ఆచార్య పి.సి. వెంకటేశ్వర్లు తన 23వ పుస్తకంగా ప్రచురించిన ‘శ్రీశ్రీ సమగ్ర సాహిత్య సమీక్ష’ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ‘మళ్లీ శ్రీశ్రీపై పుస్తకం ఎందుకంటే?’ అనే వ్యాసంలో రచయిత తన ఉద్దేశాన్ని వివరించారు. ‘మహాప్రస్థానం’ తప్ప శ్రీశ్రీ గొప్పగా రాసింది ఏముందని భావించేవారికి ఆయన కలం తాకిన ఆధునిక సాహిత్య ప్రక్రియలన్నింటినీ పరిచయం చేయడమే తన ప్రయత్నమని పేర్కొన్నారు. తెలుగు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శ్రీశ్రీ సాహిత్య విస్తృతిని పరిచయం చేయడం, ఆయన కథలు, లేఖలు, విమర్శ, అభిప్రాయాలు, సినిమా సాహిత్యం, హాస్యం వంటి అరుదుగా చర్చకు వచ్చే ప్రక్రియలను వివరించడం ఈ గ్రంథం ప్రధాన లక్ష్యం. వర్గ దృక్పథం, సామాజికత వంటి అంశాలను శ్రీశ్రీ తన కథల్లో ఎలా వ్యక్తీకరించారో రచయిత విశ్లేషించారు. ‘ఈ వ్యాసాల రచనలో లోపాలు ఉంటే అవి తాను అర్థం చేసుకోవడంలోనే కానీ, శ్రీశ్రీ రాయడంలో కాదు’ అని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్యకు అంకితమిచ్చారు.
తెలకపల్లి రవి తన ముందుమాటలో శ్రీశ్రీ ప్రభావం సాహిత్యానికే పరిమితం కాలేదని, భాషకు కూడా ఆయన కొత్త రూపు ఇచ్చారని పేర్కొన్నారు. ‘మహాప్రస్థానం’ తెలుగు సాహిత్య చరిత్రలో కీలకమైన దిక్సూచి అని, ‘మరో ప్రస్థానం’ శ్రీశ్రీ జీవిత సాహిత్య చరిత్రలో అవిభాజ్య భాగమని అభిప్రాయపడ్డారు. శ్రీశ్రీ అర్థం కావాలంటే ఆయన రచనల నేపథ్యం, సారాంశం తెలుసుకోవాలని, అందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందని పేర్కొంటూ డాక్టర్ పి.సి. వెంకటేశ్వర్లును అభినందించారు. విమర్శకులు వి. చెంచయ్య ఈ పుస్తకాన్ని ‘ఒక రచయిత సమగ్ర సాహిత్య పరిచయానికి ఇదొక నమూనా’గా అభివర్ణించారు. శ్రీశ్రీ నవరసాలపై తొమ్మిది కథలు రాశారని, మొత్తం 35 కథలను ‘చరమరాత్రి’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారని, 14 ఏళ్ల వయసులోనే 1924లో ‘పరిణయ రహస్యం’ అనే చిన్న నవలికను రచించారని వివరించారు. కమ్యూనిస్టు పార్టీ ఉనికిలోకి రాని కాలంలోనే గురజాడను ‘కామ్రేడ్ గురజాడ’ అని ఎందుకన్నారో తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని చదవాలని సూచించారు. హైదరాబాద్ యూనివర్సిటీ తెలుగు శాఖ ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు ఈ పుస్తకాన్ని ‘శ్రీశ్రీని మళ్లీ సామాన్య పాఠకుడికి కూడా చేర్చే ప్రయత్నం’గా పేర్కొన్నారు. శ్రీశ్రీ ఆత్మకథ, ‘చైనా యానం’, ‘వారంవారం’ వ్యాసాల ద్వారా ఆయన అంతర్జాతీయ దార్శనికత, హాస్యచతురత, సామాజిక వ్యంగ్యం, భాషా క్రీడలను రచయిత వివరించారని ప్రశంసించారు. మార్క్స్ గతితార్కిక భౌతికవాద సిద్ధాంతాల ప్రభావంతో ‘మహాప్రస్థానం’ ద్వారా పీడిత ప్రజల పక్షపాతిగా, అభ్యుదయ కవిగా మారి శ్రామికుల కష్టాలను ఎలా అక్షరబద్ధం చేశారో విశ్లేషించారని పేర్కొన్నారు.
యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి ‘శ్రీశ్రీ బహుముఖ చైతన్యానికి పి.సి. సాక్ష్యం’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లు చూపిన సమగ్ర దృష్టి లేకపోవడం వల్ల అనేక అధ్యయనాలు ఒకే ప్రక్రియ చుట్టూ తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. శ్రీశ్రీ సాహిత్యం మార్క్సిస్టు దృక్పథంతోపాటు విశాలమైన మానవతా దృక్పథాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. ‘సాహిత్యానికి మనిషి కేంద్ర బిందువు’, ‘మనిషే నా సంగీతం, మానవుడే నా సందేశం’ అనే భావనలు ఆయన సాహిత్య తత్వాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపారు. మూలగ్రంథాల అధ్యయనం, పూర్వ విమర్శల పరిశీలన, స్వతంత్ర విశ్లేషణ అనే మూడు అంశాలు ఈ గ్రంథంలోని వ్యాసాల్లో సమన్వయమై కనిపిస్తున్నాయని వివరించారు. శ్రీశ్రీ రచనలను ప్రత్యక్షంగా అధ్యయనం చేసి స్వతంత్ర నిర్ణయాలను ప్రతిపాదించడమే ఈ గ్రంథానికి ఉన్న పరిశోధనాపరమైన విలువ అని పేర్కొన్నారు.
ఈ గ్రంథంలో ‘శ్రీశ్రీ జీవనయానం’, ‘కవిత్వం’, ‘వచన సాహిత్యం’, ‘విమర్శనా సాహిత్యం’, ‘అనువాద సాహిత్యం’ అనే శీర్షికలతో అధ్యాయాలు ఉన్నాయి. చివరి అధ్యాయంలో 22వ వ్యాసంగా శ్రీశ్రీ అనువదించిన ‘రెక్కలు విప్పిన రెవల్యూషన్’ ఉంది. ఈ అనువాదం చేసిన సమయంలో శ్రీశ్రీ తిరుగుబాటు ధోరణితో ఉన్నారని, సంప్రదాయ కమ్యూనిస్టు యూనియన్లపై, కమ్యూనిస్టు నాయకత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారని పి.సి. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బహుశా మూలంలో ఉన్నదాన్నే ఈ పుస్తకంలో చెప్పి ఉంటారని అభిప్రాయపడ్డారు. రచయిత నిష్కర్షగా, నిష్పక్షపాతంగా సమతూకంతో తన అభిప్రాయాలను కూడా జోడించిన పుస్తకం ఇది. తెలుగు విమర్శనా క్షేత్రంలో అత్యంత క్లిష్టమైన, అనివార్యమైన కవి శ్రీశ్రీ సాహిత్యాన్ని సమగ్రంగా పరిచయం చేయాలనే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. 320 పేజీల ఈ పుస్తకం వెల రూ.350. ప్రతులు ప్రజాశక్తి బుక్ హౌస్ శాఖల్లో అందుబాటులో ఉన్నాయి.
- మల్లేశ్వరరావు ఆకుల
79818 72655







కామెంట్లు (0)