మౌమితా ఆలం పశ్చిమ బెంగాల్‌కు చెందిన కవయిత్రి, వ్యాసకర్త, ఉపాధ్యాయురాలు. ఉత్తర బెంగాల్‌లోని జల్‌పైగురి ప్రాంతానికి చెందిన ఆమె అణగారిన వర్గాల జీవితాలు, మహిళలపై వివక్ష, మతపరమైన విద్వేషం, సామాజిక అసమానతలు వంటి అంశాలపై కవిత్వం, వ్యాసాలు రాస్తుంటారు. ఆమె తొలి కవితా సంపుటి ‘ది మ్యూజింగ్స్ ఆఫ్ ది డార్క్’ 2020లో ప్రచురితమైంది. ఆమె రచనలు దక్షిణాసియాలో పాఠకుల ఆదరణ పొందాయి. నాగరిక సమాజాన్ని ఊరడించడానికి కాకుండా, దాన్ని కల్లోలపరచడానికి తాను రాస్తానని చెప్పే మౌమితా ఆలం, తరగతి గది క్రమశిక్షణకు, సాహిత్య తిరుగుబాటుకు మధ్య ఉన్న సంబంధంపై ‘పారిటీ పల్స్’తో జరిపిన ఈ సంభాషణలో తన అభిప్రాయాలను వెల్లడించారు.
* మీరు రెండు విభిన్న ప్రపంచాలలో జీవిస్తున్నారు. తరగతి గది క్రమశిక్షణను కోరుకుంటుంది, కానీ మీ కవిత్వం సంపూర్ణ తిరుగుబాటును కోరుకుంటుంది. ఈ రెండు గుర్తింపులు ఎప్పుడైనా ఘర్షణ పడతాయా?
ఈ రెండు ప్రపంచాలు వేర్వేరు అని నేను అనుకోను. ఈ రెండింటికీ కలలు కావాలి- మెరుగైన రేపటి కోసం కలలు, సమానత్వంతో కూడిన ప్రపంచం కోసం కలలు. అవును, తరగతి గదికి కొన్ని క్రమశిక్షణలు అవసరమే, కానీ అవి అణచివేత లేని సమానత్వ ప్రపంచం అనే నా కలకు ఎప్పుడూ అడ్డు రాలేదు. బదులుగా, నా విద్యార్థులు ఈ కలతో ప్రభావితం కావాలని, వ్యవస్థను ప్రశ్నించేలా వారు మరిన్ని ప్రశ్నలు అడగాలని నేను కోరుకుంటున్నాను.
* మీరు అణగారిన వర్గాల గురించి తీవ్రంగా రాస్తారు. కానీ సాహిత్యాన్ని తరచుగా సంపన్న వర్గాలే ఆస్వాదిస్తుంటాయి. మీ రచనలు ఉన్నత వర్గాలకు కేవలం ఒక "శోక కథనం"గా మిగిలిపోకుండా ఎలా నిరోధిస్తారు?
మీరు చెప్పింది నిజమే. ఈ ప్రశ్న నన్ను కూడా వెంటాడుతుంటుంది. నా రచనలు ఉన్నత వర్గాల చేత శోక కథనాలుగా ఆస్వాదించబడుతున్నాయని నేను భావించడం లేదు. వారు నా రచనలను చదవడానికి ధైర్యం చేస్తారని కూడా నేను అనుకోను. నా మాటలు వారిని ఆందోళనకు గురిచేస్తాయి. కేవలం రాయడం ద్వారానే నా పని ముగిసిపోతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను క్షేత్రస్థాయికి వెళ్తాను, ప్రజలను ఏకం చేస్తాను. ఏదో ఒక రోజు పేదలు, అణగారిన వర్గాలు ఈ అసహ్యకరమైన సంపన్నుల సామ్రాజ్యాన్ని కూల్చివేస్తారని నేను కలలు కంటున్నాను.
* వ్యవస్థాగత అణచివేత చాలా దారుణమైనది. సాంప్రదాయ సాహిత్య సౌందర్యం లేదా నాగరిక రచనలు ఈ చిత్రాన్ని ఆవిష్కరించడానికి సరిపోవని మీరు భావిస్తున్నారా?
చూడండి, ‘కళ కోసమే కళ’ అనే సిద్ధాంతాన్ని నేను నమ్మను. ప్రపంచం రక్తం చిందిస్తున్నప్పుడు, చంద్రుని అందం గురించి రాయడం ఒక నేరం అని నేను నమ్ముతాను. నా కవితలు ఘాటుగా ఉంటాయి. చేదు నిజాలను బయటపెడతాయి.
* పుస్తకాలు మన రాజకీయ ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. మీరు రాసేటప్పుడు ఏ నిర్దిష్ట చారిత్రక లేదా అణగారిన వర్గాల గొంతులతో విభేదిస్తారు లేదా వేటిపై ఆధారపడతారు?
నా జీవితమే నా రాజకీయాలను రూపుదిద్దిందని భావిస్తున్నాను. నా చుట్టూ ఉన్న ప్రజల పోరాటాలే నన్ను నడిపిస్తాయి. కానీ నేను అరుంధతీ రాయ్ రచనలను తీవ్రంగా అభిమానించే పాఠకురాలిని. అయితే మొత్తంగా చూస్తే, నేను ఎవరి మధ్యనైతే జీవిస్తున్నానో ఆ ప్రజల జీవితాలు, వారి పోరాటాలే నన్ను తీర్చిదిద్దాయి, ఇప్పటికీ తీర్చిదిద్దుతున్నాయి.
* మీ కవిత్వం చాలా నిర్దిష్టమైన, స్థానిక పరిస్థితులలో వేళ్లూనుకుంది. అయినప్పటికీ ఇది దక్షిణ ఆసియా అంతటా అపారమైన ప్రజాదరణ పొందింది. మీ రచనలకు ఈ స్థాయిలో ఆదరణ లభించడానికి గల కారణం ఏమిటని మీరు భావిస్తున్నారు?
చూడండి, మనుషులుగా మనకు ఆనందాలు ఒకేలా ఉండకపోవచ్చు కానీ దురదృష్టవశాత్తు మన దుఃఖాలు, బాధలు మాత్రం ఒకటే. నా కవితలకు ప్రజాదరణ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఆ కవితలు కొందరినైనా చేరితే దానికి కారణం..... మనమందరం, అంటే సాధారణ ప్రజలమైన మనం ఒకే విధమైన నియంతృత్వ పాలనను, ద్వేషాన్ని, ఫాసిస్టులను, వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటమే.
* దక్షిణ ఆసియా ఉమ్మడి చరిత్రగా గాయాలను, వలసలను పంచుకుంటోంది. మన చారిత్రక గతం నేడు మీరు విమర్శిస్తున్న వ్యవస్థాగత దోపిడీని ఇప్పటికీ శాసిస్తోందని మీరు భావిస్తున్నారా?
అవును, ఖచ్చితంగా. ఆ గాయాలను ఎప్పుడూ గుర్తించనే లేదు. గాయం మానడానికి మొదటి మెట్టు... ఆ గాయం ఉందనే సత్యాన్ని అంగీకరించడమే. కానీ ఈ ఉపఖండంలో అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం ఆ చీలికలను సజీవంగానే ఉంచారు. జర్మనీలో హోలోకాస్ట్ మ్యూజియంలు ఉన్నాయి. మరి విభజన మ్యూజియంలు ఎన్ని ఉన్నాయి?
* సమాజం మిమ్మల్ని సులభంగా ఒక తిరుగుబాటుదారురాలిగా ముద్ర వేస్తుంది. అయితే మన ప్రపంచంలో మేధోపరమైన అసమ్మతి వ్యక్తం చేయడానికి వ్యక్తిగత మూల్యం భారీగానే చెల్లించాల్సి ఉంటుంది. దైనందిన జీవితంలో ఈ తిరుగుబాటు మీకు ఎలా కనిపిస్తోంది?
ఈ ప్రశ్నకు నేను మిమ్మల్ని అభినందించాలి. నా కవిత “ది ప్రైస్ ఆఫ్ ఫ్రీడమ్” (స్వాతంత్ర్యపు మూల్యం) ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తుందని నేను భావిస్తున్నాను:
మీరు స్వేచ్ఛను కోరుకుంటే మీరు మూల్యం చెల్లించాలి, అంటారు.
నా స్వేచ్ఛ కోసం నేను మూల్యం చెల్లిస్తున్నాను
నేను తిట్ల రూపంలో మూల్యం చెల్లిస్తున్నాను
నా తండ్రి నన్ను తిరుగుబాటుదారు అంటాడు
నా తల్లి నన్ను చెడ్డ అమ్మాయి అంటుంది
సమాజం నన్ను పతనం చెందినదానిగా చూస్తుంది
నా మాజీ ప్రేమికుడు నన్ను అహంభావి అయిన మూర్ఖురాలు అంటాడు
నా సోదరి నేను భర్తను ఆకర్షించడంలో విఫలమైన పనికిమాలినదానిగా చూస్తుంది
నా దేశం నన్ను దేశద్రోహి అంటుంది
కానీ నేను మాత్రం నన్ను నేను స్వేచ్ఛా మహిళగా పిలుచుకుంటాను
* మనం అలసిపోయే సామాజిక-రాజకీయ వార్తల యుగంలో జీవిస్తున్నాము. ఈ నిత్య నిరాశ మీ కలాన్ని నీరసానికి గురిచేయకుండా ఎలా ఎదుర్కొంటారు?
చూడండి, నిరాశ అనేది ఉంటుంది. చుట్టూ చాలా జరుగుతున్నాయి. నా అస్తిత్వం- ఒక నష్యా షేక్, దళిత, ముస్లిం, క్వీర్, మహిళ, ఒక ఆడబిడ్డకు తల్లి కావడం. ఇలా నా ప్రతి గుర్తింపు నాకు కొత్త స్థాయి అణచివేతలను, హింసను తెచ్చిపెడుతుంది. కానీ రోజు చివరికి మిగిలేది ఆశ మాత్రమేనని నేను నమ్ముతాను. నేను నా కాలానికి సాక్షిని. కొన్నిసార్లు నాకు మొద్దుబారినట్లు అనిపిస్తుంది. కానీ ప్రతిఘటనే ముందుకు సాగడానికి ఏకైక మార్గం.
* విమర్శలకు అతీతంగా, ప్రస్తుత నిరుపేదల కోసం మీరు సమసమాజాన్ని సాకారం చేయాలని కోరుకుంటున్నారు. రాజకీయ వాచకాన్ని పక్కన పెడితే, సమష్టిగా మనం చేయవలసిన మొదటి మానసిక మార్పు ఏమిటి?
ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పెట్టుబడిదారీ విధానం, ఫాసిజం రెండింటికీ పరాయీకరణ అవసరం అని నేను భావిస్తున్నాను. ఈ రాక్షసులిద్దరూ మనం ఒంటరిపాటు చెందాలని కోరుకుంటారు. మనం ఆచరించాల్సిన మొదటి మానసిక మార్పు ఏమిటంటే... మనల్ని మనం “మేము” అని భావించడం. “నేను, నాది” అనే ధోరణి నయా-ఉదారవాద సరళ రేఖ లాంటిది. మనం “నేను, నాది” అనే పరిధిని దాటి ఆలోచించాలి. మనం ఒకరినొకరు చేరుకోవాలి. అందుకే నేను ఎప్పుడూ శ్రామిక వర్గ ప్రజలతో పనిచేయడానికి ఎదురుచూస్తాను. మధ్యతరగతి వర్గమే ద్వేషాన్ని, మార్కెట్‌ను అత్యధికంగా వినియోగించేది. ఈ తరగతే కుళ్లిపోయిన తరగతి. అయినప్పటికీ నేను శ్రామిక వర్గ ప్రజలలో ఆశను చూస్తాను. ఉదాహరణకు, గ్రామంలో మీ వద్ద కాస్త భూమి ఉంటే దాన్ని మీ ఒక్కరే సాగు చేసుకోలేరు. ట్రాక్టర్ కోసం, నీటి కోసం లేదా ఇతర సహాయం కోసం మీరు మీ పొరుగువారిపై ఆధారపడాలి. కాబట్టి ఇప్పటికీ గ్రామాల్లో ప్రజలు నగరాల వలె అంత ఒంటరిగా లేరు.
* దారుణమైన ఈ కాలంలో ప్రజల పట్ల, ఉద్యమాల పట్ల మీ సానుభూతిని ఏది సజీవంగా ఉంచగలుగుతుంది?
ప్రేమపై నాకున్న అచంచలమైన నమ్మకమే. ఎలాగో నాకు తెలియదు కానీ ప్రతి హృదయ విదారక సంఘటన తర్వాత, ప్రతి వైఫల్యం తర్వాత, ప్రతి చెడ్డ రోజు తర్వాత నేను నిద్రలేచి మళ్లీ ప్రేమలో పడతాను. నేను ఎప్పటికీ ప్రేమను విడిచిపెట్టను. ప్రేమ వివిధ రూపాల్లో ఉంటుంది. ఇక్కడ నా కవితలోని ఒక పంక్తిని ఉదహరించాలనుకుంటున్నాను—
శిథిలాలను ఓడిస్తూ ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది.
ప్రేమను, ఆశను మనం విడిచిపెట్టవద్దు.
(Parity Pulse వెబ్‌సైట్ సౌజన్యంతో)







కామెంట్‌లు (0)