• రూపాయి పతనం.. దిగుమతి సుంకం పెంపుతో అదనపు భారం
• పది గ్రాములపై రూ.57 వేలకు పైగా పెరుగుదల
------------------
నా విజ్ఞప్తి వల్లే ధరలు తగ్గాయి : ప్రధాని మోడీ
లక్నో : తన విజ్ఞప్తి మేరకు ప్రజలు బంగారం కొనడం తగ్గించారని, అందువల్లే ధరలు తగ్గాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌లో శనివారం జరిగిన ఐదవ జాతీయ నైపుణ్య స్నాతకోత్సవంలో ప్రధాని ప్రసంగించారు. "అవసరం లేకపోతే, దయచేసి ఏడాది పాటు బంగారం కొనకండి అని కోరాను. నా విజ్ఞప్తిని ప్రజలు మన్నించి, బంగారం కొనడం తగ్గించారు; దీనివల్ల బంగారం ధరలు తగ్గాయి, ఇది నాకు సంతోషాన్నిస్తోంది." అని తనకు తాను కితాబు ఇచ్చుకున్నారు.
--------------
తన విజ్ఞప్తుల వల్లే పసిడి ధర తగ్గిందని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కమలం పార్టీ, సంఘ్ పరివార్ శ్రేణులు తమ నేత ముందుచూపు వల్లే తగ్గిందని గొప్పలు చెబుతుంటే, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలంటే ఏమి చేయాలంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దేశంలో బంగారం ధరలు పెరగడానికి, కూతురు పెళ్లికి అప్పు చేసి 10 గ్రాముల తాళిబొట్టు కొన్న పేద తండ్రిపై సైతం రూ.57 వేలకు పైగా అదనపు భారం పెరగడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలే కారణమన్న సంగతిని కప్పిపెడుతున్నారు.
2026 మే 10న సికింద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మోడీ దేశ ప్రజలకు ఏడు విజ్ఞప్తులు చేశారు. ఏడాది పాటు అవసరం లేని బంగారం కొనొద్దని కోరడం అందులో ఒకటి. విజయవాడ మార్కెట్లో మే 1న పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,260గా ఉండగా, మే 13న గరిష్ఠంగా రూ.1,62,611కు చేరింది. నవంబర్ 22 నాటికి రూ.1,25,080కు తగ్గింది. మే నెల గరిష్ఠ ధరతో పోలిస్తే పది గ్రాములపై రూ.37,531 తగ్గింది. ఇది సుమారు 23 శాతం తగ్గుదల. అంతర్జాతీయ మార్కెట్, డాలర్ విలువ, రూపాయి మారకం విలువ తగ్గడం, కేంద్ర ప్రభుత్వ పన్నుల విధానం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. మోడీ బంగారం కొనొద్దని విజ్ఞప్తి చేయడం కాదు, భారం పడకుండా లేదా భారం తగ్గేలా ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే లేదు! పైగా తన విధానాల వల్ల, నిర్ణయాల మూలంగానూ బంగారం ధర పెరగడానికి కారణమయ్యారు.
రూపాయి పతనంతో రూ.47,500 అదనపు భారం
భారత్ బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర డాలర్లలో నిర్ణయిస్తారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గితే అదే బంగారం కొనడానికి ఎక్కువ రూపాయలు చెల్లించాలి. 2014 మేలో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక డాలర్ విలువ రూ.59.30గా ఉంది. తాము అధికారంలోకి వస్తే రూపాయిని డాలరుతో సమానంగా బలోపేతం చేస్తామని చెప్పుకున్న బిజెపి, రూపాయి పతనానికి మరింత కారణమైంది. 2026 మేలో డాలరు విలువ రూ.95.60కు చేరింది. అంటే డాలర్ కొనడానికి 2014తో పోలిస్తే ఇప్పుడు దాదాపు 60 శాతం ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. రూపాయి విలువ 2014 నాటి స్థాయిలోనే ఉండి ఉంటే పది గ్రాముల బంగారం ధర ఇప్పుడు రూ.1,25,080కు బదులు సుమారు రూ.77,600 ఉండేది. అంటే రూపాయి పతనం వల్ల పది గ్రాములపై దాదాపు రూ.47,500 అదనపు భారం పడుతోంది.
సుంకం పెంపుతో రూ.9,789 భారం
2014లో యుపిఎ ప్రభుత్వ హయాంలో బంగారం దిగుమతి సుంకం 10 శాతంగా ఉండేది. 2019లో మోడీ ప్రభుత్వం దాన్ని 12.5 శాతానికి పెంచింది. 2021లో 10.75 శాతానికి తగ్గించి, 2022లో మళ్లీ 15 శాతానికి పెంచింది. 2024 జూలైలో వాణిజ్యవర్గాల వినతి మేరకు 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. దీంతో దేశీయ బంగారం ధరలకు కొంత ఊరట లభించింది. 2026 మేలో బంగారం కొనడం తగ్గించాలని చెప్పిన మోడీ ప్రభుత్వం ఆ వెంటనే దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దిగుమతి సుంకం 6 శాతంగానే కొనసాగి ఉంటే ఇప్పుడు పది గ్రాముల బంగారం సుమారు రూ.1,15,291కు లభించేది. సుంకం పెంపు వల్ల పది గ్రాములపై సుమారు రూ.9,789 అదనపు భారం పడుతోంది. పోనీ, 2014 నాటి 10 శాతం సుంకం ఉన్నా అదే బంగారం ధర సుమారు రూ.1,19,642 ఉండేది. దీంతో పోల్చినా పది గ్రాములపై రూ.5,438 అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
రూపాయి పతనం, దిగుమతి సుంకం పెంపు రెండింటి ప్రభావాన్ని కలిపి చూస్తే పది గ్రాముల బంగారంపై దాదాపు రూ.57 వేల అదనపు భారం కొనుగోలుదారులపై పడుతోంది. ఈ విషయాలన్నీ విస్మరించి... తన వల్లే ధరలు తగ్గాయని ప్రధాని చెప్పుకోవడం విడ్డూరం. భారతీయ సంప్రదాయంలో బంగారానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పెళ్లిళ్లు, కుటుంబ అవసరాలు, సంప్రదాయ పొదుపు, మహిళల ఆర్థిక భద్రత వంటి కారణాలతో బంగారం కొనడం ఆనవాయితీ. మోడీ ప్రభుత్వం ప్రజల సెంటిమెంట్‌కు కూడా విలువ ఇవ్వకుండా ప్రజలను లూటీ చేస్తోంది.
- ఫీచర్స్ డెస్క్







కామెంట్లు (0)