లక్నో : ఇతరులను చొరబాటుదారులుగా ముద్రవేస్తున్న వారే నిజమైన చొరబాటుదారులని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. దేశ ప్రజల మధ్య విభజన సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. భారతీయ సంస్కృతి, సోదరభావం, పరస్పర గౌరవంతో కూడిన భారతీయతను ఎవరూ దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలు చొరబాటుదారుల ఓటు హక్కును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని చేసిన వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. భారతీయత అనేది పరస్పర గౌరవం, ఐక్యత, కలిసి ముందుకు సాగడంలో ఉందని పేర్కొన్నారు. ఇతరులను చొరబాటుదారులుగా అభివర్ణించే వారు దేశ సంస్కృతి, సోదరభావాన్ని దెబ్బతీయలేరని అన్నారు. వాస్తవానికి, చొరబాటుదారుల గురించి మాట్లాడుతున్న వారే నిజమైన చొరబాటుదారులని వ్యాఖ్యానించారు.
ఎన్నికల అక్రమాలకు సంబంధించి తమ పార్టీ సేకరించిన వేలాది అఫిడవిట్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని శనివారం ఆయన భారత ఎన్నికల సంఘాన్ని (ఈసి) కోరారు. ఈ ఆధారాలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన శాసనమండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల్లో బిజెపి అక్రమాలకు పాల్పడిందని అన్నారు. ఆగ్రా, ఫతేపూర్, ఎటావా, ఔరైయా, ముజఫర్‌నగర్, ఘజియాబాద్, నోయిడా తదితర జిల్లాల్లో ఓటమి భయంతో ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం, అవినీతిపరులైన అధికారులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఎన్ని అక్రమాలకు పాల్పడినా బిజెపి ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేశారు.
అలహాబాద్-ఝాన్సీ డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గం, గోరఖ్‌పూర్-ఫైజాబాద్ డివిజన్ ఉపాధ్యాయ నియోజకవర్గం సహా కీలక శాసనమండలి స్థానాలకు శుక్రవారం పోలింగ్ ముగిసింది. ఈ నెల 27న ఓట్ల లెక్కింపు జరగనుంది.







కామెంట్‌లు (0)