బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడ మేయర్‌ పీఠానికి త్రిముఖ పోరు

21 అక్టోబర్, 2026

విజయవాడ మేయర్‌ పీఠానికి త్రిముఖ పోరు 
- ఎబి వెంకటేశ్వరరావు బరిలో నిలవడంతో కూటమి, వైసిపి అభ్యర్థుల్లో గుబులు
- ఎబివికి వామపక్షాలు, కాంగ్రెస్‌ మద్దతు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 08:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎబి వెంకటేశ్వరరావు బరిలో నిలవడంతో కూటమి, వైసిపి అభ్యర్థుల్లో గుబులు

- ఎబివికి వామపక్షాలు, కాంగ్రెస్‌ మద్దతు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజకీయ కేంద్రమైన విజయవాడ మేయర్‌ పీఠం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ స్థానానికి మాజీ డిజిపి ఎ.బి.వెంకటేశ్వరరావు నామినేషన్‌ ‌దాఖలు చేయడంతో త్రిముఖ పోరు నెలకొంది. ఇదే అంశం ఇప్పుడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. నయానో, భయానో బెదిరించడం, కుల రాజకీయాలను వాడుకుని గెలవాలనుకుంటున్న అభ్యర్థుల్లోనూ గందరగోళం నెలకొంది. నగరంలో బలమైన ‌ప్రజామద్దతు ఉన్న వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎబి వెంకటేశ్వరరావుకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అధికార పార్టీలో ఒక గ్రూపు వంగవీటి రాధాకృష్ణ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం, సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన కుమారుడు సిద్ధార్థకు మేయర్‌ ‌పద్దవి ఇప్పించాలనుకుని వైఫల్యం చెందడంతో దాని ప్రభావం కూడా కూటమి అభ్యర్థిపై పడే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అలాగే తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గద్దె రామ్మోహన్‌ ‌కూడా వంగవీటి రాధాకృష్ణ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న నగరంలో కనీసం కార్పొరేటర్‌ ‌కూడా లేని జనసేనకు మేయర్‌ ‌పదవి ఇవ్వడంపై టిడిపి నాయకులు అగ్రహంతో ఉన్నారు. గతంలో ఉన్న రౌడీ రాజకీయాలు ముందుకు వస్తాయనే భయం కూడా నగర వాసులను వెంటాడుతోంది. ఇదే అభిప్రాయాన్ని కూటమికి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా వ్యక్తం చేసినట్లు తెలిసింది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న అన్ని మున్సిపాలిటీల్లోనూ వారికే ఛైర్మన్‌ ‌పదవిని ఇచ్చారని, విజయవాడలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా మేయర్‌ సీటు ఎలా కేటాయిస్తారని కొందరు టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎంపి, ఎమ్మెల్యే ఉన్న కృష్ణాజిల్లాలో మచిలీపట్నం ఇవ్వవచ్చని విజయవాడ ఎలా కేటాయిస్తారనే ప్రశ్న ను టిడిపి అధిష్టానం వద్ద కొందరు ఎంఎల్‌ఏలు లేవనెత్తినట్లు సమాచారం. మూడు పార్టీలతో జరిగిన సమావేశంలోనూ ఎమ్మెల్యే బొండా ఉమా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రతిపక్షంలో ఉండగా అధికార పార్టీ రాజకీయాలను ఎదుర్కొని నిలబడ్డ తమ అభిప్రాయాలకు కనీసం విలువ ఇవ్వకుండా జనసేనకు కేటాయించడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు పలు డివిజన్లలో టిడిపి అభ్యర్థులు నామినేషన్‌ ‌వేసిన చోట జనసేన పార్టీ నాయకులు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇది వైరాన్ని మరింత పెంచింది. మరోవైపు కొద్దిరోజుల క్రితం వరకు తెలుగుదేశంలో ఉండి జనసేనలో చేరిన వెంటనే మేయర్‌ ‌సీటు కేటాయించడంపై జనసేన నాయకుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది.దీంతోవిజయవాడ మేయర్‌ అభ్యర్థి విషయంలో టిడిపి కూటమిలో గందరగోళం నెలకొంది.

మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసిపి నఇప్పటి వరకూ మేయర్‌‌గా ఉన్న రాయన భాగ్యలక్ష్మిని మరోసారి అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె తొలుత తాను ఖర్చు భరించలేనని అభ్యంతరం వ్యక్తం చేశారనే వార్తలూ వచ్చాయి. అలాగే పలుచోట్ల వైసిపి తరుపున రెబల్‌ అభ్యర్థులు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. చాలా డివిజన్లలో ఇండిపెండెంట్లుగా నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఇది కూడా ఆ పార్టీకి అంతర్గత తలనొప్పిగా మారింది. అదేసమయంలో వామపక్షాలు, కాంగ్రెస్‌ ‌మద్దతుతో నామినేషన్‌ ‌దాఖలు చేసిన ఇండిపెండెంట్‌ ‌మేయర్‌ అభ్యర్థి, మాజీ డిజిపికి అన్ని వర్గాల నుండి మద్దతు పెరుగుతోంది. దీనికితోడు ప్రజా సమస్యలు, స్థానిక సమస్యలు, ప్రభుత్వాల అక్రమాలు, దోపిడీ తదితర అంశాలపై ఆయన నిరంతరం ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల ఎస్‌ఐఆర్‌‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలోనూ పాల్గొన్నారు. బిజెపి అక్రమాలనూ ప్రశ్నిస్తున్నారు. బిజెపి ఎమ్మెల్యే నడకుదిటి ఈశ్వరరావు భూదోపిడీని ఆధారాలతో సహా బయటపెట్టారు. ముఖ్యంగా ప్రజలపై విధిస్తున్న భారాలపై ప్రభుత్వాలను ఎబివి ప్రశ్నిస్తున్నారు. విజయవాడలోని డివిజన్లలో ఉమ్మడిగా అభ్యర్థులను నిలబెట్టిన వామపక్షాలు మేయర్‌‌గా ఎబి వెంకటేశ్వరరావుకు మద్దతు ప్రకటించడంతో పాటు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్