాలనే ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల సంక్షేమం, పర్యావరణం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కంటే లాభానికి ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రొఫెషనల్ నిర్వహణ పేరుతో కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరిగి, శాశ్వత ఉద్యోగాలు తగ్గే ప్రమాదం ఉంది. ఐపిఒ ద్వారా ఒకేసారి డబ్బు వస్తుందనేది నిజమే. కానీ రూ.95,000 కోట్ల విలువ, రూ.40,500 కోట్ల ఆదాయం అనేవి నెరవేరని అంచనాలైతే, రాష్ట్ర ఖనిజ సంపదను, ప్రభుత్వరంగ సంస్థను చౌకగా ప్రైవేట్ చేతుల్లో పెట్టినట్టే అవుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్