ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మౌలిక భావనలపై పట్టు.. లక్ష‍ణాలు, సూత్రాలపై గురిపెట్టు

24 నిమిషాల క్రితం

maths
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 05:00 పూర్వాహ్నం | 8 నిమిషాల చదవడం

డీఎస్సీ–2026 గణిత ప్రిపరేషన్‌

గణితంలో విజయం సాధించాలంటే ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి సమస్యలను సాధన చేయాలి. ఒక అంశాన్ని చదివిన తరువాత పుస్తకం మూసివేసి, దాని నిర్వచనం, లక్షణాలు, సూత్రాలను స్వయంగా రాయగలగాలి. తప్పులు వచ్చిన సమస్యలను ప్రత్యేకంగా గుర్తించి మళ్లీ సాధన చేయాలి. వారానికి ఒకసారి నమూనా పరీక్ష రాసి, సమయపాలనతో పాటు సమాధానాల ఖచ్చితత్వాన్ని పెంచుకోవాలి. గణిత బోధనలోనూ, పోటీ పరీక్షల సన్నద్ధతలోనూ భావనల అవగాహనే కీలకం. ఒక మంచి గణిత ఉపాధ్యాయుడు విద్యార్థికి సమాధానం చెప్పడం మాత్రమే కాదు; ఆ సమాధానం ఎలా వచ్చిందో ఆలోచించేలా చేయాలి. ఉదాహరణలు, బొమ్మలు, నమూనాలు, సంఖ్యారేఖ, గణిత ఉపకరణాలు, ప్రయోగాలు, సమస్యా పరిష్కార కార్యకలాపాల ద్వారా భావనలను బోధించాలి. విద్యార్థులలో భయాన్ని తొలగించి, ప్రశ్నించే తత్వాన్ని, స్వయంగా పరిష్కారం కనుగొనే సామర్థ్యాన్ని పెంపొందించాలి.

పట్టు సాధించాలి

డీఎస్సీ పోటీలో విజయం సాధించాలంటే గణితంపై పట్టు సాధించడం తప్పనిసరి. సూత్రాన్ని గుర్తుపెట్టుకోవడం కంటే దాని వెనుక ఉన్న భావనను అర్థం చేసుకోవడం ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. నిర్వచనాలు, లక్షణాలు, సిద్ధాంతాలు, సూత్రాలు, సమస్యల పరిష్కారం, బోధనా అనువర్తనాలపై సమగ్ర అవగాహన పెంచుకున్న అభ్యర్థులు పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించగలరు.గణితం అంటే కేవలం కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు, సూత్రాలు, లెక్కలు మాత్రమే కాదు. ఇది తార్కిక ఆలోచనకు, సమస్యల పరిష్కారానికి, విశ్లేషణాత్మక దృక్పథానికి పునాది. ఉపాధ్యాయ నియామక పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు గణితంలోని ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఒక భావన ఎలా ఏర్పడింది? దాని నిర్వచనం ఏమిటి? దాని లక్షణాలేమిటి? ఇతర భావనలతో దానికి ఉన్న సంబంధం ఏమిటి? అనే అంశాలపై స్పష్టత కలిగి ఉండాలి.

మౌళిక భావలపై అవగాహన

డీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యే ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులు గణితంలో మౌలిక భావనలపై పట్టు సాధించడం అత్యంత అవసరం. కేవలం సూత్రాలను బట్టీ పట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. వాటి వెనుక ఉన్న గణిత సూత్రాలు, తార్కిక సంబంధాలు, అనువర్తనాలను అర్థం చేసుకోవాలి. గణిత కంటెంట్‌తోపాటు బోధనా పద్ధతులపై కూడా అవగాహన పెంపొందించుకోవాలి.

1. సంఖ్యా వ్యవస్థ (Number System)

సంఖ్య అనేది పరిమాణాన్ని తెలియజేసే గణిత సాధనం. వస్తువులను లెక్కించడం, కొలవడం, పోల్చడం వంటి అవసరాల నుంచి సంఖ్యా వ్యవస్థ అభివృద్ధి చెందింది.

సహజ సంఖ్యలు (Natural Numbers): లెక్కించడానికి ఉపయోగించే 1, 2, 3, 4, ... సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. వీటి సమితిని N తో సూచిస్తారు. సహజ సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య 1. అతి పెద్ద సహజ సంఖ్య ఉండదు.

పూర్ణ సంఖ్యలు (Whole Numbers): సహజ సంఖ్యలకు సున్నాను కలిపితే పూర్ణ సంఖ్యలు ఏర్పడతాయి. W = {0, 1, 2, 3, ...}. పూర్ణ సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య 0. అతి పెద్ద సంఖ్య ఉండదు.

పూర్ణాంకాలు (Integers): ధన సంఖ్యలు, ఋణ సంఖ్యలు, సున్నా కలిపి పూర్ణాంకాలు ఏర్పడతాయి. Z = {..., -3, -2, -1, 0, 1, 2, 3, ...}. ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకమే. ప్రతి పూర్ణాంకం సహజ సంఖ్య కాదు.

కరణీయ సంఖ్యలు (Rational Numbers): p/q రూపంలో రాయగల సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. ఇక్కడ p, q పూర్ణాంకాలు; q ≠ 0. ఉదాహరణకు 2/3, -5/7, 4, 0. ప్రతి పూర్ణాంకాన్ని కరణీయ సంఖ్యగా రాయవచ్చు. రెండు వేర్వేరు కరణీయ సంఖ్యల మధ్య అనంతమైన కరణీయ సంఖ్యలు ఉంటాయి.

అకరణీయ సంఖ్యలు (Irrational Numbers): p/q రూపంలో వ్యక్తం చేయలేని సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు. ఉదా: √2, √3, π. వీటి దశాంశ విస్తరణ అంతం లేనిది, పునరావృతం కానిది.

వాస్తవ సంఖ్యలు (Real Numbers): కరణీయ, అకరణీయ సంఖ్యల సమితుల కలయికను వాస్తవ సంఖ్యలు అంటారు. సంఖ్యారేఖపై ప్రతి బిందువు ఒక వాస్తవ సంఖ్యను సూచిస్తుంది..

స్థానవిలువ – ముఖవిలువ: ఒక సంఖ్యలో అంకె ఉన్న స్థానాన్ని బట్టి దాని స్థానవిలువ మారుతుంది. అంకెకు ఉండే అసలు విలువ ముఖవిలువ. ఉదాహరణకు 5,482లో 5 ముఖవిలువ 5 కాగా స్థానవిలువ 5,000.

భారతీయ సంఖ్యా విధానంలో ఒకట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు, లక్షలు, పది లక్షలు, కోట్లు అనే స్థానాలు ఉంటాయి. అంతర్జాతీయ విధానంలో Ones, Tens, Hundreds, Thousands, Ten Thousands, Hundred Thousands, Millions అనే స్థానాలు ఉపయోగిస్తారు.

సరి – బేసి సంఖ్యలు: 2తో పూర్తిగా భాగించబడే సంఖ్యలు సరి సంఖ్యలు. 2తో భాగించినప్పుడు శేషం 1 వచ్చే సంఖ్యలు బేసి సంఖ్యలు. సరి + సరి = సరి; బేసి + బేసి = సరి; సరి + బేసి = బేసి.

ప్రధాన సంఖ్యలు: 1 కంటే పెద్దదై, కేవలం 1తోనూ, అదే సంఖ్యతోనూ నిశ్శేషంగా భాగించబడే సంఖ్యను ప్రధాన సంఖ్య అంటారు. ఉదా: 2, 3, 5, 7, 11. 2 మాత్రమే ఏకైక సరి ప్రధాన సంఖ్య. 1 ప్రధాన సంఖ్య కాదు.

సంయుక్త సంఖ్యలు: రెండుకంటే ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు. ఉదా: 4, 6, 8, 9, 10. 1 ప్రధాన సంఖ్యా కాదు, సంయుక్త సంఖ్యా కాదు.

భాజ్యతా నియమాలు:

• 2తో: చివరి అంకె సరి సంఖ్య అయి ఉండాలి.

• 3తో: అంకెల మొత్తం 3తో భాగించబడాలి.

• 4తో: చివరి రెండు అంకెలతో ఏర్పడిన సంఖ్య 4తో భాగించబడాలి.

• 5తో: చివరి అంకె 0 లేదా 5 అయి ఉండాలి.

• 6తో: 2, 3 రెండింటితోనూ భాగించబడాలి.

• 8తో: చివరి మూడు అంకెల సంఖ్య 8తో భాగించబడాలి.

• 9తో: అంకెల మొత్తం 9తో భాగించబడాలి.

• 10తో: చివరి అంకె 0 అయి ఉండాలి.

• 11తో: బేసి స్థానాల అంకెల మొత్తం, సరి స్థానాల అంకెల మొత్తం మధ్య భేదం 0 లేదా 11 గుణిజం అయి ఉండాలి.

గరిష్ఠ సామాన్య భాజకం (HCF): రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను నిశ్శేషంగా భాగించే సామాన్య భాజకాలలో అతి పెద్దది. కనిష్ఠ సామాన్య గుణిజం (LCM): రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలకు సామాన్య గుణిజాలలో అతి చిన్నది. రెండు ధన పూర్ణ సంఖ్యల విషయంలో HCF × LCM = ఆ సంఖ్యల లబ్ధం. ఉదాహరణకు 12, 18లకు HCF = 6, LCM = 36. 6 × 36 = 12 × 18.

2. భిన్నాలు, దశాంశాలు

(Fractions and Decimals)

ఒక సంపూర్ణ వస్తువును సమాన భాగాలుగా విభజించినప్పుడు అందులోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాగాలను సూచించడానికి భిన్నాలను ఉపయోగిస్తారు. a/b రూపంలో భిన్నాన్ని రాస్తారు. ఇక్కడ a లవం, b హారం; b సున్నా కాకూడదు.

భిన్నాల రకాలు:

• క్రమ భిన్నం: లవం హారం కంటే చిన్నది. ఉదా: 3/5.

• అక్రమ భిన్నం: లవం హారం కంటే పెద్దది లేదా సమానం. ఉదా: 7/4.

• మిశ్ర భిన్నం: పూర్ణ సంఖ్యతో పాటు క్రమ భిన్నం ఉంటుంది. ఉదా: 1 3/4.

• సమాన భిన్నాలు: విలువ ఒకటే అయినా రూపం వేరుగా ఉంటుంది. ఉదా: 1/2 = 2/4 = 3/6.

భిన్నాల కూడిక, తీసివేతకు హారాలు సమానంగా ఉండాలి. హారాలు వేర్వేరుగా ఉంటే వాటి క.సా.గు తీసుకుని సమాన హారాలుగా మార్చాలి. గుణకారంలో లవాలను, హారాలను గుణించాలి. భాగహారంలో రెండో భిన్నం యొక్క విలోమాన్ని తీసుకుని గుణించాలి.

దశాంశ భిన్నాలు 10, 100, 1000 వంటి హారాలు కలిగిన భిన్నాలు. ఉదా: 0.5 = 5/10 = 1/2. దశాంశ కూడిక, తీసివేతలో దశాంశ బిందువులను ఒకే వరుసలో ఉంచాలి.

3. అంకగణితం (Arithmetic)

BODMAS నియమం: ఒకే గణిత వ్యక్తీకరణలో అనేక క్రియలు ఉన్నప్పుడు వాటిని నిర్వహించే క్రమాన్ని BODMAS సూచిస్తుంది. Brackets, Orders, Division, Multiplication, Addition, Subtraction. ఒకే ప్రాధాన్యత గల భాగహారం–గుణకారం, కూడిక–తీసివేతలను ఎడమ నుంచి కుడికి నిర్వహించాలి.

నిష్పత్తి (Ratio): ఒకే రకమైన రెండు పరిమాణాలను పోల్చే విధానమే నిష్పత్తి. a:b రూపంలో రాస్తారు. ఉదా: 2:3. నిష్పత్తిలోని రెండు పదాలను ఒకే సంఖ్యతో గుణించినా లేదా భాగించినా నిష్పత్తి విలువ మారదు.

అనుపాతం (Proportion): రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నప్పుడు అనుపాతం ఏర్పడుతుంది. a:b = c:d అయితే ad = bc. ఉదా: 2:3 = 4:6.

ప్రత్యక్ష అనుపాతం: ఒక పరిమాణం పెరిగితే మరొకటి కూడా అదే నిష్పత్తిలో పెరగడం. ఉదా: ఒక వస్తువు ధర స్థిరంగా ఉన్నప్పుడు వస్తువుల సంఖ్య పెరిగే కొద్దీ మొత్తం ధర పెరుగుతుంది.

వ్యుత్క్రమ అనుపాతం: ఒక పరిమాణం పెరిగితే మరొకటి తగ్గడం. ఉదా: పని పరిమాణం స్థిరంగా ఉన్నప్పుడు కూలీల సంఖ్య పెరిగితే పని పూర్తయ్యే సమయం తగ్గుతుంది.

శాతం (Percentage): ప్రతి వందకు ఎంత అనే భావనను శాతం అంటారు. x% = x/100. ఉదా: 25% = 25/100 = 1/4. శాతం భావనను మార్కులు, జనాభా, లాభనష్టాలు, బ్యాంకు వడ్డీ వంటి సందర్భాల్లో ఉపయోగిస్తారు.

లాభం – నష్టం: అమ్మకపు ధర, కొనుగోలు ధర కంటే ఎక్కువైతే లాభం; తక్కువైతే నష్టం. లాభం = అమ్మకపు ధర – కొనుగోలు ధర. నష్టం = కొనుగోలు ధర – అమ్మకపు ధర. లాభ శాతం = (లాభం/కొనుగోలు ధర) × 100. నష్ట శాతం = (నష్టం/కొనుగోలు ధర) × 100.

రాయితీ: గుర్తింపు ధరపై తగ్గింపును రాయితీ అంటారు. రాయితీ = గుర్తింపు ధర – అమ్మకపు ధర. రాయితీ శాతం = (రాయితీ/గుర్తింపు ధర) × 100.

సాధారణ వడ్డీ: అసలు, వడ్డీ రేటు, కాలంపై ఆధారపడి లెక్కిస్తారు. SI = (P × R × T)/100. మొత్తం మొత్తం = P + SI.

చక్రవడ్డీ: ప్రతి కాలానికి వచ్చిన వడ్డీని అసలుకు కలిపి తదుపరి కాలానికి వడ్డీ లెక్కించే విధానం. వార్షిక చక్రవడ్డీకి A = P(1 + R/100)^T. చక్రవడ్డీ = A – P.

4. బీజగణితం (Algebra)

తెలియని సంఖ్యలను అక్షరాలు లేదా సంకేతాల రూపంలో సూచించి గణిత సంబంధాలను వ్యక్తపరచడమే బీజగణితం. x, y, a, b వంటి అక్షరాలను చరరాశులు అంటారు.

స్థిరాంకం: విలువ మారని సంఖ్య. ఉదా: 5, 10.

చరరాశి: విలువ మారగల సంఖ్యను సూచించే అక్షరం. ఉదా: x, y.

బీజగణిత వ్యక్తీకరణ: సంఖ్యలు, చరరాశులు, గణిత క్రియలతో ఏర్పడిన రూపం. ఉదా: 3x + 5.

పదం: కూడిక లేదా తీసివేత గుర్తుల ద్వారా విడిపోయే భాగం. 3x + 5లో 3x, 5 రెండు పదాలు.

గుణకం: చరరాశిని గుణించే సంఖ్య. 7xలో 7 గుణకం.

బహుపది: చరరాశుల ఘాతాలు ఋణేతర పూర్ణ సంఖ్యలుగా ఉండే బీజగణిత వ్యక్తీకరణ. ఉదా: x² + 3x + 2.

పదాల సంఖ్య ఆధారంగా ఏకపది, ద్విపది, త్రిపదిగా వర్గీకరిస్తారు. అత్యధిక ఘాతం ఆధారంగా బహుపది యొక్క డిగ్రీని నిర్ణయిస్తారు.

సరళ సమీకరణం: ఒక చరరాశి గరిష్ఠ ఘాతం 1గా ఉండే సమీకరణం. ఉదా: 2x + 3 = 9. దీనికి x = 3 పరిష్కారం.

ముఖ్యమైన బీజగణిత సూత్రాలు:

• (a + b)2 = a2 + 2ab + b2

• (a – b)2 = a2 – 2ab + b2

• a2 – b2 = (a + b)(a – b)


• (a + b)3 = a3 + 3a2b + 3ab2 + b3

• (a – b)3 = a3 – 3a2b + 3ab2 – b3

ఘాతాంకాలు: ఒక సంఖ్యను ఎన్నిసార్లు దానితోనే గుణించాలో సూచించే సంఖ్యను ఘాతాంకం అంటారు. am × an = am+n; am/an = am-n (a ≠ 0); (am)n = amn; a0 = 1 (a ≠ 0); a-n = 1/an.

5. జ్యామితి (Geometry)

వస్తువుల ఆకారాలు, పరిమాణాలు, స్థానాలు, వాటి మధ్య సంబంధాలను అధ్యయనం చేసే గణితశాఖ జ్యామితి.

బిందువు: పరిమాణం, పొడవు, వెడల్పు లేని స్థానాన్ని సూచిస్తుంది. రేఖ: రెండు వైపులా అనంతంగా విస్తరించేది. రేఖాఖండం: రెండు అంత్యబిందువుల మధ్య ఉండే రేఖలోని భాగం. కిరణం: ఒక అంత్యబిందువు నుంచి ఒక దిశలో అనంతంగా విస్తరించేది.

కోణం: ఒకే అంత్యబిందువు కలిగిన రెండు కిరణాల మధ్య ఏర్పడే ఆకారం. కోణాలను డిగ్రీలలో కొలుస్తారు. లంబకోణం 90°, అల్పకోణం 90° కంటే తక్కువ, అధికకోణం 90° కంటే ఎక్కువ కానీ 180° కంటే తక్కువ, సరళకోణం 180°, పరిపూరక కోణాల మొత్తం 90°, సంపూరక కోణాల మొత్తం 180°.

త్రిభుజం: మూడు భుజాలు, మూడు కోణాలు కలిగిన బహుభుజి. త్రిభుజంలోని అంతర్గత కోణాల మొత్తం 180°. బాహ్యకోణం దానికి ఎదురుగా ఉన్న రెండు అంతర్గత కోణాల మొత్తానికి సమానం.

భుజాల ఆధారంగా సమబాహు, సమద్విబాహు, విషమబాహు త్రిభుజాలుగా; కోణాల ఆధారంగా అల్పకోణ, లంబకోణ, అధికకోణ త్రిభుజాలుగా విభజిస్తారు. సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం 60°. లంబకోణ త్రిభుజంలో కర్ణం పొడవు మిగిలిన రెండు భుజాల కంటే ఎక్కువ.

పైథాగరస్ సిద్ధాంతం: లంబకోణ త్రిభుజంలో కర్ణం వర్గం మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. c² = a² + b².


సరికొండ లెనిన్‌బాబు

– గణిత అధ్యాపకులు

సిరిపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల,

సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా.

సెల్‌: 9985476035

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్