అమరావతి : హింస చేస్తోంది వాళ్లే, పిటిషనర్లూ వాళ్లే ఇదేం అరాచకం అని సిఎం చంద్రబాబు ప్రశ్నించారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో .... అదే హింస... అవే అబద్దాలు... అవే అరాచకాలు... పేరుతో వైసిపి హింసా రాజకీయాలపై బుక్ లెట్ ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. కొన్ని వీడియోలను ప్రదర్శించారు. అనంతరం సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ... మంచి పాలనతోనే సుపరిపాలన అనేది సాధ్యం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమైన ప్రక్రియ అని చెప్పారు. స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థ మనకు ఉందన్నారు. గత పాలనలో శాంతిభద్రతలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఎపి లో ఓ రాజకీయ పార్టీ నుంచి శాంతిభద్రతల సమస్యలు తలెత్తటం తీవ్రమైన అంశం అని అన్నారు. గతంలో నక్సల్స్ వల్ల శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవలు రాష్ట్రాభివృద్ధికి తీవ్ర నష్టం కలిగించాయన్నారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని కూడా కట్టడి చేసి శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు అన్నారు. వైఎస్ హయాంలో ఫ్యాక్షన్ తో భయపడిన పరిస్థితి నెలకొందన్నారు. 2014 తర్వాత ఓ పార్టీ నానా అరాచకం సృష్టించిందని విమర్శించారు. ఎన్నికలను అపహాస్యం చేసి, పాలనను విధ్వంసం చేశారని మండిపడ్డారు. ఆఖరుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా తనకు ప్రాణ భయం ఉందని ఫిర్యాదు చేసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 2024లో దానికి ఫలితంగా కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో ప్రజల మద్దతు సాధించిందన్నారు. 94 శాతం మేర స్ట్రైక్ రేట్ తో 57 శాతం ఓట్లను సాధించగలిగామన్నారు. ప్రజలు తమ పై పెట్టుకున్న నమ్మకాన్ని అనునిత్యం పనిచేస్తూ వస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి పెట్టి కోల్పోయిన బ్రాండ్ ను పునరుద్ధరించామని చెప్పారు. రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీ బ్రాండ్ తోనే సాధించగలిగామన్నారు. వేగంగా అనుమతులు ఇస్తే ఎక్కువ పరిశ్రమలు వస్తాయని, ఎక్కువ మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలిపారు. కేవలం ఒప్పందాలే కాదు ఉత్పత్తి దశకు వెళ్లేంత వరకూ ఫాలో అప్ చేస్తున్నామన్నారు. ఎపి కి పెట్టుబడులు వస్తున్నాయని పొరుగు రాష్ట్రాలు యావత్ దేశం గుర్తించిందని సిఎం చంద్రబాబు ప్రసంగించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి రోజు నుంచి వైసిపి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించిందని సిఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ క్రిమినల్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దౌర్జన్యాలకు పాల్పడ్డారన్నారు. ఓ ఎంపీ వాహనంతో ఎన్డీఏ కార్యకర్తలను తొక్కించారని, ఆ కారులో, మద్యం బాటిళ్లు మారణాయుధాలు కూడా ఉన్నాయని తెలిపారు. పుంగనూరు, రాయచోటి, కనిగిరి, దర్శి, కడప తంబళ్లపల్లె, తిరుపతి ఇలా వేర్వేరు ప్రాంతాల్లో అరాచకం సృష్టించారని ఆరోపించారు. రాష్ట్రం తగులబడిపోయినా ఫర్వాలేదని... తమ అజెండా నెగ్గాలనే ఆలోచనతోనే వైసీపీ ఇదంతా చేసిందని ధ్వజమెత్తారు. పంజాబ్ రాష్ట్రం నుంచి కిరాయి ముఠాలను తీసుకువచ్చి భయబ్రాంతులకు గురిచేశారన్నారు. కనిగిరిలో నామినేషన్ కేంద్రంలోకి వెళ్లి పత్రాలు లాక్కున్నారని, తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై దాడి చేశారని, జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రజల్లో చర్చ జరగాలని కోరారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే తమ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బ తీయాలనే ఫేక్ ప్రచారం, సొంత మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హింస చేస్తోంది వాళ్లే, పిటిషనర్లూ వాళ్లే ఇదేం అరాచకం అని ప్రశ్నించారు. గతంలో బాబాయిని చంపేసి తన పై ఫేక్ ప్రచారం చేశారని అన్నారు. ఇప్పుడూ అదే తంతు. ఫేక్ ప్రచారం చేసి పిటిషన్లు వేస్తున్నారని అన్నారు. కోర్టులకెళ్లి తప్పుడు లిటిగేషన్లు వేసి క్రిమినల్ లిటిగెంట్లుగా తయారయ్యారన్నారు. హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఎస్ఈసీ ఆదేశాలు అనుసరిస్తామని కూటమి పార్టీల తరపున ప్రకటన విడుదల చేశామన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం... వ్యవస్థలను గౌరవిస్తూ పని చేయటమే తమకు తెలుసునన్నారు. రాజకీయ పార్టీగా వాళ్లు చేసే అరాచకాలను వదిలివేస్తే రౌడీ రాజ్యం వస్తుందని హెచ్చరించారు. ఓ మాజీ ఎమ్మెల్యే కూతురు బురఖా వేసుకుని నామినేషన్ కేంద్రంలోకి వెళ్లి నామినేషన్ పత్రాలను లాక్కుని వచ్చారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ దాడులు చేసి వాహనాలు దగ్ధం చేసి హింసాత్మక ఘటనలకు పాల్పడిందని సిఎం చంద్రబాబు మాట్లాడారు.







కామెంట్లు (0)