ఒక అడవిలో పెద్ద ఏనుగు ఉంది. ఆ ఏనుగు చాలా పొగరుగా ఉండేది. తాను చాలా బలశాలినని అందరినీ హేళన చేసేది. అదే అడవిలో ఒక చిన్న ఎర్ర చీమ ఉంది. అది చాలా మంచిది. ఒకరోజు దాన్ని చూసిన ఏనుగు ‘నీ శరీరం చూడు ఎంత చిన్నగా ఉందో, నన్ను చూడు ఎంత పెద్దగా ఉన్నానో!’ ‘నిన్ను ఒక్క కాలుతో తొక్కితే చాలు, ప్రాణాలు కోల్పోతావు!’ అని ఎగతాళి చేసింది. కానీ, ఆ చిన్న చీమ దాని మాటలను అసలు పట్టించుకోలేదు.
చాలా కాలం తరువాత ఒకరోజు ఆ అడవికి వేటగాళ్ళు వచ్చారు. వాళ్ళు ఒక పెద్ద వల పన్ని ఆ ఏనుగును బంధించారు. ఆ ఏనుగు తాళ్ల నుండి విడిపించుకోవడానికి గట్టిగా అరిచింది. ఏనుగు అరుపులు విని అడవిలోని జంతువులన్నీ అక్కడకు చేరుకున్నాయి. కానీ ఏ జంతువు కూడా వేటగాళ్ల భయంతో ముందుకు రాలేదు. అప్పుడు ఆ ఎర్ర చీమ అక్కడకు చేరుకుని పరిస్థితిని గమనించింది. వెంటనే ఆ చీమ తన తోటి చీమలన్నింటినీ పిలిచింది. అవన్నీ కలిసి వేటగాళ్లపైకి దాడి చేశాయి. చీమలన్నీ వేటగాళ్ల శరీరాలపైకి పాకి విపరీతంగా కుట్టసాగాయి. ఆ నొప్పులు భరించలేక వేటగాళ్ళు అక్కడి నుండి పారిపోయారు. అలా చిన్న చీమ తన ప్రాణాలను పణంగా పెట్టి ఏనుగును కాపాడింది. అప్పుడు ఏనుగుకు తన తప్పు అర్థమైంది. ‘మిత్రమా! నా బలమే గొప్ప అనుకుని నిన్ను చాలాసార్లు అవమానించాను. కానీ ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వే నాకు ప్రాణభిక్ష పెట్టావు!’ అని ఏనుగు కన్నీరు పెట్టుకుంది. చీమను చూసి క్షమించమని వేడుకుంది. ఆ చీమ పెద్ద మనసుతో ఏనుగు చేసిన తప్పును క్షమించింది. అప్పటినుంచి ఏనుగు పొగరు వదిలేసి ఇతర జంతువులతో స్నేహంగా ఉండసాగింది.
- రాధవారం లాస్య, 9 వ తరగతి,
నాదర్ గుల్ జిల్లా పరిషత్ హైస్కూలు,
రంగారెడ్డి.








కామెంట్లు (0)